ద్వితీయోపదేశకాండము 12
12
1మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీ కిచ్చిన దేశమున మీరు భూమిమీద బ్రదుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలును విధులును ఇవి. 2మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతములమీదనేమి మెట్టలమీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్క డెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను. 3వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చటలేకుండ నశింపజేయవలెను. 4వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవానుగూర్చి చేయకూడదు. 5మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్ప రచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. 6అక్కడికే మీరు మీ దహనబలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్ఠితములుగా మీరుచేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱె మేకలలోను తొలిచూలువాటిని తీసికొని రావలెను. 7మీరును మీ దేవుడైన యెహోవా మిమ్ము నాశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములును మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి మీ చేతిపనులన్నిటియందు సంతోషింపవలెను. 8నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతిమనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. 9నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు. 10మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టునుండు శత్రువులందరులేకుండ మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందునప్పుడు 11నేను మీకాజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహనబలులను మీ బలులను మీ దశమభాగములను ప్రతిష్ఠితములుగా మీరుచేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసికొని రావలెను. 12మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ యిండ్లలోఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. 13నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహనబలులను అర్పింపకూడదు సుమీ. 14యెహోవా నీ గోత్రములలో ఒకదానియందు ఏర్పరచుకొను స్థలముననే నీ దహనబలులను అర్పించి నేను మీకాజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. 15అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినకొలదియిండ్ల న్నిటిలో నీ మనస్సు కోరుదానిని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి యెఱ్ఱజింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును. 16మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలె నేలమీద పారబోయవలెను. 17నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి నీ గొఱ్ఱె మేకల మందలోనిదేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛా ర్పణమును ప్రతిష్ఠార్పణమును నీ యింట తినక 18నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ యింట నుండు లేవీయులు, కలిసికొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవుచేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. 19నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను లేవీయులను విడువకూడదు సుమీ.
20నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాటచొప్పున నీ సరిహద్దులను విశాలపరచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినెదననుకొందువు. అప్పుడు నీకిష్టమైన మాంసము తినవచ్చును. 21నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచు కొను స్థలము మీకు దూరముగా ఉండినయెడల 22యెహోవా నీకిచ్చిన గోవులలోనిదేగాని మీ గొఱ్ఱె మేకలలోనిదేగాని నేను నీ కాజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించినదాని నీ యింట తినవచ్చును. జింకను దుప్పిని తినునట్లు దాని తినవచ్చును. పవిత్రాపవిత్రులు భేదములేకుండ తినవచ్చును. 23అయితే రక్తమును తిననే తినకూడదు. భద్రము సుమీ. ఏలయనగా రక్తము ప్రాణము; మాంసముతో ప్రాణాధారమైనదాని తినకూడదు; 24నీవు దాని తినక భూమిమీద నీళ్లవలె పారబోయవలెను. 25నీవు యెహోవా దృష్టికి యుక్తమైనదానిని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతివారికి మేలుకలుగునట్లు దాని తినకూడదు. 26నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసికొని పోవలెను. 27నీ దహనబలులను వాటి రక్తమాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠముమీద అర్పింపవలెను. నీ బలుల రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠముమీద పోయవలెను; వాటి మాంసము నీవు తినవలెను. 28నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతివారికిని నిత్యము మేలుకలుగునట్లు నేను నీకాజ్ఞాపించుచున్న యీ మాటలన్నిటిని నీవు జాగ్ర త్తగా వినవలెను.
29నీవు వారి దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్లు చున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి నాశముచేసిన తరువాత, నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని, వారి దేశములో నివసించునప్పుడు, వారు నీ యెదుటనుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్లి చిక్కుబడి, 30వారి దేవతలను ఆశ్ర యింపగోరి–ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసెదనని అనుకొనకుండ జాగ్రత్తగా ఉండవలెను. 31తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవానుగూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు గదా. 32నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ద్వితీయోపదేశకాండము 12: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.