1 యోహాను 2:1-11

1 యోహాను 2:1-11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

నా ప్రియ పిల్లలారా, మీరు పాపం చేయకూడదని మీకు ఇలా వ్రాస్తున్నాను. కాని ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర న్యాయవాదిగా నీతిమంతుడైన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. ఆయనే మన పాపాలకు ప్రాయశ్చిత్త బలి, మనకొరకు మాత్రమే కాదు కాని లోకమంతటి పాపాల కొరకు కూడా. ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తే మనం ఆయనను తెలుసుకున్నామని మనం తెలుసుకుంటాము. కాని ఎవరైన “నేను ఆయనను తెలుసుకున్నాను” అని చెప్తూ, ఆయన ఆజ్ఞాపించింది చేయనివారు అబద్ధికులు, వారిలో సత్యం ఉండదు. అయితే ఎవరు ఆయన వాక్యానికి లోబడతారో, వారిలో దేవుని పట్ల ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది. మనం ఆయనలో ఉన్నామని దీనిని బట్టి తెలుసుకుంటాము. ఆయనలో జీవిస్తున్నామని చెప్పేవారు యేసుక్రీస్తులా జీవించాలి. ప్రియ స్నేహితులారా, నేను మీకు క్రొత్త ఆజ్ఞ వ్రాయడం లేదు, ప్రారంభం నుండి మీరు కలిగి ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. ఈ పాత ఆజ్ఞ మీరు విన్న సందేశమే. అయినా నేను ఒక క్రొత్త ఆజ్ఞ వ్రాస్తున్నాను; చీకటి గతించిపోతుంది, ఇప్పటికే నిజమైన వెలుగు ప్రకాశిస్తున్నది కనుక దాని సత్యం ఆయనలో మీలో కూడ కనిపిస్తూ ఉంది. తాను వెలుగులో ఉన్నానని చెప్తూ ఒక సహోదరున్ని లేక సహోదరిని ద్వేషించేవారు ఇంకా చీకటిలోనే ఉన్నారు. తన సహోదరిని సహోదరులను ప్రేమించేవారు వెలుగులో జీవిస్తారు; వారిని అభ్యంతరం కలిగించేది ఏది వారిలో ఉండదు. అయితే తన సహోదరిని లేదా సహోదరుని ద్వేషించేవారు చీకటిలో ఉంటారు, చీకటిలోనే తిరుగుతారు. ఆ చీకటి వారిని గ్రుడ్డివారిగా చేస్తుంది, కనుక తాము ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు.

షేర్ చేయి
Read 1 యోహాను 2

1 యోహాను 2:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం. ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది. “నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు. ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి. ప్రియులారా, నేను మీకు రాస్తున్నది కొత్త ఆజ్ఞ కాదు. ఇది ఆరంభం నుంచీ మీకు ఉన్న పాత ఆజ్ఞే. ఈ పాత ఆజ్ఞ మీరు విన్న వాక్కే. అయినా, మీకు కొత్త ఆజ్ఞ రాస్తున్నాను. క్రీస్తులోనూ, మీలోనూ ఇది నిజమే. ఎందుకంటే చీకటి వెళ్ళిపోతూ ఉంది. నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తూ ఉంది. తాను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, తన సోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. తన సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. అతడు తడబడి పడిపోయే అవకాశం లేదు. కాని తన సోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. చీకట్లోనే నడుస్తూ ఉన్నాడు. చీకటి అతణ్ణి గుడ్డివాడుగా చేసింది కాబట్టి అతడు ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు.

షేర్ చేయి
Read 1 యోహాను 2

1 యోహాను 2:1-11 పవిత్ర బైబిల్ (TERV)

బిడ్డలారా! మీరు పాపం చెయ్యకూడదని మీకు లేఖను వ్రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, మన పక్షాన తండ్రితో మాట్లాడేందుకు న్యాయవాది అయిన యేసు క్రీస్తు ఉన్నాడు. ఆయన మన పాప పరిహారార్థం బలి అయ్యాడు. మన పాపాల కోసమే కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి పాపాలకోసం బలి అయ్యాడు. ఆయన ఆజ్ఞల్ని మనం ఆచరిస్తే, ఆయన మనకు తెలుసుననే విశ్వాసం మనలో కలుగుతుంది. ఆయన నాకు తెలుసని అంటూ ఆయన ఆజ్ఞల్ని పాటించనివాడు అబద్ధాలాడుతున్నాడన్నమాట. అలాంటి వ్యక్తిలో సత్యం ఉండదు. యేసు ఆజ్ఞల్ని పాటించినవానిలో దేవుని ప్రేమ సంపూర్ణంగా ఉంటుంది. తద్వారా మనం ఆయనలో ఉన్నామని తెలుసుకొంటాము. యేసులో జీవిస్తున్నానని చెప్పుకొనేవాడు, ఆయనలా నడుచుకోవాలి. ప్రియ మిత్రులారా! నేను మీ కోసం క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మొదటినుండి మీ దగ్గర ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. మీరు విన్న సందేశమే ఈ పాత ఆజ్ఞ. అయినా, ఆ ఆజ్ఞను ఒక క్రొత్త ఆజ్ఞగా మీ కోసం వ్రాస్తున్నాను. దాని సత్యం అందరిలో కనిపిస్తోంది. చీకటి గతిస్తోంది. నిజమైన వెలుగు ప్రకాశించటం మొదలు పెట్టింది. తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు యింకా అంధకారంలో ఉన్నాడన్నమాట. సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో జీవిస్తాడు. అతనిలో ఏ ఆటంక కారణం ఉండదు. కాని సోదరుణ్ణి ద్వేషించేవాడు అంధకారంలోనే ఉండిపోతాడు. అంటే, ఆ అంధకారంలోనే తిరుగుతూ ఉంటాడన్న మాట. చీకటి అతణ్ణి గ్రుడ్డివానిగా చేసింది కాబట్టి తానెక్కడికి వెళ్తున్నది అతనికే తెలియదు.

షేర్ చేయి
Read 1 యోహాను 2

1 యోహాను 2:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవ డైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను; ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచు కొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము. ప్రియులారా, మొదటనుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనేగాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు; ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించు చున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయనయందును మీయందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవు చున్నాడో అతనికి తెలియదు.

షేర్ చేయి
Read 1 యోహాను 2

1 యోహాను 2:1-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

నా ప్రియ పిల్లలారా, మీరు పాపం చేయకూడదని మీకు ఇలా వ్రాస్తున్నాను. కాని ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర న్యాయవాదిగా నీతిమంతుడైన యేసు క్రీస్తు మనకు ఉన్నారు. ఆయనే మన పాపాలకు కూడా ఆయనే ప్రాయశ్చిత్త బలి. మన కోసం మాత్రమే కాదు కాని లోకమంతటి పాపాల కోసం కూడా. మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం ఆయనను తెలుసుకున్నామని మనకు తెలుస్తుంది. కాని ఎవరైనా, “నేను ఆయనను తెలుసుకున్నాను” అని చెప్తూ, ఆయన ఆజ్ఞాపించింది చేయనివారు అబద్ధికులు, వారిలో సత్యం ఉండదు. అయితే ఎవరు ఆయన వాక్యానికి లోబడతారో వారిలో దేవుని పట్ల ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది. మనం ఆయనలో ఉన్నామని దీనిని బట్టి తెలుసుకుంటాము. ఆయనలో జీవిస్తున్నామని చెప్పేవారు యేసు క్రీస్తులా జీవించాలి. ప్రియ స్నేహితులారా, నేను మీకు క్రొత్త ఆజ్ఞ వ్రాయడం లేదు కాని ప్రారంభం నుండి మీరు కలిగి ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. ఈ పాత ఆజ్ఞ మీరు విన్న సందేశమే. అయినా నేను ఒక క్రొత్త ఆజ్ఞ వ్రాస్తున్నాను; చీకటి గతించిపోతుంది, ఇప్పటికే నిజమైన వెలుగు ప్రకాశిస్తున్నది కాబట్టి దాని సత్యం ఆయనలో మీలో కనిపిస్తూ ఉంది. తాను వెలుగులో ఉన్నానని చెప్తూ తన సహోదరున్ని సహోదరిని ద్వేషించేవారు ఇంకా చీకటిలోనే ఉన్నారు. తన సహోదరిని సహోదరులను ప్రేమించేవారు వెలుగులో జీవిస్తారు; వారిలో అభ్యంతరం కలిగించేది ఏది ఉండదు. అయితే తన సహోదరిని, సహోదరున్ని ద్వేషించేవారు చీకటిలో ఉండి, చీకటిలోనే తిరుగుతారు. ఆ చీకటి వారిని గ్రుడ్డివారిగా చేస్తుంది, కాబట్టి తాము ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు.

షేర్ చేయి
Read 1 యోహాను 2

1 యోహాను 2:1-11

1 యోహాను 2:1-11 TELUBSI1 యోహాను 2:1-11 TELUBSI