ఆది 39

39
యోసేపు, పొతీఫరు భార్య
1యోసేపును ఐగుప్తుకు తీసుకొచ్చారు. ఫరో దగ్గర ఉద్యోగి, రాజు అంగరక్షకుల అధిపతి అయిన పోతీఫరు అనే ఐగుప్తీయుడు, అతన్ని అక్కడికి తీసుకొచ్చిన ఇష్మాయేలీయుల దగ్గర యోసేపును కొన్నాడు. 2యెహోవా యోసేపుతో ఉన్నాడు. అతడు వర్ధిల్లుతూ తన యజమాని అయిన ఐగుప్తీయుని ఇంట్లో ఉన్నాడు. 3యెహోవా అతనికి తోడై ఉన్నాడనీ, అతడు చేసేదంతా యెహోవా సఫలం చేస్తున్నాడనీ అతని యజమాని గమనించాడు. 4యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు. అతడు పొతీఫరుకు సేవ చేశాడు. పొతీఫరు తన ఇంటి మీద యోసేపును కార్యనిర్వాహకునిగా నియమించి తనకు కలిగినదంతా అతని అధీనంలో ఉంచాడు.
5అతడు తన ఇంటి మీదా తనకు ఉన్న దానంతటి మీదా అతన్ని కార్యనిర్వహకునిగా నియమించిన దగ్గరనుండి యెహోవా యోసేపును బట్టి ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా దీవెన అతని ఇంట్లో, పొలంలో, అతనికి ఉన్న దానంతటి మీదా ఉంది. 6అతడు తనకు కలిగినదంతా యోసేపుకు అప్పగించి, తాను భోజనం చేయడం తప్ప తనకేమి ఉందో ఏమి లేదో చూసుకొనేవాడు కాడు. యోసేపు అందగాడు, చూడడానికి బావుంటాడు.
7ఆ తరువాత అతని యజమాని భార్య యోసేపును మోహించింది. “నాతో సుఖపడు” అని అతనిని అడిగింది. 8అయితే అతడు తిరస్కరించి “నా యజమాని తనకు కలిగినదంతా నా వశంలో ఉంచాడు. నేను ఇక్కడ ఉండడం వలన ఇంట్లో ఏ విషయాన్నీ అతడు చూసుకోవడం లేదు. 9ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నువ్వు అతని భార్యవు కాబట్టి నిన్ను మినహాయించి మిగతా అంతటినీ అతడు నా అధీనంలో ఉంచాడు. కాబట్టి నేనెలా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తాను?” అని తన యజమాని భార్యతో అన్నాడు.
10ప్రతిరోజూ ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉంది గానీ అతడు ఆమెతో ఉండడానికి గానీ పాపం చేయడానికి గానీ ఒప్పుకోలేదు. 11అలా ఉండగా ఒక రోజు అతడు పని మీద ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళెవరూ అక్కడ లేరు. 12అప్పుడామె అతని పై వస్త్రాన్ని పట్టుకుని “నాతో పండుకో” అని అడిగింది. అతడు తన బట్టను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. 13అతడు తన పై వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవడం ఆమె చూసి, 14తన ఇంట్లో పనిచేసే వారిని పిలిచి “చూడండి, పోతీఫరు మనలను ఎగతాళి చేయడానికి ఒక హెబ్రీయుణ్ణి మన దగ్గరికి తెచ్చాడు. నాతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వీడు నా దగ్గరికి వస్తే నేను పెద్ద కేక వేశాను. 15నేను పెద్దగా కేకవేయడం వాడు విని నా దగ్గర తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు” అని వారితో చెప్పింది.
16అతని యజమాని ఇంటికి వచ్చే వరకూ ఆమె అతని వస్త్రాన్ని తన దగ్గర ఉంచుకుంది. 17ఆమె తన భర్తతో ఇలా వివరించింది. “నువ్వు మన దగ్గరికి తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయడానికి నా దగ్గరికి వచ్చాడు. 18నేను బిగ్గరగా కేక వేస్తే వాడు తన పై వస్త్రాన్ని నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు.” 19“నీ దాసుడు నాకిలా చేశాడు” అని తన భార్య తనతో చెప్పిన మాటలు విని పొతీఫరు, కోపంతో మండిపడ్డాడు.
20యోసేపు యజమాని అతన్ని రాజు ఖైదీలను బంధించే చెరసాలలో వేయించాడు. అతడు చెరసాలలో ఉన్నాడు. 21అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి, అతని మీద నిబంధన సంబంధమైన విశ్వాస్యతను చూపించాడు. చెరసాల అధిపతి అతన్ని అభిమానంగా చూసుకోనేలా చేశాడు. 22చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపుకు అప్పగించాడు. వారక్కడ చేసే పనులన్నీ యోసేపే చేయించేవాడు. 23యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల అధిపతి యోసేపుకు తాను అప్పగించిన దేనినీ ఇక పట్టించుకునేవాడు కాదు. అతడు చేసేదంతా యెహోవా సఫలం చేశాడు.

Выбрано:

ఆది 39: IRVTel

Выделить

Поделиться

Копировать

None

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь