2 దినవృత్తాంతములు 21

21
1తర్వాత యెహోషాపాతు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు. 2వీరు యెహోరాము సహోదరులు, అంటే యెహోషాపాతు కుమారులు: అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్యా. వీరంతా ఇశ్రాయేలు#21:2 ఇది, తరచుగా 2 దినవృత్తాంతములో యూదా అని వాడబడింది. రాజైన యెహోషాపాతు కుమారులు. 3వారి తండ్రి వారికి అనేక వెండి, బంగారం విలువైన వస్తువులను బహుమతులుగా ఇచ్చాడు, వాటితో పాటు యూదాలో కోటగోడలు గల పట్టణాలు కూడా ఇచ్చాడు. అయితే యెహోరాము తనకు ప్రథమ పుత్రుడు, కాబట్టి అతనికి రాజ్యం ఇచ్చాడు.
యూదా రాజైన యెహోరాము
4యెహోరాము తన తండ్రి రాజ్యం మీద తన పరిపాలనను సుస్థిరం చేసుకున్న తర్వాత అతడు తన సోదరులందరినీ, ఇశ్రాయేలు అధికారులలో కొందరిని ఖడ్గంతో చంపేశాడు. 5యెహోరాము రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు. 6అతడు అహాబు కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు, కాబట్టి అహాబు ఇంటివారిలా ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు. యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. 7అయినప్పటికీ, యెహోవా దావీదుతో చేసిన ఒడంబడిక కారణంగా, దావీదు ఇంటిని నాశనం చేయడానికి యెహోవా ఇష్టపడలేదు. దావీదుకు, అతని వారసులకు ఒక దీపం#21:7 ఇక్కడ దీపం రూపకం, దావీదు యొక్క రాజవంశానికి ప్రతీక. ఎల్లప్పుడు వెలుగుతూ ఉంటుందని ఆయన వాగ్దానం చేశారు.
8యెహోరాము కాలంలో, ఎదోమీయులు యూదాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమ సొంత రాజును నియమించుకున్నారు. 9కాబట్టి యెహోరాము తన సేనాధిపతులతో రథాలన్నిటితో అక్కడికి వెళ్లాడు. ఎదోమీయులు అతన్ని, అతని రథసారధులను చుట్టుముట్టారు, కాని అతడు రాత్రిలో లేచి వారిపై దాడి చేశాడు. 10ఈనాటికీ ఎదోము యూదాను వ్యతిరేకిస్తూ ఉంది.
అదే సమయంలో లిబ్నా తిరుగబడింది, ఎందుకంటే యెహోరాము తన పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు. 11అంతే కాదు, అతడు యూదా కొండల పైన క్షేత్రాలను కట్టించి, యెరూషలేము ప్రజలను వ్యభిచారుల్లా ప్రవర్తించేలా చేశాడు, యూదావారిని తప్పుత్రోవ పట్టించాడు.
12అప్పుడు యెహోరాముకు ప్రవక్తయైన ఏలీయా నుండి ఈ లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది:
“మీ తండ్రియైన దావీదుకు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘నీవు నీ తండ్రియైన యెహోషాపాతు జీవిత విధానాలను యూదా రాజైన ఆసా జీవిత విధానాలను అనుసరించలేదు. 13అయితే నీవు ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించి, అహాబు ఇంటివారు చేసినట్లుగా, నీవు యూదా వారిని, యెరూషలేము వారిని వ్యభిచరించేలా చేశావు. నీవు నీ సొంత సోదరులను, నీ సొంత కుటుంబ సభ్యులను, నీ కంటే మెరుగైన పురుషులను కూడా హత్య చేశావు. 14కాబట్టి గొప్ప తెగులుతో నీ ప్రజలను, నీ కుమారులను, భార్యలను, నీకు చెందినదంతటిని యెహోవా దెబ్బతో కొడతారు. 15మీరు ప్రేగులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధితో అనారోగ్యం పాలవుతారు, ఆ వ్యాధిని బట్టి మీ ప్రేగులు జారిపోతాయి.’ ”
16యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, కూషీయులకు దగ్గరలో ఉన్న అరబీయులను పురికొల్పారు. 17వారు యూదా పైకి దండెత్తివచ్చి, రాజభవనంలో ఉన్న వస్తువులన్నిటిని, అతని కుమారులను భార్యలను తీసుకెళ్లారు. అతని కుమారులలో చిన్నవాడైన యెహోయాహాజు#21:17 హెబ్రీలో అహజ్యా ఇది మరో పేరు ఒక్కడే మిగిలాడు.
18ఇదంతా జరిగాక, యెహోవా యెహోరామును ప్రేగులలో నయంకాని జబ్బుతో మొత్తారు. 19రోజు రోజుకు జబ్బు ఎక్కువవుతూ వచ్చింది. రెండేళ్ళ తర్వాత ఆ జబ్బువలన అతని ప్రేగులు బయటకు వచ్చాయి. మహాబాధతో అతడు చనిపోయాడు. అతని ప్రజలు అతని పూర్వికులకు చేసినట్టు అతనికి అంత్యక్రియలు జరిగించలేదు.
20యెహోరాము రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలిస్తూ ఉండగా చనిపోయాడు అతని మృతికి ఎవరూ విచారపడలేదు. రాజుల సమాధుల్లో కాకుండ దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 దినవృత్తాంతములు 21: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి