2 దినవృత్తాంతములు 18
18
మీకాయా అహాబుకు వ్యతిరేకంగా ప్రవచించుట
1యెహోషాపాతుకు ఎంతో ఐశ్వర్యం, ఘనత ఉన్నాయి. అతడు అహాబుతో వియ్యమందాడు. 2కొన్ని సంవత్సరాల తర్వాత అతడు సమరయలో అహాబును సందర్శించడానికి వెళ్లాడు. అహాబు అతని కోసం, అతని వెంట వచ్చిన వారి కోసం చాలా గొర్రెలు, పశువులు వధించి, ఆపైన రామోత్ గిలాదుపై దాడి చేయమని అతన్ని ప్రేరేపించాడు. 3ఇశ్రాయేలు రాజైన అహాబు యూదా రాజైన యెహోషాపాతును, “నాతో కూడా రామోత్ గిలాదు మీదికి వస్తావా?” అని అడిగాడు.
అందుకు యెహోషాపాతు, “నేను మీవాన్ని, నా ప్రజలు మీ ప్రజలు, నా గుర్రాలు మీ గుర్రాలు; మేము మీతో యుద్ధంలో పాల్గొంటాం” అని జవాబిచ్చాడు. 4అయితే యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, “మొదట యెహోవా సలహాను తీసుకుందాం” అని కూడా అన్నాడు.
5కాబట్టి ఇశ్రాయేలు రాజు సుమారు నాలుగువందలమంది ప్రవక్తలను పిలిపించి, “నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా? వద్దా?” అని వారిని అడిగాడు.
“వెళ్లండి! దానిని యెహోవా రాజు వశం చేస్తారు” అని వారు జవాబిచ్చారు.
6అయితే యెహోషాపాతు, “మనం విచారణ చేయడానికి యెహోవా ప్రవక్త ఒక్కడు కూడా ఇక్కడ లేడా?” అని అడిగాడు.
7అందుకు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “ఇంకొక ప్రవక్త ఉన్నాడు, అతని ద్వారా యెహోవా దగ్గర విచారణ చేయవచ్చు. కాని, నాకు అతడంటే అయిష్టం, ఎందుకంటే అతడు నా గురించి ఎప్పుడూ మంచిని ప్రవచించడు, ఎప్పుడూ చెడ్డగానే ప్రవచిస్తాడు. అతడు ఇమ్లా కుమారుడైన మీకాయా” అని చెప్పాడు.
అందుకు యెహోషాపాతు, “రాజా మీరు అలా అనవద్దు” అన్నాడు.
8అప్పుడు ఇశ్రాయేలు రాజు తన అధికారులలో ఒకరిని పిలిచి, “వెంటనే వెళ్లి, ఇమ్లా కుమారుడైన మీకాయాను తీసుకురా” అని చెప్పాడు.
9ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకొని సమరయ నగర ద్వారం దగ్గర ఉన్న నూర్పిడి కళ్ళం దగ్గరలో ప్రవక్తలంతా ప్రవచిస్తూ ఉండగా, తమ సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు. 10అప్పుడు కెనాన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేసుకుని వచ్చి, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘అరామీయులు నాశనమయ్యే వరకు మీరు వీటితో వారిని పొడుస్తారు’ ” అని చెప్పాడు.
11ఇతర ప్రవక్తలంతా కూడా అదే విషయాన్ని ప్రవచించారు. “రామోత్ గిలాదు మీద దాడి చేయండి విజయం పొందండి, ఎందుకంటే యెహోవా దాన్ని రాజు చేతికి అప్పగిస్తారు” అని వారన్నారు.
12మీకాయాను పిలువడానికి వెళ్లిన దూత మీకాయాతో, “చూడు, ఇతర ప్రవక్తలందరు రాజుకు విజయం కలుగుతుందని చెప్తున్నారు. వారి మాటతో నీ మాట ఏకమై, అనుకూలంగా పలుకాలి” అన్నాడు.
13అయితే మీకాయా, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నా, యెహోవా నాకు చెప్పేది మాత్రమే నేను అతనికి చెప్పగలను” అని అన్నాడు.
14అతడు వచ్చినప్పుడు, రాజు అతన్ని, “మీకాయా, మేము రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా, వెళ్లొద్దా?” అని అడిగాడు.
అందుకతడు, “దాడి చేయండి విజయం పొందండి, ఎందుకంటే వారు మీ చేతికి అప్పగించబడతారు” అని జవాబిచ్చాడు.
15రాజు అతనితో, “యెహోవా పేరిట నాకు సత్యమే చెప్పమని నేనెన్నిసార్లు నీ చేత ప్రమాణం చేయించాలి?” అని అన్నాడు.
16అప్పుడు మీకాయా జవాబిస్తూ, “ఇశ్రాయేలీయులందరు కాపరి లేని గొర్రెల్లా కొండలమీద చెదిరిపోయినట్లు దర్శనం చూశాను. ‘ఈ ప్రజలకు యజమాని లేడు. ప్రతి ఒక్కరు సమాధానంగా ఇంటికి వెళ్లాలి’ అని యెహోవా చెప్తున్నారు” అన్నాడు.
17ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “నా గురించి ఇతడు ఎన్నడు మంచిని ప్రవచించడు, చెడు మాత్రమే ప్రవచిస్తాడు అని మీతో చెప్పలేదా?” అని అన్నాడు.
18మీకాయా ఇంకా ఇలా అన్నాడు, “కాబట్టి యెహోవా మాట వినండి: యెహోవా తన సింహాసనంపై కూర్చుని ఉండగా తన కుడి ఎడమలు పరలోక సమూహాలన్ని నిలబడి ఉండడం నేను చూశాను. 19అప్పుడు యెహోవా, ‘ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్ గిలాదు మీదికి వెళ్లి అక్కడ చచ్చేలా అతన్ని ఎవరు ప్రలోభపెడతారు?’ అని అడిగారు.
“ఒకడు ఒక విధంగా ఇంకొకడు ఇంకొక విధంగా చెప్పారు. 20చివరికి ఒక ఆత్మ ముందుకు వచ్చి, యెహోవా సమక్షంలో నిలబడి, ‘నేను అతన్ని ప్రలోభపెడతాను’ అన్నాడు.
“ ‘ఎలా?’ అని యెహోవా అడిగారు.
21“ ‘నేను వెళ్లి అతని ప్రవక్తలందరి నోట మోసగించే ఆత్మగా ఉంటాను’ అని అతడు చెప్పాడు.
“అందుకు యెహోవా, ‘నీవు అతన్ని ప్రలోభపెట్టడంలో విజయం సాధిస్తావు, వెళ్లు అలాగే చేయి’ అన్నారు.
22“కాబట్టి యెహోవా నీ ఈ ప్రవక్తల నోట మోసపరచే ఆత్మను ఉంచారు. యెహోవా ఈ విపత్తును నీకోసం నిర్ణయించారు.”
23అప్పుడు కెనాన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి మీకాయాను చెంపమీద కొట్టాడు. “నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా నుండి వెళ్లినప్పుడు ఏ మార్గాన వెళ్లాడు?” అని అతడు అడిగాడు.
24మీకాయా జవాబిస్తూ, “నీవు దాక్కోడానికి లోపలి గదిలోకి చొరబడే రోజున నీవు తెలుసుకుంటావు” అన్నాడు.
25అప్పుడు ఇశ్రాయేలు రాజు, “మీకాయాను నగర పాలకుడైన ఆమోను దగ్గరకు, అలాగే రాకుమారుడైన యోవాషు దగ్గరకు తీసుకెళ్లి, 26వారితో ఇలా చెప్పండి, ‘రాజు ఇలా అన్నారు: నేను క్షేమంగా తిరిగి వచ్చేవరకు, ఇతన్ని చెరసాలలో ఉంచి అతనికి రొట్టె, నీరు తప్ప ఏమి ఇవ్వకండి’ ” అని ఆదేశించాడు.
27మీకాయా, “ఒకవేళ మీరు క్షేమంగా వస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడలేదని అర్థం. ప్రజలారా, మీరంతా నా మాట గుర్తు పెట్టుకోండి!” అని ప్రకటించాడు.
రామోత్ గిలాదు దగ్గర అహాబు మరణం
28కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్ గిలాదు మీదికి వెళ్లారు. 29ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “యుద్ధంలో ప్రవేశించేటప్పుడు నేను మారువేషంలో యుద్ధానికి వెళ్తాను, మీరు మాత్రం మీ రాజవస్త్రాలు ధరించుకోండి” అని అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు మారువేషంలో యుద్ధానికి వెళ్లాడు.
30సిరియా రాజు తన రథాధిపతులకు, “మీరు ఇశ్రాయేలు రాజు ఒక్కనితో తప్ప, చిన్నవారితో గాని గొప్పవారితో గాని యుద్ధం చేయకూడదు” అని ఆదేశించాడు. 31అయితే ఆ రథాధిపతులు యెహోషాపాతును చూసి, “ఇతడే ఇశ్రాయేలు రాజు” అనుకుని అతనిపై దాడి చేయడానికి అతని మీదికి రాగా యెహోషాపాతు బిగ్గరగా కేక వేశాడు. అప్పుడు యెహోవా అతనికి సహాయం చేశారు. దేవుడే వారిని అతని దగ్గర నుండి తరిమివేశారు. 32ఎలాగంటే, అతడు ఇశ్రాయేలు రాజు కాడని రథాధిపతులు తెలుసుకొని వారు అతన్ని తరమడం ఆపివేశారు.
33అయితే ఎవడో ఒకడు విల్లెక్కుపెట్టి బాణం వేయగా అది ఇశ్రాయేలు రాజుకు కవచం అతుకు మధ్యలో గుచ్చుకుంది. రాజు తన రథసారధితో, “రథం వెనుకకు త్రిప్పి నన్ను యుద్ధం నుండి బయటకు తీసుకెళ్లు, నేను గాయపడ్డాను” అని అన్నాడు. 34రోజంతా హోరాహోరీగా యుద్ధం జరిగింది. ఇశ్రాయేలు రాజు సాయంత్రం వరకు అరామీయులకు ఎదురుగా తన రథాన్ని ఆసరాగా చేసుకున్నాడు. సూర్యాస్తమయ సమయంలో అతడు చనిపోయాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 18: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.