సంఖ్యాకాండము 12
12
1మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీనిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. 2వారు–మోషేచేత మాత్రమే యెహోవా పలి కించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పు కొనగా 3యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 4యెహోవా –మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా 5యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. 6వారిద్దరు రాగా ఆయన –నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడుకాడు. 7అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. 8నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను. 9యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను. 10మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారముమీదనుండి ఎత్తబడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. 11అహరోను–అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము; పాపులమైన మేము చేసిన యీ పాపమును మామీద మోపవద్దు. 12తన తల్లి గర్భములోనుండి పుట్టినప్పటికే సగముమాంసము క్షీణించిన శిశు శవమువలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా 13మోషే యెలుగెత్తి–దేవా, దయచేసి యీమెను బాగుచేయుమని యెహోవాకు మొఱపెట్టెను. 14అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖముమీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గు పడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చు కొనవలెను. 15కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరల చేర్చబడువరకు జనులు ముందుకు సాగరైరి. 16తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యాకాండము 12: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.