ఆది 27

27
1ఇస్సాకు వృద్ధుడైనప్పుడు, అతడు ఇక చూడలేనంతగా తన కళ్ళు మసకబారినప్పుడు, తన పెద్దకుమారుడైన ఏశావును, “నా కుమారుడా” అని పిలిచాడు.
అతడు, “చిత్తం, నేను ఉన్నాను” అని జవాబిచ్చాడు.
2ఇస్సాకు ఇలా అన్నాడు, “నేను వృద్ధున్ని అని నాకు తెలుసు, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. 3కాబట్టి నీవు నీ ఆయుధాలను అంటే నీ అంబులపొదిని విల్లును తీసుకుని అడవికి వెళ్లి జంతువును వేటాడి నాకు మాంసం తెచ్చిపెట్టు. 4నాకు ఇష్టమైన భోజనం రుచిగా సిద్ధం చేసి తీసుకురా, నేను చనిపోకముందు తిని నిన్ను దీవిస్తాను” అని చెప్పాడు.
5అయితే ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో మాట్లాడుతున్నప్పుడు రిబ్కా విన్నది. ఏశావు వేటాడేందుకు బహిరంగ పొలానికి వెళ్లిపోయాక, 6రిబ్కా తన కుమారుడైన యాకోబుతో, “ఇదిగో, నీ తండ్రి నీ అన్న ఏశావుతో చెప్పడం నేను విన్నాను, 7‘నేను చనిపోకముందు దానిని తిని యెహోవా సన్నిధిలో నిన్ను దీవిస్తాను’ అందుకు నీవు నా కోసం వేటాడి మాంసం తెచ్చి రుచికరమైన భోజనం సిద్ధం చేసి తీసుకురా అని చెప్పాడు. 8కాబట్టి నా కుమారుడా! నా మాట జాగ్రతగా విని, నేను చెప్పినట్టు చేయి: 9మన మందలో నుండి రెండు మంచి మేక పిల్లలను తీసుకురా, నేను నీ తండ్రికి ఇష్టమైన భోజనం వండి పెడతాను. 10అప్పుడు నీ తండ్రి తినడానికి దానిని తీసుకెళ్లు, అప్పుడు అతడు చనిపోకముందు నిన్ను దీవిస్తాడు” అని చెప్పింది.
11యాకోబు తన తల్లి రిబ్కాతో, “నా అన్న ఏశావు వెంట్రుకలు గలవాడు, నాకు నునుపైన చర్మం ఉంది. 12ఒకవేళ నా తండ్రి నన్ను తాకిచూస్తే ఎలా? అతన్ని మోసం చేసినవాడనై, నా మీదికి ఆశీర్వాదానికి బదులు శాపం తెచ్చుకున్నవాన్ని అవుతాను” అని అన్నాడు.
13అతని తల్లి అతనితో, “నా కుమారుడా, ఆ శాపం నా మీదికే రానివ్వు. కేవలం నేను చెప్పింది చేయి; వెళ్లి వాటిని నా కోసం తీసుకురా” అని చెప్పింది.
14కాబట్టి అతడు వెళ్లి వాటిని తన తల్లి దగ్గరకు తెచ్చాడు, ఆమె అతని తండ్రికి ఇష్టమైన భోజనం వండింది. 15తర్వాత రిబ్కా ఇంట్లో ఉన్న తన పెద్దకుమారుడైన ఏశావు యొక్క శ్రేష్ఠమైన బట్టలు తీసుకుని తన చిన్న కుమారుడైన యాకోబుకు తొడిగించింది. 16ఆమె అతని చేతులను, మెడ దగ్గర ఉండే నునుపైన భాగాలను మేక చర్మంతో కప్పింది. 17తర్వాత తాను చేసిన రుచిగల భోజనాన్ని, రొట్టెలను యాకోబు చేతికి ఇచ్చింది.
18యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, “నా తండ్రి” అని పిలిచాడు.
“నా కుమారుడా, నీవెవరివి?” అని అతడు అడిగాడు.
19యాకోబు తన తండ్రితో, “నేను నీ మొదటి కుమారుడనైన ఏశావును, నీవు చెప్పిన ప్రకారం నేను చేశాను. నన్ను ఆశీర్వదించడానికి లేచి, నేను చేసింది తిను” అని అన్నాడు.
20ఇస్సాకు తన కుమారున్ని, “నా కుమారుడా, ఇంత త్వరగా నీకు ఎలా దొరికింది?” అని అడిగాడు.
యాకోబు, “నీ దేవుడైన యెహోవా నా దగ్గరకు దానిని తీసుకువచ్చారు” అని జవాబిచ్చాడు.
21అప్పుడు ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, నా దగ్గరకు రా, నేను నిన్ను ముట్టుకొని, నీవు నిజంగా ఏశావువో కాదో తెలుసుకుంటాను” అని అన్నాడు.
22యాకోబు తండ్రి దగ్గరకు వెళ్లగా, ఇస్సాకు అతన్ని తాకిచూసి, “స్వరం యాకోబు స్వరంలా ఉంది, కాని చేతులు ఏశావులా ఉన్నాయి” అని అన్నాడు. 23యాకోబు చేతులు తన అన్న ఏశావులా రోమాలు కలిగి ఉన్నాయి కాబట్టి అతడు గుర్తు పట్టలేదు; కాబట్టి అతన్ని దీవించడం ప్రారంభించాడు. 24“నీవు నిజంగా నా కుమారుడైన ఏశావువేనా?” అని అతడు అడిగాడు.
“అవును నేనే” అని అతడు జవాబిచ్చాడు.
25అప్పుడు అతడు, “నా కుమారుడా, నీవు వండింది కొంత తీసుకురా, నేను తిని నిన్ను దీవిస్తాను” అని అన్నాడు.
యాకోబు తెచ్చాడు, అతడు తిన్నాడు; ద్రాక్షరసం తెచ్చాడు, అతడు త్రాగాడు. 26అప్పుడు అతని తండ్రి ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, దగ్గరకు వచ్చి నాకు ముద్దుపెట్టు” అన్నాడు.
27కాబట్టి అతడు దగ్గరకు వెళ్లి అతనికి ముద్దుపెట్టాడు. ఇస్సాకు కుమారుని వస్త్రాల వాసనను పసిగట్టి, అతన్ని ఇలా దీవించాడు,
“ఆహా, నా కుమారుని వాసన
యెహోవా దీవించిన
పొలం యొక్క సువాసన
28దేవుడు నీకు ఆకాశపు మంచును,
భూమి యొక్క సారాన్ని,
సమృద్ధికరమైన ధాన్యాన్ని, నూతన ద్రాక్షరసాన్ని ఇచ్చును గాక.
29జనాంగాలు నీకు సేవ చేయాలి,
జనాలు నీకు తలవంచాలి.
నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు,
నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి.
నిన్ను శపించేవారు శపించబడతారు
నిన్ను దీవించే వారు దీవించబడతారు.”
30ఇస్సాకు అతన్ని దీవించడం ముగించిన తర్వాత, యాకోబు తండ్రి దగ్గర నుండి వెళ్లీ వెళ్లకముందే, తన సోదరుడు ఏశావు వేటనుండి వచ్చాడు. 31అతడు కూడా రుచిగల భోజనం వండుకొని తన తండ్రి దగ్గరకు తీసుకువచ్చాడు. అప్పుడతడు, “నా తండ్రి, నన్ను దీవించడానికి నేను వేటాడి తెచ్చిన మాంసంతో సిద్ధం చేసిన భోజనం తిను” అని అతనితో అన్నాడు.
32అప్పుడు తన తండ్రి ఇస్సాకు, “నీవెవరివి?” అని అడిగాడు.
అందుకతడు, “నేను నీ కుమారున్ని, నీ మొదటి సంతానమైన ఏశావును” అని జవాబిచ్చాడు.
33ఇస్సాకు గజగజ వణకుతూ ఇలా అన్నాడు, “మరీ ఇంతకుముందు వేట మాంసం తెచ్చి పెట్టింది ఎవరు? నీవు రాకముందే నేను తిని అతన్ని దీవించాను; నిజంగా అతడు దీవించబడతాడు!”
34తన తండ్రి మాట విన్న వెంటనే ఏశావు దుఃఖంతో బిగ్గరగా ఏడ్చి, “నన్ను కూడా దీవించు, నా తండ్రి!” అని అన్నాడు.
35అయితే అతడు, “నీ తమ్ముడు మోసపూరితంగా వచ్చి నీ దీవెనను తీసుకున్నాడు” అన్నాడు.
36ఏశావు, “అతనికి యాకోబు#27:36 యాకోబు అంటే అతడు మడిమెను పట్టుకుంటాడు హెబ్రీ భాషషైలిలో అతడు మోసం చేస్తాడు. అని సరిగ్గానే పేరు పెట్టారు కదా? నన్ను అతడు మోసగించడం ఇది రెండవసారి: నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, ఇప్పుడు నా దీవెనను దొంగిలించాడు! నా కోసం ఒక్క దీవెన కూడా మిగలలేదా?” అని అడిగాడు.
37ఇస్సాకు జవాబిస్తూ, “నేను అతన్ని నీపై ప్రభువుగా నియమించాను, అతని బంధువులందరినీ అతనికి దాసులుగా చేశాను, సమృద్ధిగా ధాన్యం, ద్రాక్షరసం అతనికి సమకూర్చాను. కాబట్టి నా కుమారుడా! ఇప్పుడు నీకోసం నేను ఏమి చేయగలను?” అని అడిగాడు.
38అందుకు ఏశావు తన తండ్రితో, “నా తండ్రి, ఒక్క దీవెననే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించు!” అని అంటూ గట్టిగా ఏడ్చాడు.
39అప్పుడు ఇస్సాకు అతనికి జవాబిస్తూ ఇలా అన్నాడు,
“నీ నివాసం
సారవంతమైన భూమికి దూరంగా,
పైనున్న ఆకాశం యొక్క మంచుకు దూరంగా ఉంటుంది.
40నీవు నీ ఖడ్గం చేత జీవిస్తావు
నీ సోదరునికి సేవ చేస్తావు,
అయితే నీవు విశ్రాంతి లేక ఉన్నప్పుడు,
నీ మెడ మీద నుండి అతని కాడి
విరిచి పడవేస్తావు.”
41తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెనను బట్టి ఏశావు తన సోదరుని మీద పగబెట్టుకున్నాడు, “నా తండ్రిని గురించి దుఃఖించే రోజులు సమీపంగా ఉన్నాయి; తర్వాత నా సోదరుడైన యాకోబును చంపేస్తా” అని తనకు తాను అనుకున్నాడు.
42రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు ఏమన్నాడో తెలుసుకుని, తన చిన్న కుమారుడైన యాకోబును పిలిపించి అతనితో ఇలా అన్నది, “నీ అన్న ఏశావు నిన్ను చంపి ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాడు. 43కాబట్టి నా కుమారుడా! నేను చెప్పేది విను: హారానులో ఉన్న నా సోదరుడైన లాబాను దగ్గరకు పారిపో. 44మీ అన్న కోపం తగ్గే వరకు అక్కడ కొంతకాలం అతని దగ్గరే ఉండు. 45అతని కోపం చల్లారి, నీవు అతనికి చేసింది అతడు మరచిపోయిన తర్వాత, నేను నీకు కబురు పెడతాను. ఒక్క రోజే మీ ఇద్దరిని ఎందుకు పోగొట్టుకోవాలి?”
46తర్వాత రిబ్కా ఇస్సాకుతో, “ఈ హిత్తీయుల స్త్రీల వలన నేను విసిగిపోయాను. యాకోబు కూడా ఇలాంటి హిత్తీయుల స్త్రీలలా ఈ దేశ స్త్రీని భార్యగా చేసుకుంటే, ఇక నేను బ్రతికి లాభం లేదు” అని అన్నది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఆది 27: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

ఆది 27 కోసం వీడియో