సంఖ్యాకాండము 14

14
1అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను; ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి. 2మరియు ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనుల పైని సణుగుకొనిరి. 3ఆ సర్వసమాజము–అయ్యో ఐగుప్తులో మేమేల చావ లేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలుకాదా? అని వారితో అనిరి. 4వారు–మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా 5మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వసమాజసంఘము ఎదుట సాగిలపడిరి. 6అప్పుడు దేశమును సంచరించి చూచినవారిలోనుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని 7ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో–మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. 8యెహోవా మనయందు ఆనం దించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును; అది పాలు తేనెలు ప్రవహించుదేశము. 9మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై యున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా 10ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికి కనబడెను.
11యెహోవా–ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారిమధ్యను చేసిన సూచకక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక యుందురు? 12నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పగా 13మోషే యెహోవాతో ఇట్లనెను–ఆలాగైతే ఐగుప్తీయులు దానిగూర్చి విందురు; నీవు నీ బలముచేత ఈ జనమును ఐగుప్తీయులలోనుండి రప్పించితివిగదా; వీరు ఈ దేశనివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. 14యెహోవా అను నీవు ఈ ప్రజలమధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియు, నీ మేఘము వారిమీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా. 15కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినయెడల నీ కీర్తినిగూర్చి వినిన జనములు 16–ప్రమాణ పూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవావారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు. 17యెహోవా దీర్ఘశాంతు డును, కృపాతిశయుడును 18దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాటచొప్పున నా ప్రభువుయొక్క బలము ఘనపరచబడును గాక 19ఐగుప్తులోనుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ఈ ప్రజలదోషమును పరిహరించియున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజలదోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా 20యెహోవా–నీ మాటచొప్పున నేను క్షమించియున్నాను. 21అయితే నా జీవముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును. 22నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. 23కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యము చేసినవారిలో ఎవరును దానిని చూడరు. 24నా సేవకుడైన కాలేబు మంచిమనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. 25అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులును కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎఱ్ఱసముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను.
26మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను 27–నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను. 28నీవు వారితో–యెహోవా వాక్కు ఏదనగా–నా జీవముతోడు; మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీయెడల చేసెదను. 29మీ శవములు ఈ అరణ్యములోనే రాలును; మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడినవారందరు, అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలిగి నాకు విరోధముగా సణగినవారందరు రాలిపోవుదురు. 30యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు; ఇది నిశ్చయము. 31అయితే–వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోపలికి రప్పించెదను; మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు; 32అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. 33మీ శవములు ఈ అరణ్యములో క్షయమగువరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచారశిక్షను భరించెదరు. 34మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు. 35ఇది యెహోవా అను నేను చెప్పిన మాట; నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వసమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు; ఇక్కడనే చనిపోవుదురు అనెను. 36ఆ దేశమును సంచరించి చూచుటకై మోషేచేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమునుగూర్చి చెడ్డసమాచారము చెప్పుటవలన సర్వ సమాజము అతనిమీద సణుగునట్లు చేసిన మనుష్యులు, 37అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి. 38అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి. 39మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాల దుఃఖించిరి. 40వారు ఉదయమున లేచి ఆ కొండ కొనమీదికెక్కి–చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్లుదుము అనిరి. 41అప్పుడు మోషే–ఇది ఏల? మీరు యెహోవా మాట మీరు చున్నారేమి? 42అది కొనసాగదు. యెహోవా మీమధ్యను లేడు గనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి. 43ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు; మీరు ఖడ్గముచేత కూలుదురు; మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను. 44అయితే వారు మూర్ఖించి ఆ కొండకొన కెక్కిపోయిరి; అయినను యెహోవా నిబంధనమందసమైనను మోషేయైనను పాళెములోనుండి బయలు వెళ్లలేదు. 45అప్పుడు ఆ కొండమీద నివాసముగానున్న అమాలేకీయులును కనానీయులును దిగి వచ్చి వారిని కొట్టి హోర్మావరకు వారిని తరిమి హతము చేసిరి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యాకాండము 14: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి