1 యోహాను పత్రిక 2:1-11

1 యోహాను పత్రిక 2:1-11 OTSA

నా ప్రియ పిల్లలారా, మీరు పాపం చేయకూడదని మీకు ఇలా వ్రాస్తున్నాను. కాని ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర న్యాయవాదిగా నీతిమంతుడైన యేసు క్రీస్తు మనకు ఉన్నారు. ఆయనే మన పాపాలకు కూడా ఆయనే ప్రాయశ్చిత్త బలి. మన కోసం మాత్రమే కాదు కాని లోకమంతటి పాపాల కోసం కూడా. మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం ఆయనను తెలుసుకున్నామని మనకు తెలుస్తుంది. కాని ఎవరైనా, “నేను ఆయనను తెలుసుకున్నాను” అని చెప్తూ, ఆయన ఆజ్ఞాపించింది చేయనివారు అబద్ధికులు, వారిలో సత్యం ఉండదు. అయితే ఎవరు ఆయన వాక్యానికి లోబడతారో వారిలో దేవుని పట్ల ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది. మనం ఆయనలో ఉన్నామని దీనిని బట్టి తెలుసుకుంటాము. ఆయనలో జీవిస్తున్నామని చెప్పేవారు యేసు క్రీస్తులా జీవించాలి. ప్రియ స్నేహితులారా, నేను మీకు క్రొత్త ఆజ్ఞ వ్రాయడం లేదు కాని ప్రారంభం నుండి మీరు కలిగి ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. ఈ పాత ఆజ్ఞ మీరు విన్న సందేశమే. అయినా నేను ఒక క్రొత్త ఆజ్ఞ వ్రాస్తున్నాను; చీకటి గతించిపోతుంది, ఇప్పటికే నిజమైన వెలుగు ప్రకాశిస్తున్నది కాబట్టి దాని సత్యం ఆయనలో మీలో కనిపిస్తూ ఉంది. తాను వెలుగులో ఉన్నానని చెప్తూ తన సహోదరున్ని సహోదరిని ద్వేషించేవారు ఇంకా చీకటిలోనే ఉన్నారు. తన సహోదరిని సహోదరులను ప్రేమించేవారు వెలుగులో జీవిస్తారు; వారిలో అభ్యంతరం కలిగించేది ఏది ఉండదు. అయితే తన సహోదరిని, సహోదరున్ని ద్వేషించేవారు చీకటిలో ఉండి, చీకటిలోనే తిరుగుతారు. ఆ చీకటి వారిని గ్రుడ్డివారిగా చేస్తుంది, కాబట్టి తాము ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు.