సామెతలు 17
17
1తగాదాలతో కూడిన విందు కలిగి ఉన్న ఇంటి కంటే,
సమాధానం నిశ్శబ్దంతో ఎండిన రొట్టె ముక్క తినుట మేలు.
2వివేకంగల దాసుడు అవమానం తెచ్చే కుమారుని ఏలుతాడు
కుటుంబంలో ఒకనిగా వారసత్వ సంపదను పంచుకుంటాడు.
3వెండికి మూస బంగారానికి కొలిమి తగినది,
అయితే హృదయాన్ని యెహోవా పరిశోధిస్తారు.
4చెడు నడవడి కలవాడు మోసపు మాటలు వినును,
అబద్ధికుడు నాశనకరమైన నాలుక మాటలు వింటాడు.
5పేదవారిని ఎగతాళి చేసేవాడు వారిని చేసిన వానిని నిందించేవాడు,
ఆపదను చూసి సంతోషించేవాడు శిక్ష నుండి తప్పించుకోడు.
6పిల్లల పిల్లలు ముసలివారికి కిరీటం,
తల్లిదండ్రులు వారి పిల్లలకు అలంకారము.
7అనర్గళమైన పెదవులు దైవభక్తి లేని బుద్ధిహీనునికి సరిపోవు,
అధికారికి అబద్ధమాడే పెదవులు ఇంకెంత ఘోరం!
8లంచమిచ్చేవానికి లంచం ఒక మంత్ర రాయిలా ఉంటుంది,
ప్రతి మలుపు దగ్గర విజయం వస్తుందని వారు తలస్తారు.
9ప్రేమను పెంచాలని కోరేవారు నేరాలు దాచిపెడతారు,
జరిగిన వాటిని మాటిమాటికి జ్ఞాపకం చేసేవాడు గాఢ స్నేహితులను విడగొడతారు.
10బుద్ధిహీనునికి పడే వంద దెబ్బల కంటే,
వివేకంగల వానికి ఒక గద్దింపు ప్రభావం చూపుతుంది.
11ఎదిరించువాడు కీడు చేయుటకే కోరును,
అట్టివాని వెంట దయలేని దూత పంపబడును.
12మూర్ఖత్వానికి లొంగిన బుద్ధిహీనుని కలవడం కంటే
పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలవడం మేలు.
13మేలుకు బదులుగా కీడు చేయువాని
ఇంట నుండి కీడు ఎన్నటికి తొలిగిపోదు.
14గొడవ ప్రారంభించడం ఆనకట్టకు గండి కొట్టడం లాంటిది;
కాబట్టి వివాదం చెలరేగడానికి ముందే ఆపండి.
15దోషులను వదిలి వేయడం అమాయకులను ఖండించడం,
రెండు యెహోవాకు అసహ్యమే.
16బుద్ధిహీనులు జ్ఞానాన్నే గ్రహించలేకపోతున్నప్పుడు,
వారి విద్యాభ్యాసానికి డబ్బు చెల్లించడం దేనికి?
17నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు,
ఆపదల్లో అట్టి వాడు సహోదరునిగా ఉంటాడు.
18బుద్ధిలేని మనుష్యుడు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేస్తాడు
పొరుగువానికి హామీగా ఉంటాడు.
19తగాదాను ప్రేమించేవాడు పాపాన్ని ప్రేమిస్తాడు,
తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనం వెదుకువాడు.
20అసూయగలవాడు మేలుపొందడు
తెలివితక్కువగా మాట్లాడేవాడు కీడులో పడును.
21మూర్ఖుని కనిన వానికి విచారం కలుగుతుంది,
బుద్ధిహీనుని కనిన తండ్రికి సంతోషం ఉండదు.
22సంతోషం గల హృదయం ఆరోగ్యకారణం,
నలిగిన హృదయం ఎముకలను ఎండిపోజేస్తుంది.
23న్యాయం తప్పుదారి పట్టించడానికి
దుష్టులు రహస్యంగా లంచాలు స్వీకరిస్తారు.
24వివేకం ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుంటాడు,
కాని మూర్ఖుడి కళ్లు భూమి చివర వరకు తిరుగుతాయి.
25బుద్ధిలేని పిల్లలు తమ తండ్రికి దుఃఖం తెస్తారు,
తమను కనిన తల్లికి అట్టివారు శోకం కలిగిస్తారు.
26అమాయకులకు జరిమానా విధించడం మంచిది కాకపోతే,
నిజాయితీగల అధికారులను కొట్టడం సరికాదు.
27తక్కువగా మాట్లాడేవాడు తెలివిగలవాడు,
శాంత గుణముగలవాడు మంచిచెడులు ఎరిగినవాడు.
28ఒకడు తెలివితక్కువ వాడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞానియని ఎంచబడును,
తమ పెదవులను అదుపులో పెట్టుకునేవాడు వివేకిగా ఎంచబడును.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సామెతలు 17: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.