అపొస్తలుల 13:13-25

అపొస్తలుల 13:13-25 TERV

“పాఫు” నుండి పౌలు, అతని స్నేహితులు పంఫూలియాలోని “పెర్గే” అనే పట్టణానికి ఓడలో ప్రయాణం చేసి వెళ్ళారు. యోహాను వాళ్ళను అక్కడ వదిలి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు. వాళ్ళు పెర్గేనుండి పిసిదియ ప్రక్కన ఉన్న అంతియొకయ అనే పట్టణాన్ని చేరుకున్నారు. ఒక విశ్రాంతి రోజు యూదుల సమాజ మందిరములోకి వెళ్ళి కూర్చున్నారు. ధర్మశాస్త్రంలోని విషయాలు, ప్రవక్తల గ్రంథాలు చదివారు. ఆ తదుపరి సమాజమందిరం యొక్క అధికారులు, “సోదరులారా! ప్రజలను ఉత్సాహపరిచే ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా ఉంటే దయచేసి మాట్లాడండి” అని అడగనంపారు. పౌలు లేచి నిలుచొని చేతులెత్తి, ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజలారా! యూదులవలె దైవభీతిగల ప్రజలారా! నా మాటలు వినండి. ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వులను ఎన్నుకొని వాళ్ళు ఈజిప్టులో పరదేశీయులుగా ఉన్నప్పుడు వాళ్ళను గొప్పవాళ్ళుగా చేసాడు. తన అద్భుతమైన శక్తితో ఆ దేశంనుండి వాళ్ళను పిలుచుకెళ్ళి, ఎడారుల్లో వాళ్ళ ప్రవర్తనను నలభై సంవత్సరాలు సహిస్తూ వాళ్ళను కాపాడాడు. కనాను దేశంలో ఏడు జాతుల్ని పడగొట్టి తన ప్రజల్ని ఆ ప్రాంతానికి వారసులుగా చేసాడు. ఇవి చేయటానికి సుమారు నాలుగు వందల ఏబది సంవత్సరాలు పట్టింది. “ఆ తర్వాత దేవుడు సమూయేలు ప్రవక్త కాలందాకా, నాయకత్వం వహించగల న్యాయాధిపతుల్ని పంపాడు. తమకు ‘రాజు’ కావాలని కోరగా కీషు కుమారుడైన ‘సౌలును’ వాళ్ళకు రాజుగా పంపాడు. ఇతడు బెన్యామీను వంశానికి చెందినవాడు. సౌలు నలభై సంవత్సరాలు పాలించాడు. సౌలును తీసివేసాక దావీదును వాళ్ళ రాజుగా చేసాడు. దావీదు విషయంలో తన అంగీకారం చూపుతూ దేవుడు యిలా అన్నాడు: ‘యెష్షయి కుమారుడైన దావీదు నా మనస్సుకు నచ్చాడు. అతడు నేను చెప్పినట్లు చేస్తాడు.’ “దేవుడు తన వాగ్దానానుసారం ఇశ్రాయేలు ప్రజల కోసం రక్షకుడైనటువంటి యేసును ఇతని వంశంలో జన్మింపచేసాడు. యేసు రాకముందు, యోహాను మారుమనస్సును గురించి బాప్తిస్మమును గురించి ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. తన కర్తవ్యం ముగిసే చివరి దశలో అతడు ఇలా అన్నాడు: ‘నేనెవర్ననుకొన్నారు? నేను మీరనుకొంటున్న వాణ్ణి కాదు! కాని నా తర్వాత ఆయన రాబోతున్నాడు. ఆయన చెప్పులు తాకే అర్హత కూడా నాకు లేదు.’

అపొస్తలుల 13:13-25 కోసం వీడియో