సంఖ్యాకాండము 13

13
1యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను 2– నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను. 3మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. 4వారి పేళ్లు ఏవనగా–రూబేను గోత్రమునకు 5జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు; 6యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు; 7ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు; 8ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ; 9బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ; 10జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు; 11యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ; 12దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మీయేలు; 13ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు; 14నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ; 15గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి. 16దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. 17మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెను–మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో 18దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో 19వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, 20దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము 21కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి. 22వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులగు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను. 23వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టుయొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. 24ఇశ్రాయేలీయులు అక్కడకోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు#13:24 ద్రాక్షగెల. లోయ అను పేరు పెట్టబడెను. 25వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచితిరిగి వచ్చిరి. 26అట్లువారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహరోనులయొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్దకును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. 27వారు అతనికి తెలియపరచినదేమనగా–నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితిమి; అది పాలు తేనెలు ప్రవహించు దేశమే; దాని పండ్లు ఇవి. 28అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. 29అమాలేకీయులు దక్షిణదేశములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి. 30కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచి–మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను. 31అయితే అతనితోకూడ పోయిన ఆ మనుష్యులు–ఆ జనులు మనకంటె బలవంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి. 32మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి–మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు. 33అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి; మా దృష్టికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 13: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

Video for సంఖ్యాకాండము 13