ద్వితీయోపదేశకాండము 15
15
1ఏడవ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను ఆ గడువురీతి యేదనగా 2తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు. 3అన్యుని నిర్బంధింప వచ్చునుగాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను. 4నీవు స్వాధీన పరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. 5కావున నేడు నేను నీ కాజ్ఞాపించుచున్న యీ ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచు కొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినినయెడల మీలో బీదలు ఉండనే ఉండరు. 6ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవుగాని అప్పుచేయవు; అనేక జనములను ఏలుదువుగాని వారు నిన్ను ఏలరు.
7నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచు కొనకూడదు. 8నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను. 9విడుదల సంవత్సరమైన యేడవసంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీదవాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయినయెడల వాడొకవేళ నిన్నుగూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాపమగును. 10నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవుచేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. 11బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను–నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను.
12నీ సహోదరులలో హెబ్రీయుడేగాని హెబ్రీయురాలేగాని నీకు అమ్మబడి ఆరుసంవత్సరములు నీకు దాస్యము చేసినయెడల ఏడవ సంవత్సరమున వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయవలెను. 13అయితే వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయునప్పుడు నీవు వట్టిచేతులతో వాని పంపివేయకూడదు. 14నీవు ఐగుప్తుదేశములో దాసుడవై యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసికొని, నీ మందలోను నీ కళ్లములోను నీ ద్రాక్షగానుగలోను కొంత అవశ్యముగా వాని కియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ కనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను. 15ఆ హేతువుచేతను నేను ఈ సంగతి నేడు నీ కాజ్ఞాపించియున్నాను. 16అయితే నీయొద్ద వానికి మేలు కలిగినందున–నిన్నును నీ యింటివారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్దనుండి వెళ్లిపోనని అతడు నీతో చెప్పినయెడల 17నీవు కదురును పట్టుకొని, తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడైయుండును. ఆలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను. 18వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలయనగావాడు ఆరుసంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీతముల లాభము నీకు కలిగెను. ఆలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయువాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును.
19నీ గోవులలోనేమి నీ గొఱ్ఱె మేకలలోనేమి తొలి చూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు. నీ గొఱ్ఱె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు. 20యెహోవా యేర్పరచుకొను స్థలమున నీవును నీ యింటివారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలెను. 21దానిలో లోపము, అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండినయెడల నీ దేవుడైన యెహోవాకు దాని అర్పింపకూడదు. 22జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాని తినవచ్చును. వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్లవలె భూమిమీద దాని పార బోయవలెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ద్వితీయోపదేశకాండము 15: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.