1 యోహాను పత్రిక 2:1-11

1 యోహాను పత్రిక 2:1-11 IRVTEL

నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం. ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది. “నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు. ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి. ప్రియులారా, నేను మీకు రాస్తున్నది కొత్త ఆజ్ఞ కాదు. ఇది ఆరంభం నుంచీ మీకు ఉన్న పాత ఆజ్ఞే. ఈ పాత ఆజ్ఞ మీరు విన్న వాక్కే. అయినా, మీకు కొత్త ఆజ్ఞ రాస్తున్నాను. క్రీస్తులోనూ, మీలోనూ ఇది నిజమే. ఎందుకంటే చీకటి వెళ్ళిపోతూ ఉంది. నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తూ ఉంది. తాను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, తన సోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. తన సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. అతడు తడబడి పడిపోయే అవకాశం లేదు. కాని తన సోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. చీకట్లోనే నడుస్తూ ఉన్నాడు. చీకటి అతణ్ణి గుడ్డివాడుగా చేసింది కాబట్టి అతడు ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు.