ఆది 32

32
1యాకోబు తన దారిలో వెళ్తూ ఉండగా దేవదూతలు అతనికి ఎదురయ్యారు. 2యాకోబు వారిని చూసి “ఇది దేవుని సేన” అని చెప్పి ఆ చోటికి #32:2 చుట్టుముట్టిన ప్రదేశంమహనయీము అని పేరు పెట్టాడు. 3యాకోబు ఎదోము ప్రాంతంలో, అంటే శేయీరు దేశంలో ఉన్న తన సోదరుడు ఏశావు దగ్గరికి తనకు ముందుగా దూతలను పంపి, 4“మీరు నా ప్రభువైన ఏశావుతో, ‘ఇంతవరకూ నేను లాబాను దగ్గర నివసించాను. 5నాకు పశువులూ గాడిదలూ మందలూ దాసదాసీజనమూ ఉన్నారు. నీ అనుగ్రహం నాపైనఉండాలని నా ప్రభువుకు తెలపడానికి పంపాను అని నీ సేవకుడైన యాకోబు అన్నాడు’ అని చెప్పండి” అని వారికి ఆజ్ఞాపించాడు.
6ఆ దూతలు యాకోబు దగ్గరికి తిరిగివచ్చి “మేము నీ సోదరుడైన ఏశావు దగ్గరికి వెళ్ళాం, అతడు నాలుగు వందల మందితో నీకు ఎదురు వస్తున్నాడు” అని చెప్పారు. 7అప్పుడు యాకోబు చాలా భయపడి, హతాశుడై, 8“ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేస్తే మిగిలిన గుంపు తప్పించుకుని పోవచ్చు” అనుకుని, తనతో ఉన్న ప్రజలనూ మందలనూ పశువులనూ ఒంటెలనూ రెండు గుంపులు చేశాడు. 9అప్పుడు యాకోబు “నా తండ్రి అబ్రాహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, ‘నీ దేశానికీ, నీ బంధువుల దగ్గరికీ తిరిగి వెళ్ళు, నీకు మేలు చేస్తాను’ అని నాతో చెప్పిన యెహోవా, 10నువ్వు నీ సేవకుడికి చేసిన ఉపకారాలన్నిటికీ నమ్మకత్వమంతటికీ నేను పాత్రుణ్ణి కాను. ఎందుకంటే, కేవలం ఈ నా చేతి కర్రతో ఈ యొర్దాను దాటాను. ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను. 11నా సోదరుడు ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలనీ వారి తల్లులనూ నన్నూ చంపుతాడేమో అని భయపడుతున్నాను. 12నాతో, ‘నేను నీకు తోడై తప్పకుండా మేలు చేస్తూ వారి సంఖ్యను బట్టి లెక్కించలేని సముద్రపు ఇసకలాగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను’ అని నువ్వు సెలవిచ్చావు కదా” అన్నాడు.
13అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న ఏశావు కోసం ఒక కానుకను సిద్ధం చేశాడు. 14అతడు రెండువందల మేకలూ ఇరవై మేక పోతులూ రెండువందల గొర్రెలూ ఇరవై పొట్టేళ్ళూ 15ముప్ఫై పాడి ఒంటెలూ వాటి పిల్లలూ నలభై ఆవులూ పది ఆబోతులూ ఇరవై ఆడ గాడిదలూ పది గాడిద పిల్లలూ తీసుకు మందమందను వేరు వేరుగా ఉంచాడు. 16వాటిని అతడు తన దాసులకు అప్పగించి “మీరు మంద మందకు మధ్య ఖాళీ ఉంచి నాకంటే ముందుగా నడవండి” అని వారితో చెప్పాడు.
17వారిలో మొదటివాడితో “నా సోదరుడు ఏశావు నీకు ఎదురుగా వచ్చి, ‘నీవెవరి వాడివి? ఎక్కడికి వెళ్తున్నావు? నీ ముందు ఉన్నవి ఎవరివి?’ అని నిన్ను అడిగితే 18నువ్వు, ‘ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కోసం అతడు పంపిన కానుక. అదిగో అతడు మా వెనక వస్తున్నాడు’ అని చెప్పు” అని ఆజ్ఞాపించాడు. 19“నేను ముందుగా పంపుతున్న కానుకల వలన అతనిని శాంతింపజేసిన తరువాత నేను అతనికి కనబడతాను. అప్పుడతడు ఒకవేళ నా పైన దయ చూపుతాడేమో. 20కాబట్టి మీరు ఏశావును చూసి, ‘ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనకాలే వస్తున్నాడు’ అని చెప్పాలి” అని వారికి చెప్పాడు. రెండవ గుంపుకు, మూడవ గుంపుకు, మందల వెంబడి వెళ్ళిన వారికందరికీ అతడు ఇదే విధంగా ఆజ్ఞాపించాడు. 21అతడు ఆ కానుకను తనకు ముందుగా పంపి తాను గుంపులో ఆ రాత్రి నిలిచిపోయాడు.
యాకోబు దేవునితో పోరాటం
22ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలనూ తన ఇద్దరు దాసీలనీ తన పదకొండు మంది పిల్లలనూ తీసుకు యబ్బోకు రేవు దాటిపోయాడు. 23యాకోబు వారిని ఆ యేరు దాటించి తనకు కలిగిందంతా వారితో పంపేశాడు. 24యాకోబు ఒక్కడు మిగిలి పోయాడు. ఒక మనిషి తెల్లవారేదాకా అతనితో పెనుగులాడాడు. 25తాను గెలవకపోవడం చూసి అతడు యాకోబు తొడ గూటి మీద కొట్టాడు. అప్పుడు ఆయనతో పెనుగులాడ్డం వలన యాకోబు తొడ గూడు జారిపోయింది. 26ఆయన “తెల్లవారుతున్నది, నన్ను పోనియ్యి” అన్నప్పుడు, యాకోబు “నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనియ్యను” అన్నాడు.
27ఆయన “నీ పేరేమిటి?” అని అడిగాడు. అతడు “యాకోబు” అని చెప్పాడు. 28అప్పుడాయన “నువ్వు దేవునితో, మనుషులతో పోరాడి గెలిచావు. కాబట్టి ఇక ముందు నీ పేరు #32:28 దేవునితో పోరాడిన వాడు.ఇశ్రాయేలు, యాకోబు కాదు” అని చెప్పాడు. 29అప్పుడు యాకోబు “దయచేసి నీ పేరు చెప్పు” అన్నాడు. అందుకాయన “నా పేరు ఎందుకు అడుగుతావు?” అని చెప్పి అక్కడ అతణ్ణి ఆశీర్వదించాడు. 30యాకోబు “నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను. అయినా నా ప్రాణం నిలిచింది” అని ఆ స్థలానికి “#32:30 దేవుని ముఖంపెనూయేలు” అని పేరు పెట్టాడు.
31అతడు పెనూయేలు నుండి బయలుదేరి నప్పుడు సూర్యోదయం అయ్యింది. అతడు తొడ కుంటుతూ నడిచాడు. 32ఆయన యాకోబు తొడగూటి మీది తుంటినరంపై కొట్టి గూడు వసిలేలా చేసాడు కాబట్టి ఈనాటి వరకూ ఇశ్రాయేలీయులు తొడ గూటి మీద ఉన్న తుంటినరాన్ని తినరు.

Выбрано:

ఆది 32: IRVTel

Выделить

Поделиться

Копировать

None

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь