యాకోబు 5
5
హింసించే ధనవంతులకు హెచ్చరిక
1ధనవంతులారా రండి, మీ పైకి రాబోతున్న దురవస్థలను బట్టి దుఃఖించి ఏడ్వండి. 2మీ ధనం పాడైపోతుంది, మీ బట్టలను చిమ్మట తినివేస్తుంది. 3మీ బంగారము వెండి తుప్పుపడతాయి; వాటి తుప్పు మీకు వ్యతిరేక సాక్ష్యంగా వుండి అగ్నిలా మీ శరీరాన్ని తింటుంది. మీరు చివరిరోజుల కొరకు ధనాన్ని కూడబెట్టారు. 4చూడండి మీ పొలాలను కోసిన పనివారికి ఇవ్వకుండా మోసంతో మీరు దాచిపెట్టిన వారి జీతాలు మొరపెట్టాయి. కోతకోసినవారి మొరలు సర్వశక్తిమంతుడైన ప్రభుని చెవులకు చేరాయి. 5మీరు భూమిపై విలాసవంతంగా సుఖంగా జీవించారు; సంహరించు రోజున#5:5 లేదా, విందు దినమున మీ హృదయాలను మరియు మిమ్మల్ని మీరు పోషించుకున్నారు. 6మిమ్మల్ని ఎదిరించలేని నీతిమంతుడిని మీరు శిక్షించి అతన్ని హత్య చేశారు.
శ్రమలలో ఓర్పు
7కాబట్టి సహోదరీ సహోదరులారా, ప్రభువు వచ్చేవరకు ఓపికతో ఉండండి. రైతు భూమిపై విలువైన పంటను పొందడానికి తొలకరి వాన చివరి వానలు పడేవరకు ఓపికతో ఎదురుచూస్తాడు. 8మీరు కూడా ఓపిక కలిగివుండండి. ప్రభువు రాకడ దగ్గరలో ఉన్నది కాబట్టి మీ హృదయాలను బలపరచుకోండి. 9సహోదరీ సహోదరులారా, మీరు తీర్పు తీర్చబడకుండా ఉండడానికి ఒకరిపై ఒకరు సణుగుకోవద్దు. చూడండి, న్యాయాధిపతి తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు!
10సహోదరీ సహోదరులారా, మన ప్రభువు నామంలో మాట్లాడిన ప్రవక్తలను శ్రమలకు ఓపికకు మాదిరిగా తీసుకోండి. 11సహనాన్ని చూపినవారిని ధన్యులు అని పిలుస్తాము. యోబుకు గల సహనం గురించి మీకు తెలుసు, ప్రభువు ఎంత జాలిని దయను కలిగినవాడో ఆయన ఉద్దేశాలలో మీరు తెలుసుకున్నారు.
12అన్నిటికి మించి, నా సహోదరీ సహోదరులారా, ఆకాశంతోడని గాని భూమి తోడని గాని లేదా ఇంకా దేనిపైన గాని ప్రమాణం చేయకండి. నీవు చెప్పాల్సింది ఏంటంటే “అవునంటే అవును” లేక “కాదంటే కాదు” లేకపోతే నీవు శిక్షించబడుతావు.
విశ్వాసంతో ప్రార్థన
13మీలో ఎవరైనా శ్రమలను అనుభవిస్తున్నారా? అయితే వారు ప్రార్థించాలి. ఎవరైనా సంతోషంగా వున్నారా? అయితే వారు స్తుతి గీతాలను పాడాలి. 14మీలో ఎవరైనా అనారోగ్యంతో వున్నారా? అయితే వారు సంఘ పెద్దలను పిలిపించాలి, ఆ పెద్దలు వారికి ప్రార్థన చేసి ప్రభువు పేరిట వారిని నూనెతో అభిషేకించాలి. 15విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగులను బాగుచేస్తుంది, ప్రభువు వారిని లేపుతారు; ఎవరైనా పాపం చేస్తే వారి పాపాలు క్షమించబడతాయి. 16కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకరు ఒప్పుకొని మీరు బాగుపడునట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది, ఫలవంతమైనది.
17ఏలీయా మనవంటి మనుష్యుడే; కాని అతడు వర్షం పడకూడదని మనఃపూర్వకంగా ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు భూమిపై వర్షం పడలేదు. 18అతడు మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి వర్షం కురిసింది, భూమి తన పంటను ఇచ్చింది.
19నా సహోదరీ సహోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుండి తప్పిపోయి తిరుగుతుంటే ఎవరైనా వారిని తిరిగి వెనక్కి తీసుకువచ్చినప్పుడు, 20తప్పిపోయిన ఒక పాపిని తిరిగి తీసుకువచ్చినవారు ఆ పాపి ఆత్మను మరణం నుండి రక్షించారని అనేక పాపాలు కప్పబడ్డాయని మీరు తెలుసుకోండి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యాకోబు 5: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.