2 దినవృత్తాంతములు 20
20
యెహోషాపాతు మోయాబును అమ్మోనును ఓడించుట
1ఇలా జరిగాక మోయాబీయులు, అమ్మోనీయులు మెయునీయులలో#20:1 కొ.ప్ర.లలో అమ్మోనీయులు కొందరితో కలిసి యెహోషాపాతుతో యుద్ధం చేయడానికి వచ్చారు.
2కొంతమంది మనుష్యులు వచ్చి యెహోషాపాతుతో, “మృత సముద్రం అవతలి వైపున ఉన్న ఎదోము#20:2 కొ.ప్ర.లలో అరాము నుండి గొప్ప సైన్యం మీ మీదికి వస్తూ ఉంది. వారు ఇప్పటికే హససోన్ తామారులో (అనగా ఎన్-గేదీ) ఉన్నారు” అని చెప్పారు. 3యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారణ చేద్దామని నిశ్చయించుకున్నాడు, అంతేగాక యూదా ప్రజలంతా ఉపవాసం ఉండాలని ప్రకటన చేయించాడు. 4సాయం చేయమని యెహోవాను ప్రాధేయపడడానికి యూదా ప్రజలంతా సమకూడారు; ఆయనను సహాయం అడగడానికి యూదాలోని ప్రతి పట్టణం నుండి ప్రజలు వచ్చారు.
5అప్పుడు యెహోషాపాతు యూదా, యెరూషలేము సమాజంలో క్రొత్త ప్రాంగణం ముందు ఉన్న యెహోవా మందిరంలో నిలబడి, 6ఇలా ప్రార్థించాడు:
“యెహోవా మా పూర్వికుల దేవా, పరలోకంలో ఉన్న దేవుడు మీరు కాదా? మీరు ప్రజల రాజ్యాలన్నిటినీ పరిపాలిస్తున్నారు. బలప్రభావాలు మీ చేతిలో ఉన్నాయి, మీకు వ్యతిరేకంగా ఎవరు నిలబడలేరు. 7మా దేవా! మీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశంలో కాపురమున్న వారిని మీరు వెళ్లగొట్టి, మీ స్నేహితుడైన అబ్రాహాము వారసులకు శాశ్వతంగా ఈ దేశాన్ని ఇవ్వలేదా? 8వారు ఇక్కడ నివాసముండి మీ పేరట ఇక్కడ పరిశుద్ధాలయం కట్టారు. 9వారు, ‘ఒకవేళ మా మీదికి విపత్తుగానీ, తీర్పు అనే ఖడ్గమే గాని తెగులే గాని కరువే గాని వస్తే మీ నామం కలిగిన ఈ మందిరం ముందు మేము మీ సన్నిధిలో నిలబడి మా ఆపదలో మీకు మొరపెడితే మీరు మా మొర విని మమ్మల్ని రక్షిస్తారు’ అన్నారు.
10“అయితే ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు వారిని అమ్మోను, మోయాబు, శేయీరు పర్వతం నుండి వచ్చిన వారితో యుద్ధం చేయడానికి మీరు అనుమతించలేదు; కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని నాశనం చేయకుండా వారి నుండి వెళ్లిపోయారు. 11మీరు మాకు వారసత్వంగా ఇచ్చిన స్వాస్థ్యం నుండి వారు మమ్మల్ని తోలివేయడానికి వచ్చి వారు మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి. 12మా దేవా, మీరు వారికి తీర్పు తీర్చరా? ఎందుకంటే మాపై దాడి చేస్తున్న ఈ మహా సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి మాకు లేదు. ఏం చేయాలో మాకు తెలియదు, కానీ మీ సహాయం కోసమే చూస్తున్నాము.”
13యూదా వారంతా తమ భార్యాపిల్లలు, పసివారితో సహా అక్కడ యెహోవా ముందు నిలబడి ఉన్నారు.
14అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు పుట్టిన జెకర్యా కుమారుడును లేవీయుడునైన ఆసాపు సంతతివాడైన యహజీయేలు మీదికి యెహోవా ఆత్మ వచ్చాడు.
15అప్పుడు యహాజీయేలు ఇలా ప్రకటించాడు: “యెహోషాపాతు రాజా, యూదా యెరూషలేము నివాసులారా మీరందరు వినండి! యెహోవా మీతో చెప్పే మాట ఇదే: ‘ఈ మహా సైన్యాన్ని చూసి భయపడకండి, నిరుత్సాహపడకండి. ఎందుకంటే యుద్ధం మీది కాదు, దేవునిది. 16రేపు వారిని ఎదుర్కోడానికి వెళ్లండి. వారు జీజు ఎగువ దారిన వస్తూ ఉంటారు, మీరు వారిని యెరుయేలు ఎడారిలో కొండగట్టు చివరిలో కనుగొంటారు. 17అయితే ఈ యుద్ధంలో మీరు పోరాడనవసరం ఉండదు. మీరు మీ స్థలాల్లో నిలబడి ఉండండి; యెహోవా మీకిచ్చే విడుదలను మీరు నిలబడి చూడండి. యూదా, యెరూషలేమా, మీరు భయపడవద్దు, కలవరపడవద్దు. రేపు వారిని ఎదుర్కోడానికి వెళ్లండి. యెహోవా మీతో ఉంటారు.’ ”
18అప్పుడు యెహోషాపాతు నేలకు సాష్టాంగపడి నమస్కరించాడు; యూదా, యెరూషలేము ప్రజలందరూ యెహోవా సన్నిధిలో ఆరాధించారు. 19కహాతు వంశానికి, కోరహీయుల వంశానికి చెందిన లేవీయులు కొందరు లేచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను పెద్ద స్వరంతో స్తుతించారు.
20తెల్లవారుజామున వారు తెకోవా ఎడారికి బయలుదేరారు. వారు బయలుదేరినప్పుడు, యెహోషాపాతు నిలబడి, “యూదా, యెరూషలేము ప్రజలారా, నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచండి, అప్పుడు మీరు స్థిరంగా నిలబడతారు; అతని ప్రవక్తలపై విశ్వాసముంచండి, మీరు విజయం సాధిస్తారు” 21ప్రజలతో మాట్లాడిన తర్వాత యెహోషాపాతు, యెహోవాకు ఇలా పాడటానికి, ఆయన పవిత్రత యొక్క వైభవాన్ని స్తుతించడానికి మనుష్యులను నియమించాడు, వారు సైన్యానికి ముందుగా నడిచారు:
“యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి,
ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.”
22వారు అలా పాటలు పాడడం, స్తుతించడం మొదలుపెట్టినప్పుడు యెహోవా యూదా వారి మీద దండెత్తుతున్న అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, శేయీరు కొండసీమవారి మీదా మాటుగాండ్రు ఉండేలా చేశారు. కాబట్టి వారు ఓడిపోయారు. 23ఎలాగంటే, అమ్మోనీయులు, మోయాబీయులు శేయీరు కొండసీమవారి మీద దాడి చేసి వారిని హతమార్చి నాశనం చేశారు. శేయీరు కొండసీమవారిని హతమార్చిన తర్వాత వారు ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు.
24యూదా మనుష్యులు ఎడారి వైపున ఉన్న ప్రదేశానికి వచ్చి విస్తారమైన సైన్యం వైపు చూసినప్పుడు, వారికి నేలమీద పడి ఉన్న మృతదేహాలు మాత్రమే కనిపించాయి; ఎవరూ తప్పించుకోలేదు. 25కాబట్టి యెహోషాపాతు అతని మనుష్యులు వారి దోపుడుసొమ్మును దోచుకోవడానికి వెళ్లి, అక్కడ వారి మధ్య చాలా సామాగ్రి, వస్త్రాలు విలువైన వస్తువులు ఉండడం చూశారు. అవి వారు మోయలేనంతగా ఉన్నాయి. ఆ వస్తువులన్నీ పోగుచేయడానికి మూడు రోజులు పట్టింది. 26నాలుగో రోజు వారు బెరాకా#20:26 బెరాకా అంటే స్తుతి లోయలో సమకూడి యెహోవాను స్తుతించారు. అందుకే ఆ చోటు నేటి వరకు బెరాకాలోయ అని పిలువబడుతుంది.
27అప్పుడు, యెహోషాపాతు నేతృత్వంలో, యూదా యెరూషలేము ప్రజలందరూ సంతోషంగా యెరూషలేముకు తిరిగి వచ్చారు, ఎందుకంటే వారి శత్రువులపై యెహోవా వారికి విజయాన్ని ఇచ్చారు. 28వారు యెరూషలేములో ప్రవేశించి, రకరకాల సితార వీణలతో, బూరలతో యెహోవా ఆలయానికి చేరుకున్నారు.
29ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా ఎలా పోరాడారో విన్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాలన్నిటికీ దేవుని భయం కలిగింది. 30యెహోషాపాతు రాజ్యం సమాధానంతో ఉంది, ఎందుకంటే యెహోషాపాతు యొక్క దేవుడు అతనికి అన్నివైపులా విశ్రాంతి ఇచ్చారు.
యెహోషాపాతు పాలన యొక్క ముగింపు
31యెహోషాపాతు యూదాను పరిపాలించాడు. అతడు యూదాకు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు.అతడు యెరూషలేములో ఇరవై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కుమార్తె. 32అతడు తన తండ్రి ఆసా విధానాలను అనుసరించాడు, వాటినుండి తొలగిపోలేదు; అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. 33అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు, ప్రజలు తమ పూర్వికుల దేవుని అనుసరించాలని హృదయపూర్వకంగా ఇంకా నిశ్చయించుకోలేదు.
34యెహోషాపాతు పరిపాలన గురించిన ఇతర విషయాలు, మొదటి నుండి చివరి వరకు, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో నమోదు చేయబడిన హనానీ కుమారుడైన యెహు చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
35తర్వాత యూదా రాజైన యెహోషాపాతు, దుష్ట మార్గాల్లో నడిచే ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో సంధి చేసుకున్నాడు. 36అతడు తర్షీషు ఓడలను నిర్మించడానికి అతనితో అంగీకరించాడు. ఎసోన్-గెబెరు దగ్గర అవి నిర్మించబడిన తర్వాత, 37మరేషాకు చెందిన దోదవహు కుమారుడైన ఎలీయెజెరు యెహోషాపాతుకు వ్యతిరేకంగా, “నీవు అహజ్యాతో పొత్తు పెట్టుకున్నావు కాబట్టి, నీవు చేసిన దాన్ని యెహోవా నాశనం చేస్తారు” అని ప్రవచించాడు. ఓడలు బద్దలయ్యాయి, వాణిజ్యానికి తర్షీషుకు వెళ్లలేకపోయాయి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 20: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.