ద్వితీయోపదేశకాండము 13

13
1ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి 2నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినయెడల 3అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. 4మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను. 5నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువాని కేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను.
6నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమారుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని 7భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించినయెడల 8వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను. 9చంపుటకు నీ జనులందరికి ముందుగాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను. 10రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తుదేశములోనుండియు దాస్యగృహములోనుండియు నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాయొద్దనుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. 11అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు.
12నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చు చున్న నీ పురములలో ఏదోయొకదానియందు 13పనికి మాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని యితర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను ప్రేరేపించిరని నీవు వినినయెడల, నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. 14అది నిజమైనయెడల, అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగినయెడల 15ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి, దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను. 16దాని కొల్లసొమ్మంతటిని విశాలవీధిలో చేర్చి, నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును దాని కొల్లసొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చి వేయవలెను. అది తిరిగి కట్ట బడక యెల్లప్పుడును పాడుదిబ్బయై యుండును. 17నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచు 18నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిచేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్నినుండి మళ్లుకొని నీయందు కని కరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణముచేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు, నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీయొద్ద ఉంచుకొనకూడదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయోపదేశకాండము 13: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ద్వితీయోపదేశకాండము 13