ఆది 26

26
ఇస్సాకు అబీమెలెకు
1ఆ దేశంలో అబ్రాహాము కాలంలో వచ్చిన కరువు కాక మరో కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులోని ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరకు వెళ్లాడు. 2యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై ఇలా అన్నారు, “నీవు ఈజిప్టుకు వెళ్లకు; నేను చెప్పిన దేశంలోనే నివసించు. 3కొంతకాలం ఈ దేశంలోనే ఉండు, నేను నీకు తోడుగా ఉండి, నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు నీ వారసులకు ఈ దేశాలన్నీ ఇస్తాను, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేరుస్తాను. 4నీ వారసులను ఆకాశంలోని అనేక నక్షత్రాల్లా విస్తరింపజేసి ఈ దేశాలన్నీ వారికిస్తాను, నీ సంతానం ద్వారా సమస్త భూప్రజలు ఆశీర్వదించబడతారు, 5ఎందుకంటే అబ్రాహాము నా మాట విని, నేను చెప్పింది చేశాడు, నా ఆజ్ఞలను, కట్టడలను, సూచనలను పాటించాడు.” 6కాబట్టి ఇస్సాకు గెరారులో నివసించాడు.
7అక్కడి మనుష్యులు అతని భార్యను చూసి ఆమె ఎవరు అని అతన్ని అడిగితే, “ఆమె నా సోదరి” అని చెప్పాడు, ఎందుకంటే, “ఆమె నా భార్య” అని చెప్పడానికి భయపడ్డాడు. “రిబ్కా అందంగా ఉంది కాబట్టి తనను బట్టి ఈ స్థలం యొక్క మనుష్యులు నన్ను చంపేస్తారు” అని అతడు అనుకున్నాడు.
8ఇస్సాకు అక్కడ చాలా కాలం ఉన్నాడు, ఒక రోజు ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీలో నుండి ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరసాలాడడం చూశాడు. 9కాబట్టి అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, “నిజంగా ఈమె నీ భార్య కదా! ‘ఆమె నా సోదరి’ అని ఎందుకు చెప్పావు?” అని అడిగాడు.
ఇస్సాకు, “ఆమె కారణంగా నా ప్రాణం పోతుందేమో అని అనుకున్నాను” అని జవాబిచ్చాడు.
10అప్పుడు అబీమెలెకు, “నీవు మా పట్ల చేసినదేంటి? ఈ మనుష్యుల్లో ఎవరైనా ఆమెతో శయనించి ఉండేవారు. అప్పుడు నీవు మాపైన అపరాధం తెచ్చిపెట్టేవాడివి” అని అన్నాడు.
11అప్పుడు అబీమెలెకు ప్రజలందరికి ఆదేశించాడు: “ఎవరైనా ఈ మనుష్యునికి లేదా అతని భార్యకు హాని చేస్తే, వారికి మరణశిక్ష విధించబడును.”
12ఇస్సాకు ఆ దేశంలో విత్తనాలు విత్తాడు, యెహోవా అతన్ని దీవించారు కాబట్టి, అదే సంవత్సరం అతనికి నూరంతల పంట వచ్చింది. 13అతడు ధనికుడయ్యాడు, అతడు ఎంతో గొప్పవాడయ్యే వరకు అతని ఆస్తి వృద్ధిచెందుతూ ఉంది. 14అతనికి మందలు, పశువులు, దాసులు ఎక్కువగా ఉన్నందుకు ఫిలిష్తీయులు అసూయపడ్డారు. 15అతని తండ్రియైన అబ్రాహాము కాలంలో అతని దాసులు త్రవ్విన బావులన్ని ఫిలిష్తీయులు మట్టితో నింపి పూడ్చేశారు.
16అబీమెలెకు ఇస్సాకుతో, “నీవు ఇక్కడినుండి వెళ్లిపో; మాకంటే చాలా బలవంతుడవు అయ్యావు” అన్నాడు.
17కాబట్టి ఇస్సాకు అక్కడినుండి గెరారు లోయకు వెళ్లి, గుడారం వేసుకుని అక్కడ స్థిరపడ్డాడు. 18తన తండ్రి అబ్రాహాము కాలంలో త్రవ్వించిన బావులను అతడు చనిపోయాక ఫిలిష్తీయులు పూడ్చేసిన వాటిని ఇస్సాకు తిరిగి త్రవ్వించాడు, వాటికి తన తండ్రి పెట్టిన అవే పేర్లు పెట్టాడు.
19ఇస్సాకు సేవకులు గెరారు లోయలో కూడా త్రవ్వినప్పుడు మంచి నీళ్ల బావి కనుగొన్నారు. 20అయితే గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో గొడవపడి, “ఈ నీళ్లు మావి!” అని అన్నారు. వారు జగడమాడారు కాబట్టి ఇస్సాకు ఆ బావికి ఏశెకు#26:20 ఏశెకు అంటే జగడం అని పేరు పెట్టాడు. 21తర్వాత వారు మరో బావి త్రవ్వారు, కానీ దాని కోసం కూడా గొడవపడ్డారు; కాబట్టి ఆ బావికి శిత్నా#26:21 శిత్నా అంటే వ్యతిరేకత. అని పేరు పెట్టాడు. 22అతడు అక్కడినుండి వెళ్లి మరో బావి త్రవ్వించాడు, దాని కోసం ఎలాంటి గొడవ జరగలేదు. అతడు, “ఇప్పుడు యెహోవా మాకు స్థలం ఇచ్చారు, మేము ఈ దేశంలో వర్ధిల్లుతాము” అని ఆ బావికి రహెబోతు#26:22 రహెబోతు అంటే గది అని పేరు పెట్టాడు.
23అక్కడినుండి అతడు బెయేర్షేబకు వెళ్లాడు. 24ఆ రాత్రి యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై, “నేను నీ తండ్రి అబ్రాహాము దేవుడను. భయపడకు, నేను నీతో ఉన్నాను; నా సేవకుడైన అబ్రాహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, సంఖ్యాపరంగా నీ వారసులను విస్తరింపజేస్తాను” అని అన్నారు.
25ఇస్సాకు అక్కడ బలిపీఠం కట్టి యెహోవాను ఆరాధించాడు. అక్కడ తన గుడారం వేసుకున్నాడు, అక్కడే తన సేవకులు బావి త్రవ్వారు.
26ఇంతలో అబీమెలెకు, అతని స్నేహితుడు అహుజతు, సేనాధిపతి ఫీకోలు, గెరారు నుండి ఇస్సాకు దగ్గరకు వచ్చారు. 27ఇస్సాకు వారిని, “మీరెందుకు నా దగ్గరకు వచ్చారు, నాకు వ్యతిరేకంగా ఉంటూ నన్ను పంపివేశారు కదా?” అని అడిగాడు.
28వారు జవాబిస్తూ ఇలా అన్నారు, “యెహోవా నీతో ఉండడం మేము స్పష్టంగా చూశాం; కాబట్టి, ‘మాకు నీకు మధ్య ప్రామాణిక ఒప్పందం ఉండాలి’ అని మేము అనుకున్నాము. కాబట్టి మనం ఒప్పందం చేసుకుందాము. 29మేము నీకు ఏ హాని చేయలేదు కాని మిమ్మల్ని మంచిగా చూసుకుని సమాధానంతో పంపించాం, కాబట్టి నీవు మాకు ఏ హాని చేయకూడదు. ఇప్పుడు నీవు యెహోవాచేత ఆశీర్వదించబడ్డావు.”
30అప్పుడు ఇస్సాకు వారికి విందు చేశాడు, వారు తిని త్రాగారు. 31మర్నాడు వేకువజామున వారు లేచి, ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకున్నారు. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపాడు, వారు అక్కడినుండి సమాధానంతో వెళ్లారు.
32ఆ రోజు ఇస్సాకు సేవకులు వచ్చి అతనితో వారు త్రవ్విన మరో బావి గురించి ఇలా చెప్పారు. వారు, “మాకు నీళ్లు కనిపించాయి!” అని చెప్పారు. 33అతడు ఆ బావికి షేబ#26:33 షేబ అంటే ఒప్పందం లేదా ఏడు. అని పేరు పెట్టాడు, అందుకే ఇప్పటివరకు ఆ పట్టణం పేరు బెయేర్షేబ.#26:33 బెయేర్షేబ అంటే ఒప్పంద బావి అలాగే ఏడింటి బావి.
యాకోబు ఏశావు ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు
34ఏశావు నలభై సంవత్సరాల వయస్సులో, హిత్తీయుడైన బెయేరి కుమార్తె యహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తె బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు. 35ఈ ఇద్దరు ఇస్సాకు రిబ్కాల దుఃఖానికి కారకులయ్యారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఆది 26: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

ఆది 26 కోసం వీడియో