యెహోషువ 22
22
ఇంటికి తిరిగివచ్చిన తూర్పు గోత్రాలు
1అప్పుడు యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రం వారిని పిలిపించి, 2వారితో, “యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతా మీరు చేశారు, నేనిచ్చిన ప్రతి ఆజ్ఞకు లోబడ్డారు. 3చాలా కాలం క్రితం నుండి నేటి వరకు మీరు మీ తోటి ఇశ్రాయేలీయులను విడిచిపెట్టకుండా మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. 4ఇప్పుడు మీ దేవుడైన యెహోవా తాను వాగ్దానం చేసినట్లు వారికి విశ్రాంతిని ఇచ్చారు కాబట్టి, యొర్దాను అవతలి వైపున యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన దేశంలోని మీ ఇళ్ళకు తిరిగి వెళ్లండి. 5అయితే మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఆజ్ఞలను పాటించి ఆయనను గట్టిగా అంటిపెట్టుకుని ఆయనను సేవించమని యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన ఆజ్ఞను, ధర్మశాస్త్రాన్ని పాటించేలా జాగ్రత్త వహించాలి” అని చెప్పాడు.
6అప్పుడు యెహోషువ వారిని ఆశీర్వదించి పంపివేశాడు. వారు తమ ఇళ్ళకు వెళ్లిపోయారు. 7(మోషే మనష్షే అర్థగోత్రానికి బాషానులో భూమిని ఇచ్చాడు, యెహోషువ మిగిలిన అర్థగోత్రానికి వారి తోటి ఇశ్రాయేలీయులతో పాటు యొర్దానుకు పశ్చిమాన భూమిని ఇచ్చాడు.) యెహోషువ వారిని ఇంటికి పంపినప్పుడు, అతడు వారిని ఆశీర్వదిస్తూ, 8వారితో, “మీ గొప్ప సంపదతో, పెద్ద పశువుల మందలతో, వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, విస్తారమైన దుస్తులతో మీ ఇళ్ళకు తిరిగి వెళ్లండి. మీ శత్రువుల నుండి దోచుకున్న సొమ్మును మీ తోటి ఇశ్రాయేలీయులతో పంచుకోండి” అని చెప్పాడు.
9కాబట్టి రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు ఇశ్రాయేలీయులను కనానులోని షిలోహులో విడిచిపెట్టి, మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తమ సొంత దేశమైన గిలాదుకు తిరిగి వచ్చారు.
10వారు కనాను దేశంలోని యొర్దానుకు సమీపంలో ఉన్న గెలీలోతుకు వచ్చినప్పుడు, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు యొర్దాను ప్రక్కన ఒక పెద్ద బలిపీఠాన్ని కట్టారు. 11రూబేనీయులు గాదీయులు మనష్షే అర్థగోత్రపు వారు కనాను సరిహద్దులో యొర్దాను దగ్గర గెలీలోతు దగ్గర బలిపీఠాన్ని కట్టారని ఇశ్రాయేలీయులు విన్నప్పుడు, 12ఇశ్రాయేలీయులందరు వారితో యుద్ధం చేయడానికి షిలోహులో సమావేశమయ్యారు.
13కాబట్టి ఇశ్రాయేలీయులు యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును గిలాదు దేశంలో ఉన్న రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థ గోత్రాల వారి దగ్గరకు పంపారు. 14ఇశ్రాయేలీయుల గోత్రాల్లో ప్రతీదాని నుండి ఒకరు చొప్పున, ఇశ్రాయేలీయుల వంశాలలో తమ పితరుల కుటుంబాలకు నాయకులుగా ఉన్న పదిమందిని అతనితో పాటు పంపారు.
15గిలాదులో ఉన్న రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారి దగ్గరకు వెళ్లి వారితో ఇలా అన్నారు: 16“యెహోవా సమాజమంతా ఇలా అన్నారు: ‘మీరు ఇశ్రాయేలు దేవుని పట్ల నమ్మకద్రోహం ఎలా చేస్తారు? మీరు యెహోవాను విడిచిపెట్టి ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఇప్పుడు బలిపీఠాన్ని ఎలా కట్టుకోగలరు? 17పెయోరులో చేసిన పాపం మనకు సరిపోదా? యెహోవా సమాజం మీదికి తెగులు వచ్చినా, ఈ రోజు వరకు ఆ పాపం నుండి మనం శుద్ధి చేసుకోలేదు! 18ఇప్పుడు మీరు యెహోవా నుండి దూరంగా వెళ్తున్నారా?
“ ‘మీరు ఈ రోజు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే, రేపు ఆయన ఇశ్రాయేలు సమాజమంతటి మీద కోప్పడతారు. 19మీరు స్వాధీనం చేసుకున్న భూమి అపవిత్రంగా ఉంటే, యెహోవా సమావేశ గుడారం ఉన్న యెహోవా దేశానికి వచ్చి, ఆ దేశాన్ని మాతో పంచుకోండి. కాని మన దేవుడైన యెహోవా బలిపీఠం కాకుండా మీ కోసం ఒక బలిపీఠాన్ని కట్టుకుని యెహోవా మీద గాని మామీద గాని తిరుగుబాటు చేయవద్దు. 20ప్రతిష్ఠించబడిన వాటి విషయంలో జెరహు కుమారుడైన ఆకాను నమ్మకద్రోహం చేసినప్పుడు, ఇశ్రాయేలు సమాజమంతటిపై ఉగ్రత రాలేదా? అతని పాపానికి అతడు ఒక్కడే చనిపోలేదు.’ ”
21అప్పుడు రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రం వారు ఇశ్రాయేలు వంశ పెద్దలకు ఇలా జవాబిచ్చారు: 22“శక్తిమంతుడైన యెహోవా దేవుడు! శక్తిమంతుడైన దేవుడు యెహోవా! అది ఆయనకు తెలుసు! ఇశ్రాయేలుకు తెలియనివ్వండి! ఇది యెహోవా పట్ల ద్రోహంతో గాని తిరుగుబాటుతో గాని చేసివుంటే ఈ రోజు మమ్మల్ని రక్షించవద్దు. 23యెహోవాను విడిచిపెట్టి దహనబలులు భోజనార్పణలు సమాధానబలులు అర్పించడానికి మేము సొంత బలిపీఠాన్ని కట్టుకున్నట్లయితే, యెహోవాయే స్వయంగా మమ్మల్ని లెక్క అడుగుతారు.
24“నిజమేమిటంటే, భవిష్యత్తులో మీ సంతతివారు మా సంతతివారితో, ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధించడానికి మీకు ఏం హక్కు ఉంది? 25రూబేనీయులారా, గాదీయులారా, యెహోవా మాకు మీకు మధ్య యొర్దానును సరిహద్దుగా చేశారు! యెహోవాలో మీకు వాటా లేదు’ అని అంటారేమో! మీ సంతతివారు మా సంతతివారిని యెహోవాకు భయపడకుండా చేస్తారేమో!
26“అందుకే మేము, ‘మనం బలిపీఠం కట్టడానికి సిద్ధపడదాం రండి, అయితే అది దహనబలులు బలులు అర్పించడం కోసం కాదు’ అని అనుకున్నాము. 27మనం దహనబలులు బలులు సమాధాన బలులతో యెహోవాను ఆయన పరిశుద్ధాలయంలో ఆరాధించాలని చెప్పడానికి అది మాకు మీకు తర్వాతి తరాల వారికి మధ్య సాక్షిగా ఉండాలి. అప్పుడు భవిష్యత్తులో మీ సంతతివారు మా సంతతివారితో, ‘మీకు యెహోవాలో వాటా లేదు’ అని అనలేరు.
28“మేము, ‘వారు ఎప్పుడైనా మాతో గాని మా వారసులతో గాని ఒకవేళ అంటే, మా పూర్వికులు కట్టిన యెహోవా బలిపీఠం ప్రతిరూపాన్ని చూడండి; దహనబలులు బలులు అర్పించడం కోసం కాదు; అది మీకు మాకు మధ్య సాక్షిగా ఉండాలని కట్టారు’ అని చెప్పాలని అనుకున్నాము.
29“మన దేవుడైన యెహోవా సమావేశ గుడారం ఎదుట దహనబలులు, భోజనార్పణలు, అర్పణల కొరకైన బలిపీఠం కాక మరొక బలిపీఠం కట్టి, నేడు యెహోవాను విడిచిపెట్టి ఆయన మీద తిరుగుబాటు చేయడం మాకు దూరమవును గాక.”
30యాజకుడైన ఫీనెహాసు, సమాజ నాయకులు అనగా ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు రూబేను, గాదు, మనష్షే చెప్పింది విని సంతోషించారు. 31యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు రూబేను, గాదు, మనష్షేలతో ఇలా అన్నాడు, “ఈ విషయంలో మీరు యెహోవాకు నమ్మకద్రోహం చేయలేదు కాబట్టి యెహోవా మనతో ఉన్నాడని ఈ రోజు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మీరు ఇశ్రాయేలీయులను యెహోవా చేతిలో నుండి రక్షించారు.”
32అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు, నాయకులు గిలాదులోని రూబేనీయులు, గాదీయులను కలిసి కనానుకు తిరిగివచ్చి ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని చెప్పారు. 33ఇశ్రాయేలీయులు ఆ వార్త విని సంతోషించి దేవున్ని స్తుతించారు. రూబేనీయులు, గాదీయులు నివసించిన దేశాన్ని నాశనం చేయడానికి వారిపై యుద్ధానికి వెళ్లడం గురించి వారు ఇక మాట్లాడలేదు.
34రూబేనీయులు, గాదీయులు యెహోవాయే దేవుడు అనడానికి ఈ బలిపీఠమే సాక్ష్యం అని చెప్పి దానికి ఏద్ అని పేరు పెట్టారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహోషువ 22: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.