ఆది 49

49
యాకోబు తన కొడుకులపై పలికిన దీవెనలు
1యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. “మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను.
2యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి.
మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి.
3రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి,
నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి.
4పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు.
ఎందుకంటే నువ్వు, నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు.
నువ్వు నా మంచం మీదికి ఎక్కావు.
5షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు.
6నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు.
నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది.
కోపంలో వారు మనుషులను చంపారు.
సరదా కోసం ఎద్దుల కాళ్ళ నరాలు తెగ్గొట్టారు.
7వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది.
అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజల్లో విభాగిస్తాను.
ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.
8యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు.
నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది.
నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు.
9యూదా సింహం పిల్ల.
నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు.
అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు.
సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు.
అతన్ని లేపడానికి తెగించేవాడెవడు?
10షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు.
అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు.
రాజ్యాలు అతనికి లోబడతాయి.
11ద్రాక్షావల్లికి తన గాడిదనూ,
మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి,
ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు.
12అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా,
అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి.
13జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు.
అతడు ఓడలకు రేవుగా ఉంటాడు.
అతని పొలిమేర సీదోను వరకూ ఉంటుంది.
14ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద.
15అతడు మంచి విశ్రాంతి స్థలాన్నీ రమ్యమైన భూమినీ చూశాడు.
బరువులు మోయడానికి భుజం వంచి చాకిరీ చేసే దాసుడయ్యాడు.
16దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా
తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు.
17దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి,
రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు.
18యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను.
19దోపిడీ గాళ్ళు గాదును కొడతారు.
అయితే, అతడు వాళ్ళ మడిమెను కొడతాడు.
20ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది.
రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు.
21నఫ్తాలి వదిలిపెట్టిన లేడి.
అతనికి అందమైన పిల్లలుంటారు.
22యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ.
దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి.
23విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు.
అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు.
24అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది.
అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి.
ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన,
ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది.
25నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన,
నిన్ను దీవించే సర్వశక్తుని వలన, నీకు పైనుండి వచ్చే దీవెనలు,
కింది అగాధపు దీవెనలు, స్తనాల, గర్భాల దీవెనలు వస్తాయి.
26నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా,
నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి.
అవి యోసేపు తల మీద ఉంటాయి.
తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి.
27బెన్యామీను ఆకలిగొన్న తోడేలు.
అతడు ఉదయాన ఎరను మింగి,
దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.”
యాకోబు మరణం, సమాధి
28ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే. 29తరువాత అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు. “నేను నా పూర్వీకుల దగ్గరికి వెళ్ళబోతున్నాను. 30హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానినీ ఆ పొలాన్నీ హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు.
31అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను. 32ఆ పొలాన్నీ అందులోని గుహనూ హేతు కొడుకుల దగ్గర కొన్నారు” అన్నాడు. 33యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించడం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరికి చేరాడు.

Выбрано:

ఆది 49: IRVTel

Выделить

Поделиться

Копировать

None

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь

Видео по ఆది 49