యోహాను వ్రాసిన మొదటి లేఖ 2:1-11

యోహాను వ్రాసిన మొదటి లేఖ 2:1-11 TERV

బిడ్డలారా! మీరు పాపం చెయ్యకూడదని మీకు లేఖను వ్రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, మన పక్షాన తండ్రితో మాట్లాడేందుకు న్యాయవాది అయిన యేసు క్రీస్తు ఉన్నాడు. ఆయన మన పాప పరిహారార్థం బలి అయ్యాడు. మన పాపాల కోసమే కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి పాపాలకోసం బలి అయ్యాడు. ఆయన ఆజ్ఞల్ని మనం ఆచరిస్తే, ఆయన మనకు తెలుసుననే విశ్వాసం మనలో కలుగుతుంది. ఆయన నాకు తెలుసని అంటూ ఆయన ఆజ్ఞల్ని పాటించనివాడు అబద్ధాలాడుతున్నాడన్నమాట. అలాంటి వ్యక్తిలో సత్యం ఉండదు. యేసు ఆజ్ఞల్ని పాటించినవానిలో దేవుని ప్రేమ సంపూర్ణంగా ఉంటుంది. తద్వారా మనం ఆయనలో ఉన్నామని తెలుసుకొంటాము. యేసులో జీవిస్తున్నానని చెప్పుకొనేవాడు, ఆయనలా నడుచుకోవాలి. ప్రియ మిత్రులారా! నేను మీ కోసం క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మొదటినుండి మీ దగ్గర ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. మీరు విన్న సందేశమే ఈ పాత ఆజ్ఞ. అయినా, ఆ ఆజ్ఞను ఒక క్రొత్త ఆజ్ఞగా మీ కోసం వ్రాస్తున్నాను. దాని సత్యం అందరిలో కనిపిస్తోంది. చీకటి గతిస్తోంది. నిజమైన వెలుగు ప్రకాశించటం మొదలు పెట్టింది. తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు యింకా అంధకారంలో ఉన్నాడన్నమాట. సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో జీవిస్తాడు. అతనిలో ఏ ఆటంక కారణం ఉండదు. కాని సోదరుణ్ణి ద్వేషించేవాడు అంధకారంలోనే ఉండిపోతాడు. అంటే, ఆ అంధకారంలోనే తిరుగుతూ ఉంటాడన్న మాట. చీకటి అతణ్ణి గ్రుడ్డివానిగా చేసింది కాబట్టి తానెక్కడికి వెళ్తున్నది అతనికే తెలియదు.