ఆది 42
42
యోసేపు అన్నలు ఐగుప్తుకు పోవడం
1ఐగుప్తులో ధాన్యం ఉందని యాకోబు తెలుసుకుని “మీరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారేంటి?” అని తన కొడుకులతో అన్నాడు. 2“చూడండి, ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాను. మనం చావకుండా బతికేలా మీరు అక్కడికి వెళ్ళి మన కోసం అక్కడనుంచి ధాన్యం కొనుక్కురండి” అన్నాడు.
3యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనడానికి వెళ్ళారు. 4అయితే యాకోబు “అతనికి ఏదైనా హాని సంభవిస్తుందేమో” అని యోసేపు తమ్ముడైన బెన్యామీనును అతని అన్నలతో పంపలేదు.
5కరువు కనాను దేశంలో ఉంది కాబట్టి ధాన్యం కొనడానికి వచ్చిన వారితో ఇశ్రాయేలు కొడుకులు కూడా వచ్చారు. 6అప్పుడు యోసేపు ఆ దేశానికి అధికారిగా ఉన్నాడు. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యాన్ని అమ్మేవాడు కాబట్టి యోసేపు అన్నలు వచ్చి ముఖాలు వంచి నేలకు వంగి యోసేపుకు నమస్కారం చేశారు.
7యోసేపు తన అన్నలను చూసి వారిని గుర్తు పట్టి వారికి తెలియని మనిషిలా వారితో కఠినంగా మాట్లాడి “మీరెక్కడనుండి వచ్చారు?” అని అడిగాడు. అందుకు వారు “ఆహారం కొనడానికి కనాను దేశం నుండి వచ్చాము” అన్నారు. 8యోసేపు తన అన్నలను గుర్తు పట్టాడు గాని వారు అతణ్ణి గుర్తు పట్టలేదు.
9యోసేపు వారిని గూర్చి తనకు వచ్చిన కలలను గుర్తుకు తెచ్చుకుని “మీరు గూఢచారులు. ఈ దేశపు గుట్టు తెలుసుకోడానికి వచ్చారు” అన్నాడు. 10వారు “లేదు ప్రభూ, మీ దాసులైన మేము ఆహారం కొనడానికే వచ్చాము. 11మేమంతా ఒక తండ్రి కొడుకులం. మేము నిజాయితీగల వాళ్ళం. నీ దాసులమైన మేము గూఢచారులం కాదు” అని బదులిచ్చారు. 12అయితే అతడు వారితో “కాదు, ఈ దేశం గుట్టు తెలుసుకోడానికి మీరు వచ్చారు” అన్నాడు. 13అందుకు వారు “నీ దాసులమైన మేము పన్నెండుగురు అన్నదమ్ములం. కనాను దేశంలో ఉన్న ఒక తండ్రి కొడుకులం. ఇదిగో, అందరిలో చిన్నవాడు ఈ రోజు మా నాన్న దగ్గర ఉన్నాడు. ఒకడు లేడు” అన్నారు.
14అయితే యోసేపు “కాదు, నేను చెప్పినట్టు మీరు గూఢచారులే. 15మీ అసలు సంగతి ఇలా తెలుస్తుంది. ఫరో జీవం తోడు, మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే తప్ప మీరిక్కడనుంచి వెళ్ళరు. 16మీ తమ్ముణ్ణి తీసుకురావడానికి మీలో ఒకణ్ణి పంపండి. అప్పటి వరకూ మీరు ఇక్కడ బందీలుగా ఉంటారు. మీలో నిజముందో లేదో మీ మాటల్లో తెలుస్తుంది. లేకపోతే ఫరో జీవం తోడు, మీరు గూఢచారులే” అని చెప్పి 17వారిని మూడు రోజులు చెరసాలలో వేయించాడు.
18మూడవ రోజు యోసేపు వారిని చూసి “నేను దేవునికి భయపడే వాణ్ణి. మీరు బతకాలంటే ఇలా చేయండి. 19మీరు నిజాయితీగల వారైతే మీ సోదరుల్లో ఒకడు ఈ చెరసాలలో ఉండాలి. మిగతావారు మీ ఇంటి వారి కరువు తీరడానికి ధాన్యం తీసుకు వెళ్ళండి.
20మీ తమ్ముణ్ణి నా దగ్గరికి తీసుకురండి. అప్పుడు మీ మాటలు నిజమే అని తెలుస్తుంది, మీరు చావరు” అని చెప్పాడు. కాబట్టి వారు అలా చేశారు. 21అప్పుడు వారు ఒకడితో ఒకడు “మన తమ్ముని విషయంలో మనం నిజంగా అపరాధులమే. అతడు మనలను బతిమాలినప్పుడు మనం అతని వేదన చూసి కూడా వినలేదు.” 22రూబేను “ఈ చిన్నవాడి పట్ల పాపం చేయవద్దని నేను మీతో చెప్పినా మీరు వినలేదు, కాబట్టి అతని చావును బట్టి మనకు తగిన శాస్తి జరుగుతున్నది” అని వారితో అన్నాడు.
23వారి మాటలు యోసేపుకు అర్థమయ్యాయని వారికి తెలియదు, ఎందుకంటే వారి మధ్య తర్జుమా చేసేవాడు ఒకడున్నాడు. 24యోసేపు వారి దగ్గరనుండి అవతలకు పోయి ఏడ్చాడు. వారి దగ్గరికి తిరిగి వచ్చి వారితో మాట్లాడాడు. వారిలో షిమ్యోనును పట్టుకుని వారి కళ్ళెదుటే అతన్ని బంధించాడు. 25తన అన్నల సంచుల్లో ధాన్యం నింపమనీ, ఎవరి డబ్బులు వారి సంచుల్లోనే తిరిగి ఉంచమనీ, ప్రయాణం కోసం భోజనపదార్ధాలు వారికివ్వాలనీ తన పనివారికి ఆజ్ఞాపించాడు. 26వారు, తాము కొనిన ధాన్యాన్ని గాడిదల మీద ఎక్కించుకుని అక్కడనుంచి వెళ్ళిపోయారు.
యోసేపు అన్నలు కనానుకు తిరిగి రావడం
27అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేతపెట్టడానికి తన సంచి విప్పితే అతని ధనం కనబడింది. అవి అతని సంచి మూతిలో ఉన్నాయి. 28అప్పుడతడు “నా డబ్బు నాకే ఉంది. చూడండి, నా సంచిలోనే ఉంది” అని తన సోదరులతో అన్నాడు. వారి గుండెలు అదిరిపోయాయి. వారు వణికిపోతూ ఒకరితో ఒకరు “ఇదేంటి దేవుడు మనకిలా చేశాడు?” అనుకున్నారు.
29వారు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరికి వచ్చి తమకు జరిగినదంతా అతనికి తెలియచేశారు. 30“ఆ దేశానికి అధిపతి, మాతో కఠినంగా మాట్లాడి, మేము ఆ దేశాన్ని వేగు చూడడానికి వచ్చామనుకున్నాడు. 31అప్పుడు మేము, ‘అయ్యా, మేము నిజాయితీపరులం, గూఢచారులం కాదు. 32పన్నెండు మంది సోదరులం, ఒక్క తండ్రి కొడుకులం, ఒకడు లేడు, చిన్నవాడు ఇప్పుడు కనాను దేశంలో మా నాన్న దగ్గర ఉన్నాడు’ అని అతనితో చెప్పాము. 33అందుకు ఆ దేశాధిపతి, మాతో ‘మీరు నిజాయితీపరులని ఇలా తెలుసుకుంటాను. మీ సోదరుల్లో ఒకణ్ణి నా దగ్గర విడిచిపెట్టి, మీ ఇంట్లోవారికి కరువు తీరేలా ధాన్యం తీసుకు వెళ్ళండి. 34నా దగ్గరికి ఆ చిన్నవాణ్ని తీసుకు రండి. అప్పుడు మీరు నిజాయితీపరులనీ గూఢచారులు కారనీ నేను తెలుసుకుని మీ సోదరుణ్ణి మీకప్పగిస్తాను. అప్పుడు మీరు ఈ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు’ అని చెప్పాడు” అన్నారు.
35వారు తమ సంచులు కుమ్మరిస్తే ఎవరి డబ్బుల మూట వారి సంచుల్లో ఉంది. వారూ వారి తండ్రీ ఆ డబ్బుల మూటలు చూసి భయపడ్డారు. 36అప్పుడు వారి తండ్రి యాకోబు “మీరు నా పిల్లల విషయంలో నన్ను దుఃఖానికి గురిచేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుపోతారు. ఇవన్నీ నా మీదికే వచ్చాయి” అని వారితో అన్నాడు. 37అందుకు రూబేను “నేనతన్ని నీ దగ్గరికి తీసుకు రాకపోతే, నా ఇద్దరు కొడుకులను నువ్వు చంపెయ్యవచ్చు. అతన్ని నా చేతికి అప్పగిస్తే, అతన్ని తిరిగి మీ దగ్గరికి తీసుకు వస్తాను” అని చెప్పాడు. 38అయితే అతడు “నా కొడుకును మీతో వెళ్ళనివ్వను. అతని అన్న చనిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలాడు. మీరు వెళ్ళే దారిలో ఇతనికి హాని కలిగితే తల నెరిసిన నన్ను దుఃఖంతో మృత్యులోకంలోకి దిగిపోయేలా చేస్తారు” అన్నాడు.
Выбрано:
ఆది 42: IRVTel
Выделить
Поделиться
Копировать

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.