సామెతలు 16
16
1హృదయ ప్రణాళికల మనుష్యులకు చెందినవి,
కాని నాలుక యొక్క సరియైన జవాబు యెహోవా నుండి వస్తుంది.
2ఒక వ్యక్తి యొక్క అన్ని మార్గాలు వారికి సరియైనవిగా కనిపిస్తాయి,
అయితే ఉద్దేశాలు తూకం వేయబడతాయి.
3మీ పనులను యెహోవాకు అప్పగించండి,
మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి.
4యెహోవా ప్రతిదీ దాని దాని పని కోసం కలుగజేశారు
నాశన దినానికి ఆయన భక్తిలేని వారిని కలుగజేశారు.
5గర్వ హృదయులందరిని యెహోవా అసహ్యించుకుంటారు.
ఇది నిశ్చయం: వారు శిక్షింపబడకపోరు.
6ప్రేమ, నమ్మకత్వం వలన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది;
యెహోవాయందలి భయం వలన కీడు తొలగిపోతుంది.
7ఒక వ్యక్తి మార్గాలు యెహోవాకు నచ్చినప్పుడు,
అతడు వాని శత్రువులను వానితో సమాధానపరుస్తారు.
8అన్యాయం చేత కలిగిన గొప్ప రాబడి కంటే,
నీతితో కూడిన కొంచెము మేలు.
9మనుష్యులు తాము చేయబోయేది తమ హృదయాల్లో ఆలోచిస్తారు,
యెహోవా వారి అడుగులను స్ధిరపరుస్తారు.
10రాజు పెదవులు దైవ వాక్కులా మాట్లాడతాయి,
అతని నోరు న్యాయ ద్రోహం చేయదు.
11న్యాయమైన త్రాసు, తూనిక రాళ్లు యెహోవా ఏర్పాట్లు,
సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించారు.
12రాజులు చెడ్డపనులు చేయడాన్ని అసహ్యించుకుంటారు,
నీతి వలన సింహాసనం స్ధిరపరచబడుతుంది.
13రాజులు నిజాయితీగల పెదవులను ఇష్టపడతారు,
యథార్థంగా మాట్లాడేవారికి వారు విలువనిస్తారు.
14రాజు ఆగ్రహం మరణ దూత వంటిది,
అయితే జ్ఞానులు దాన్ని శాంతింపజేస్తారు.
15రాజుల ముఖకాంతి వలన జీవం కలుగుతుంది,
వారి దయ వసంత రుతువులో వర్షం మేఘం లాంటిది.
16బంగారం కంటే జ్ఞానాన్ని సంపాదించడం,
వెండి కంటే తెలివిని సంపాదించడం ఎంత మేలు!
17యథార్థవంతుల రాజమార్గం చెడును తప్పిస్తుంది;
తమ మార్గాలను కాపాడుకునేవారు తమ ప్రాణాలను కాపాడుకుంటారు.
18నాశనానికి ముందు గర్వం,
పతనానికి ముందు అహంకారం వెళ్తాయి.
19గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకోవడం కంటే,
అణచివేయబడిన వారితో పాటు దీనులుగా ఉండడం మేలు.
20ఉపదేశాన్ని పాటించేలా జాగ్రత్తవహించేవాడు వర్ధిల్లుతాడు,
యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు.
21జ్ఞానంగల హృదయం గలవారు వివేకులు అని పిలువబడతారు,
దయగల మాటలు ఒప్పింపజేస్తాయి.
22వివేకికి వాని వివేకం ఒక జీవపుఊట,
కానీ మూర్ఖులకు మూర్ఖత్వం శిక్షను తెస్తుంది.
23జ్ఞానుని హృదయం వాని నోటికి తెలివి కలిగిస్తుంది,
వాని పెదవులకు విద్య ఎక్కువయేలా చేస్తుంది.
24దయ గల మాటలు తేనెతెట్టె వంటివి,
అవి ప్రాణానికి తియ్యనివి ఎముకలకు ఆరోగ్యకరమైనవి.
25ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది,
అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది.
26కష్టం చేసేవారి ఆకలి వానిచేత కష్టం చేయిస్తుంది,
వారి ఆకలి వారిని ముందుకు నడిపిస్తుంది.
27పనికిమాలినవారు కీడును పన్నాగం వేస్తారు,
వారి మాటలు మండుతున్న అగ్నిలాంటివి.
28మూర్ఖులు తగవు రేపుతారు,
పుకార్లు సన్నిహితులైన స్నేహితులను వేరు చేస్తాయి.
29హింసాత్మకమైన వారు వారి పొరుగువారిని ఆశపెడతారు,
సరియైనది కాని మార్గంలో వారిని నడిపిస్తారు.
30తమ కన్ను గీటేవారు కుట్ర పన్నుతున్నారు;
తన పెదవులు బిగబట్టేవారు కీడు వైపు మొగ్గు చూపుతారు.
31నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం,
అది నీతి మార్గంలో సాధించబడుతుంది.
32యుద్ధవీరునికంటే సహనం గలవాడు,
పట్టణాన్ని స్వాధీనం చేసుకునేవానికంటే తన మనస్సును అదుపు చేసుకోగలవాడు మేలు.
33చీట్లు ఒడిలో వేయబడవచ్చు,
కాని వాటి నిర్ణయం యెహోవా సొంతము.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సామెతలు 16: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.