ద్వితీయోపదేశకాండము 14

14
1మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనినిబట్టి మిమ్మును మీరు కోసికొనకూడదు, మీ కనుబొమ్మలమధ్య బోడిచేసికొనకూడదు. 2ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను.
3నీవు హేయమైనదేదియు తినకూడదు. మీరు తిన దగిన జంతువులు ఏవేవనగా 4-5ఎద్దు, గొఱ్ఱెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎఱ్ఱ చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండగొఱ్ఱె అనునవే. 6జంతువులలో రెండు డెక్కలు గలదై నెమరువేయు జంతువును తినవచ్చును. 7నెమరువేయువాటిలోనిదే కాని రెండు డెక్కలుగల వాటిలోనిదేకాని నెమరువేసి ఒంటిడెక్కగల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనువాటిని తినకూడదు. అవి మీకు హేయములు. 8మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరువేయదు గనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు.
9నీట నివసించువాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చు ననగా, రెక్కలు పొలుసులుగలవాటినన్నిటిని తినవచ్చును. 10రెక్కలు పొలుసులు లేనిదానిని మీరు తినకూడదు అది మీకు హేయము. 11-20పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తినరానివి ఏవనగా–పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచుపక్షి, పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పగిడికంటె, గుడ్లగూబ, హంస, గూడ బాతు, తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతివిధమైన సంకుబుడికొంగ, కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి. ఎగురు ప్రతి పురుగు మీకు హేయము; వాటిని తినకూడదు, పవిత్రమైన ప్రతి పక్షిని తిన వచ్చును.
21చచ్చినదానిని మీరు తినకూడదు. నీ యింట నున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును.వాడు దానిని తినవచ్చును; లేక అన్యునికి దాని అమ్మవచ్చును; ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.
22ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. 23నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనునట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలోగాని నీ ద్రాక్షారసములోగాని నీ నూనెలోగాని పదియవ పంతును, నీ పశువులలోగాని గొఱ్ఱె మేకలలోగాని తొలిచూలు వాటిని తినవలెను. 24మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా నున్నందున, నీవు వాటిని మోయ లేనియెడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు, వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేతపట్టుకొని, 25నీ దేవుడైన యెహోవా యేర్పరచుకొను స్థలమునకు వెళ్లి నీవు కోరు దేనికైనను 26ఎద్దులకేమి గొఱ్ఱెలకేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి నిచ్చి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి, నీవును నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను. 27లేవీ యులను విడువకూడదు; నీమధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైననులేదు.
28నీ దేవుడైన యెహోవా నీవుచేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు మూడేసి సంవత్సరముల కొకసారి, ఆయేట నీకు కలిగిన పంటలో పదియవ వంతంతయు బయటికి తెచ్చి నీ యింట ఉంచవలెను. 29అప్పుడు నీమధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులును, నీ యింటనున్న పరదేశులును, తండ్రిలేనివారును, విధవరాండ్రును వచ్చి భోజనముచేసి తృప్తిపొందుదురు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయోపదేశకాండము 14: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ద్వితీయోపదేశకాండము 14