అపొస్తలుల కార్యములు 13:13-25

అపొస్తలుల కార్యములు 13:13-25 TELUBSI

తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ యెక్కి పాఫునుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజమందిరపు అధికారులు–సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైన బోధవాక్యము చెప్పవలెనని యున్నయెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను– ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొనివచ్చి యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి యిచ్చెను. ఇంచుమించు నాలుగువందల ఏబది సంవత్సరములు ఇట్లు జరిగెను. అటుతరువాత ప్రవక్తయైన సమూయేలువరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయ చేసెను. ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్లవరకు దయచేసెను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన–నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను. అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా –నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను; ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను.

అపొస్తలుల కార్యములు 13:13-25 కోసం వీడియో