ఆది 25

25
అబ్రాహాము మృతి
1అబ్రాహాము కెతూరా అనే మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు, 2ఆమె అతనికి కన్న కుమారులు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. 3యొక్షాను కుమారులు షేబ, దేదాను; అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు దేదాను వారసులు. 4ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా మిద్యాను కుమారులు. వీరంతా కెతూరా సంతానము.
5అబ్రాహాము తనకున్నదంతా ఇస్సాకుకు ఇచ్చాడు. 6అయితే అబ్రాహాము ఇంకా బ్రతికి ఉండగానే తన ఉపపత్నులకు పుట్టిన కుమారులకు బహుమానాలిచ్చి, వారినందరిని తన కుమారుడైన ఇస్సాకు దగ్గర నుండి తూర్పు ప్రాంతాలకు పంపివేశాడు.
7అబ్రాహాము నూట డెబ్బై సంవత్సరాలు జీవించాడు. 8అబ్రాహాము తన వృద్ధాప్యంలో, సంవత్సరాలు నిండిన వృద్ధునిగా తుది శ్వాస విడిచి చనిపోయాడు; తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు. 9అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలులు కలిసి తమ తండ్రిని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా గుహలో సమాధి చేశారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడైన ఎఫ్రోను పొలము. 10అబ్రాహాము ఆ పొలాన్ని హిత్తీయుల దగ్గర కొన్నాడు. అందులో అబ్రాహాము తన భార్యయైన శారాతో పాటు పాతిపెట్టబడ్డాడు. 11అబ్రాహాము మృతి చెందిన తర్వాత, దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించారు, అప్పుడు అతడు బెయేర్-లహాయి-రోయి దగ్గర నివసించాడు.
ఇష్మాయేలు కుమారులు
12శారా దాసి, ఈజిప్టుకు చెందిన హాగరు, అబ్రాహాముకు కన్న ఇష్మాయేలు కుటుంబ వంశావళి:
13ఇష్మాయేలు కుమారులు, వారు పుట్టిన క్రమం ప్రకారం వారి పేర్లు:
ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు,
కేదారు, అద్బీయేలు, మిబ్శాము,
14మిష్మా, దూమా, మశ్శా,
15హదదు, తేమా, యెతూరు,
నాపీషు, కెదెమా.
16వీరు ఇష్మాయేలు కుమారులు, వారి వారి స్థావరాలలో, శిబిరాలలో, తమ తమ జనాంగాలకు పన్నెండుగురు గోత్ర పాలకుల పేర్లు.
17ఇష్మాయేలు నూట ముప్పై ఏడు సంవత్సరాలు జీవించాడు. తన తుది శ్వాస విడిచి చనిపోయాడు, తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు. 18అతని వారసులు అష్షూరు వైపు వెళ్లే మార్గంలో హవీలా నుండి ఈజిప్టు సరిహద్దు దగ్గర ఉన్న షూరు వరకు ఉన్న ప్రాంతంలో స్థిరపడ్డారు. వారు తమ సోదరులందరికి విరోధంగా#25:18 లేదా తూర్పు వైపున నివసించారు.
యాకోబు ఏశావు
19అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు వంశావళి.
అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, 20ఇస్సాకు పద్దనరాములోని సిరియావాడైన బెతూయేలు కుమార్తె, లాబాను సోదరియైన రిబ్కాను పెళ్ళి చేసుకున్నప్పుడు అతని వయస్సు నలభై సంవత్సరాలు.
21రిబ్కాకు సంతానం కలుగలేదు కాబట్టి ఇస్సాకు ఆమె గురించి యెహోవాకు ప్రార్థన చేశాడు, యెహోవా అతని ప్రార్థనకు జవాబిచ్చారు, అతని భార్య రిబ్కా గర్భవతి అయ్యింది. 22ఆమె గర్భంలో పిల్లలు ఒకరితో ఒకరు పెనుగులాడారు, అందుకు ఆమె, “నాకెందుకు ఇలా జరుగుతుంది?” అని అంటూ యెహోవాను అడగడానికి వెళ్లింది.
23యెహోవా ఆమెతో ఇలా చెప్పారు,
“నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి,
ఈ రెండు జనాంగాలు నీ గర్భం నుండే వేరుగా ఉంటాయి;
ఒక జనం మరొక జనం కంటే బలంగా ఉంటారు.
పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు.”
24ఆమె ప్రసవ కాలం సమీపించినప్పుడు, ఆమె గర్భంలో కవలపిల్లలు ఉన్నారు. 25మొదట పుట్టినవాడు ఎర్రగా ఉన్నాడు, అతని శరీరమంతా రోమాల వస్త్రంలా ఉంది; కాబట్టి అతనికి ఏశావు#25:25 ఏశావు బహుశ అర్థం రోమాలు గలవాడు అని పేరు పెట్టారు. 26తర్వాత అతని సోదరుడు, అతని మడిమెను పట్టుకుని బయటకు వచ్చాడు, అతనికి యాకోబు#25:26 యాకోబు అంటే అతడు మడిమెను పట్టుకుంటాడు హెబ్రీ భాషషైలిలో అతడు మోసం చేస్తాడు. అని పేరు పెట్టారు. రిబ్కా వారికి జన్మనిచ్చినప్పుడు ఇస్సాకు వయస్సు అరవై సంవత్సరాలు.
27అబ్బాయిలు పెరిగారు, ఏశావు అరణ్యంలో తిరుగుతూ నేర్పుగల వేటగాడయ్యాడు. యాకోబు నెమ్మదస్థుడై గుడారాల్లో నివసించేవాడు. 28ఇస్సాకు వేటాడిన మాంసం కోరుకునేవాడు, అతడు ఏశావును ప్రేమించేవాడు, కానీ రిబ్కా యాకోబును ప్రేమించేది.
29ఒక రోజు యాకోబు వంటకం చేస్తున్నపుడు, ఏశావు పొలం నుండి బాగా ఆకలితో వచ్చి, 30“నేను చాలా ఆకలితో ఉన్నాను, నీవు వండుచున్న ఆ ఎర్రని కూర కొంచెం నాకు పెట్టు!” అని అడిగాడు, (అందుకే అతనికి ఎదోము#25:30 ఎదోము అంటే ఎర్రని. అని పేరు వచ్చింది.)
31యాకోబు, “అలా అయితే మొదట నీ జ్యేష్ఠత్వపు హక్కు#25:31 జ్యేష్ఠత్వపు హక్కు జ్యేష్ఠులు తమ తండ్రి దగ్గర పొందుకునే స్వాస్థ్యము. జ్యేష్ఠులు ఇతర పిల్లలకంటే రెండింతలు ఎక్కువ పొందుకుంటారు. నాకు అమ్ము” అని అన్నాడు.
32అప్పుడు ఏశావు, “నేను ఆకలితో చస్తూ ఉంటే నాకు జ్యేష్ఠత్వం దేనికి ఉపయోగం?” అని అన్నాడు.
33అయితే యాకోబు, “ముందు నాకు ప్రమాణం చేయి” అన్నాడు. కాబట్టి ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకు అమ్మివేస్తున్నట్టుగా ప్రమాణం చేశాడు.
34అప్పుడు యాకోబు కొంత రొట్టె, కొంత కాయధాన్యం వంటకం ఏశావుకు ఇచ్చాడు. అతడు తిని త్రాగి లేచి వెళ్లిపోయాడు.
ఈ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఆది 25: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

ఆది 25 కోసం వీడియో