2 దినవృత్తాంతములు 19
19
1యూదా రాజైన యెహోషాపాతు క్షేమంగా యెరూషలేములో తన భవనానికి తిరిగి వస్తున్నప్పుడు, 2హనానీ కుమారుడు, దీర్ఘదర్శియైన యెహు అతన్ని కలుసుకోడానికి వెళ్లి రాజైన యెహోషాపాతుతో, “మీరు దుర్మార్గులకు సహాయం చేస్తూ యెహోవాను ద్వేషించేవారిని ప్రేమిస్తారా?#19:2 లేదా జత కడతారా? యెహోవాకు మీమీద కోపం వచ్చింది. 3అయితే మీలో కొంత మంచి కూడా ఉంది, మీరు దేశం నుండి అషేరా స్తంభాలను తొలగించి, యెహోవాను వెదికి ఆయనను అనుసరించడానికి హృదయపూర్వకంగా నిశ్చయించుకున్నారు” అని అన్నాడు.
యెహోషాపాతు న్యాయాధిపతులను నియమించుట
4యెహోషాపాతు యెరూషలేములో ఉంటూ, బెయేర్షేబ నుండి ఎఫ్రాయిం కొండసీమవరకు ప్రజల మధ్యకు వెళ్లి వారిని మరల వారి పూర్వికుల దేవుడైన యెహోవా వైపుకు త్రిప్పాడు. 5యూదా దేశంలో కోటగోడలు గల అన్ని పట్టణాల్లో అతడు న్యాయాధిపతులను నియమించాడు. 6అతడు వారితో ఇలా అన్నాడు, “మీరు ఏమి చేస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించండి, ఎందుకంటే మీరు కేవలం మనుష్యుల కోసం కాదు, మీరు ఎప్పుడు తీర్పు ఇచ్చినా మీకు తోడుగా ఉన్న యెహోవా కోసం తీర్పు ఇస్తున్నారు. 7యెహోవా భయం మీమీద ఉండాలి. జాగ్రత్తగా తీర్పు తీర్చండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవా అన్యాయం చేయరు, పక్షపాతం చూపించరు, లంచం తీసుకోరు.”
8యెహోషాపాతు, యెరూషలేములో కూడా కొంతమంది లేవీయులను, యాజకులను ఇశ్రాయేలీయుల కుటుంబ పెద్దలను యెహోవా ధర్మశాస్త్రాన్ని బోధించడానికి, వివాదాలను పరిష్కరించడానికి నియమించాడు. వారు యెరూషలేములో నివసించారు. 9అతడు వారికి ఈ ఆజ్ఞలు జారీ చేశాడు: “యెహోవాయందు భయం కలిగి, మీరు నమ్మకంగా యధార్థహృదయంతో సేవ చేయాలి. 10పట్టణాల్లో నివసించే మీ ప్రజలు మీ దగ్గరకు తెచ్చే ప్రతి ఫిర్యాదు అంటే అది హత్యకు సంబంధించినవైనా లేదా ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, శాసనాలు, నిబంధనలకు సంబంధించిన ఇతర విషయాలైనా, వారు యెహోవాకు వ్యతిరేకంగా ఏ పాపం చేయవద్దని మీరు వారిని హెచ్చరించాలి; లేకపోతే ఆయన కోపం మీ మీదికి మీ ప్రజలమీదికి వస్తుంది. ఇలా చేస్తే, మీరు అపరాధులు కారు.
11“యెహోవాకు సంబంధించిన ప్రతి విషయంలోను ముఖ్య యాజకుడైన అమర్యా మీమీద అధికారిగా ఉంటాడు, అలాగే రాజుకు సంబంధించిన ప్రతి విషయంలోను యూదా గోత్ర నాయకుడు ఇష్మాయేలు కుమారుడైన జెబద్యా మీమీద అధికారిగా ఉంటాడు, లేవీయులు మీ ఎదుట అధికారులుగా ఉండి సేవ చేస్తారు. ధైర్యంగా ఉండండి, మంచిని జరిగించే వారికి యెహోవా తోడుగా ఉండును గాక.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 19: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.