యెహోషువ 23

23
నాయకులకు యెహోషువ వీడ్కోలు
1యెహోవా ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి వారికి విశ్రాంతిని ఇచ్చారు. అప్పటికి యెహోషువ చాలా వృద్ధుడయ్యాడు. 2అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరిని అనగా వారి పెద్దలను, నాయకులను, న్యాయాధిపతులను, అధికారులను పిలిచి వారితో ఇలా అన్నాడు: “నేను చాలా వృద్ధుడనయ్యాను. 3మీ దేవుడైన యెహోవా మీ కోసం ఈ దేశాలన్నిటికి చేసినదంతా మీరే చూశారు. మీ కోసం పోరాడినది మీ దేవుడైన యెహోవాయే. 4నేను జయించిన దేశాలతో పాటు పశ్చిమాన యొర్దాను మధ్యధరా సముద్రం మధ్య మిగిలి ఉన్న దేశాల భూమిని మీ గోత్రాలకు వారసత్వంగా ఎలా కేటాయించానో గుర్తుచేసుకోండి. 5మీ కోసం మీ దేవుడైన యెహోవా వారిని బయటకు వెళ్లగొడతారు. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసినట్టు ఆయన మీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టినప్పుడు మీరు వారి దేశాన్ని స్వాధీనపరచుకుంటారు.
6“దృఢంగా ఉండండి; మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా జాగ్రత్తగా పాటించండి. 7మీ మధ్య ఉన్న ఈ దేశాలతో సహవాసం చేయవద్దు; వారి దేవతల పేర్లు ఎత్తవద్దు; వాటిపై ప్రమాణం చేయవద్దు. మీరు వాటిని సేవించవద్దు లేదా వాటికి నమస్కరించవద్దు. 8అయితే మీరు ఇప్పటివరకు ఉన్నట్లే మీ దేవుడైన యెహోవాను గట్టిగా పట్టుకుని ఉండాలి.
9“యెహోవా మీ ఎదుట నుండి శక్తివంతమైన దేశాలను వెళ్లగొట్టారు; ఈ రోజు వరకు ఎవరూ మీ ముందు నిలబడలేకపోతున్నారు. 10మీ దేవుడైన యెహోవా తాను వాగ్దానం చేసినట్లుగా మీ కోసం పోరాడుతున్నారు కాబట్టి మీలో ఒకడు వెయ్యిమందిని ఓడించాడు. 11కాబట్టి మీ దేవుడైన యెహోవాను ప్రేమించడంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
12“అయితే మీరు వెనక్కి తిరిగి, మీ మధ్య మిగిలి ఉన్న ఈ దేశాల్లో జీవించి ఉన్నవారితో పొత్తు పెట్టుకుని, మీరు వారిని పెళ్ళి చేసుకుని, వారితో సహవాసం చేస్తే, 13మీ దేవుడైన యెహోవా ఇకపై ఈ దేశాలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టడని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానికి బదులుగా, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగా, ఉచ్చులుగా, మీ వీపుపై కొరడాలుగా, మీ కళ్లల్లో ముళ్ళుగా మారుతారు.
14“ఇప్పుడు మనుష్యులందరు వెళ్లే మార్గంలోనే నేను వెళ్లబోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మంచి వాగ్దానాలలో ఒక్కటి కూడా విఫలం కాలేదని మీ హృదయాలకు మనస్సులకు తెలుసు. ప్రతి వాగ్దానం నెరవేరింది; ఒక్కటి కూడా విఫలం కాలేదు. 15అయితే మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్ని మీకు నెరవేరినట్లే, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మిమ్మల్ని నాశనం చేసే వరకు ఆయన చెప్పిన కీడునంతా మీ మీదికి రప్పిస్తారు. 16మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన నిబంధనను పాటించకుండా, ఇతర దేవుళ్ళను సేవించి వాటికి నమస్కరిస్తే, యెహోవా కోపం మీపై రగులుకుంటుంది. ఆయన మీకు ఇచ్చిన మంచి దేశంలో నుండి మీరు త్వరగా నశించిపోతారు.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహోషువ 23: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి