అపొస్తలుల కార్యములు 13:13-25

అపొస్తలుల కార్యములు 13:13-25 OTSA

తర్వాత పౌలు, అతని సహచరులు ఓడ ఎక్కి పాఫు నుండి పంఫులియా లోని పెర్గే పట్టణానికి వచ్చారు, యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయాడు. అప్పుడు వారు పెర్గే పట్టణం నుండి బయలుదేరి పిసిదియ ప్రాంతంలోని అంతియొకయ పట్టణానికి వచ్చారు. సబ్బాతు దినాన వారు సమాజమందిరానికి వెళ్లి కూర్చున్నారు. ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల లేఖనాలను చదివిన తర్వాత సమాజమందిరపు అధికారులు, “సహోదరులారా, ప్రజలను ప్రోత్సహించే వాక్యం చెప్పాలని ఉంటే చెప్పండి” అని వారికి వర్తమానం పంపారు. పౌలు లేచి నిలబడి తన చేతితో సైగ చేస్తూ, “తోటి ఇశ్రాయేలీయులారా, దేవుని ఆరాధించే యూదేతరులారా, నా మాటలను వినండి! ఇశ్రాయేలు దేశ ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకుని, వారిని ఈజిప్టులో అభివృద్ధిపరచి, వారిని తన గొప్ప శక్తితో ఆ దేశం నుండి బయటకు రప్పించారు. రప్పించిన తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలో వారి ప్రవర్తనను సహించారు, కనాను దేశంలోని ఏడు జాతుల వారిని తరిమివేసి, వారి దేశాన్ని తన ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చారు. సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలు ఈ సంఘటనలన్ని జరిగాయి. “ఆ తర్వాత, సమూయేలు ప్రవక్త కాలం వరకు దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చారు. తర్వాత ప్రజలు తమకు రాజు కావాలని అడిగినప్పుడు, దేవుడు బెన్యామీను గోత్రానికి చెందిన కీషు కుమారుడైన సౌలును వారికి రాజుగా ఇచ్చారు, అతడు వారిని నలభై సంవత్సరాలు పరిపాలించాడు. సౌలును తొలగించిన తర్వాత, దావీదును వారికి రాజుగా చేశాడు. దేవుడు అతని గురించి, ‘యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. నేను చేయాలని ఉద్దేశాలన్నిటిని అతడు నెరవేరుస్తాడు’ అని సాక్ష్యమిచ్చారు. “దేవుడు తాను చేసిన వాగ్దానం ప్రకారం, దావీదు సంతానం నుండి ఇశ్రాయేలు ప్రజల కోసం యేసు రక్షకుని పుట్టించారు. యేసు రాకముందు, పశ్చాత్తాపం బాప్తిస్మం గురించి యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికి బోధించాడు. యోహాను తాను వచ్చిన పనిని ముగిస్తూ, ‘నేను ఎవరని మీరు అనుకుంటున్నారా? మీరు ఎదురు చూస్తున్న వానిని నేను కాదు. కాని నా తర్వాత వస్తున్న వాని చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు’ అన్నాడు.

అపొస్తలుల కార్యములు 13:13-25 కోసం వీడియో