1 పేతురు 1
1
1యేసుక్రీస్తుకు అపొస్తలుడు, పేతురు,
పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియ ప్రాంతాలకు చెదరిపోయి, వలసదారులుగా జీవిస్తున్న దేవునిచేత ఏర్పరచబడిన ప్రజలకు వ్రాయునది, 2తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి, మీరు యేసుక్రీస్తుకు విధేయులు కావడానికి ఆయన రక్తంచే చిలకరించడానికి ఆయన మిమ్మల్ని ఎన్నుకొని తన ఆత్మ చేత పవిత్రులు చేశారు:
మీకు కృపా సమాధానములు విస్తరించును గాక.
సజీవ నిరీక్షణ బట్టి దేవునికి స్తోత్రము
3మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక! మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగేలా, ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరల జన్మింపజేసారు. 4ఎన్నడు నశించనిది, కొల్లగొట్టలేనిది, వాడిపోనిదైన వారసత్వాన్ని పరలోకంలో మనకొరకు భద్రపరిచారు. 5మీరు యుగాంతంలో ప్రకటించబడే రక్షణ మీకు కలిగేలా విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్నారు, ఆ వారసత్వం పరలోకంలో మీ కొరకు భద్రపరచబడి ఉంది. 6మీరు ఎదుర్కోవలసిన అనేక విధాలైన పరీక్షలవల్ల ఇప్పుడు తాత్కాలికంగా మీకు బాధ కలిగినప్పటికి, వీటన్నిటిలో మీరు అధికంగా సంతోషించండి. 7అవి మీ విశ్వాసం యదార్థమైనదని నిరూపిస్తాయి. నాశనమయ్యే బంగారం కూడ అగ్ని చేత పరీక్షించబడుతుంది; అలాగే బంగారం కంటె ఎంతో విలువైన మీ విశ్వాసం కూడ పరీక్షింపబడాలి, అప్పుడే అది చెడిపోకుండా నిలిచి ఉంటుంది, దానివల్ల యేసు క్రీస్తు ప్రత్యక్షమైన రోజున కీర్తి, మహిమ, ఘనతలు కలుగుతాయి. 8మీరు ఆయనను చూడకపోయినా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకపోయినా నమ్ముతున్నారు. వివరించలేని తేజోమయమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు. 9ఎలాగంటే, మీ విశ్వాసానికి ఫలితంగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుతున్నారు.
10మీకు కలుగబోయే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి తీవ్రంగా మరియు చాలా జాగ్రత్తగా శోధించారు, 11క్రీస్తు అనుభవించవలసిన కష్టాలను, దాని వలన వచ్చే మహిమ గురించి వారు ప్రవచించినప్పుడు వారిలో ఉన్న క్రీస్తు ఆత్మ ఏ పరిస్థితులను లేక ఏ సమయాన్ని సూచించాడో వారు తెలుసుకోడానికి ప్రయత్నించారు. 12పరలోకం నుండి పంపబడి పరిశుద్ధాత్మచే ప్రభావితులై మీకు సువార్తను ప్రకటించినవారి ద్వారా మీకు ఇప్పుడు చెప్పబడిన సంగతులను వారు చెప్పినప్పుడు, తమ కొరకు కాదు కాని మీ కొరకే తాము పరిచర్య చేసారనే సంగతి వారికి వెల్లడి చేయబడింది. వీటిని దేవదూతలు సహితం చూడాలని ఆశించారు.
పరిశుద్ధులుగా ఉండండి
13కాబట్టి, మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధిగల మనస్సులతో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. 14మీరు విధేయత కలిగిన బిడ్డలు కనుక, అజ్ఞానంలో ఉన్నప్పుడు మీకు గల చెడ్డకోరికలకు అనుగుణంగా ఉండకండి. 15మిమ్మల్ని పిలచిన దేవుడు పరిశుద్ధుడు, గనుక మీ ప్రవర్తనలో మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. 16వ్రాయబడిన ప్రకారం: “నేను పరిశుద్ధుడను, గనుక మీరూ పరిశుద్ధంగా ఉండాలి.”#1:16 లేవీ 11:44,45; 19:2
17పక్షపాతం లేకుండా ప్రతివారికి వారి వారి పనిని బట్టి తీర్పుతీర్చే దేవుణ్ణి మీరు తండ్రీ అని పిలుస్తున్నారు, కాబట్టి ఈ లోకంలో పరదేశులుగా మీకు మిగిలి వున్న జీవితకాలాన్ని ఆయనలో భయభక్తులతో గడపండి. 18ఎలాగంటే, మీ పితరుల నుండి మీకు లభించిన ఉపయోగం లేని జీవితం నుండి మీకు విముక్తి ఇవ్వడానికి ఏమి అర్పించబడిందో మీకు తెలుసు. అది నశించిపోయే వెండి బంగారాల వంటిది కాదు. 19అయితే నిష్కళంకమైన లేదా లోపం లేని గొర్రెపిల్ల, క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం చేత మీరు విమోచించబడ్డారు. 20లోకం సృజింపబడక ముందే ఆయన దేవునిచే ఎన్నుకోబడ్డారు కాని మీ కొరకు ఈ చివరి కాలాల్లో బయలుపరచబడ్డారు. 21మీరు ఆయన ద్వారా ఆయనను మృతులలో నుండి లేవనెత్తి ఆయనను మహిమ పరచిన దేవుణ్ణి విశ్వసిస్తున్నారు, కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణ దేవునిలో ఉంచబడ్డాయి.
22ఇప్పుడు సత్యానికి విధేయులై మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుంటున్నారు, తద్వారా తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమ కలిగివుండి, ఒకరినొకరు హృదయపూర్వకంగా#1:22 హృదయపూర్వకంగా కొన్ని ప్రాచీన ప్రతులలో పూర్ణహృదయంతో అధికంగా ప్రేమించుకోండి. 23ఎలాగంటే సజీవమైన, శాశ్వతమైన దేవుని వాక్యం ద్వారా మీరు క్షయబీజం నుండి కాక అక్షయబీజం నుండి తిరిగి జన్మించారు. 24ఎందుకనగా,
“మానవులందరు గడ్డి వంటివారు,
వారి వైభవం గడ్డి పువ్వు వంటిది;
గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి,
25కాని దేవుని వాక్యం నిరంతరం నిలుచును.”#1:25 యెషయా 40:6-8
ఈ వాక్యమే మీకు ప్రకటించబడింది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 పేతురు 1: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.