ఆది 31
31
యాకోబు తన కుటుంబాన్ని, మందలను తీసుకుని వెళ్ళిపోవడం
1లాబాను కొడుకులు “యాకోబు మన తండ్రికి ఉన్నదంతా తీసుకుని, దాని వలన ఈ ఆస్తి అంతా సంపాదించుకున్నాడు” అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు. 2అంతే గాక అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది తన విషయంలో ఇంతకు ముందులాగా ప్రసన్నంగా లేదు.
3అప్పుడు యెహోవా “నీ పూర్వీకుల దేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు. నేను నీకు తోడై ఉంటాను” అని యాకోబుతో చెప్పాడు.
4యాకోబు పొలంలో తన మంద దగ్గరికి రాహేలునీ లేయానీ పిలిపించి వారితో, 5“ఇంతకు ముందులాగా మీ నాన్న నేనంటే ఇష్టం చూపడం లేదని నాకు కనిపిస్తున్నది. అయితే నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. 6నేను మీ నాన్నకు నా శాయశక్తులా సేవ చేశానని మీకు తెలుసు. 7మీ నాన్న నన్ను మోసం చేసి పది సార్లు నా జీతం మార్చాడు. అయినా దేవుడు అతని మూలంగా నాకు నష్టం రానియ్యలేదు.
8అతడు, ‘పొడలు గలవి నీ జీతమవుతాయి’ అని చెప్పినప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలను ఈనాయి. ‘చారలు గలవి నీ జీతమవుతాయి’ అని చెప్పినప్పుడు అవి చారలు గల పిల్లలను ఈనాయి. 9ఆ విధంగా దేవుడు మీ నాన్న మందలను తీసి నాకిచ్చాడు. 10మందలు చూలు కట్టే కాలంలో నేను కలలో చూసినపుడు గొర్రెలతో జత కట్టే పొట్టేళ్ళు చారలు గానీ పొడలు గానీ మచ్చలు గానీ కలిగి ఉన్నాయి.
11ఆ కలలో దేవుని దూత ‘యాకోబూ’ అని నన్ను పిలిచినప్పుడు నేను ‘చిత్తం, ప్రభూ’ అన్నాను. 12అప్పుడు ఆయన ‘నీ కళ్ళు పైకెత్తి చూడు. గొర్రెలతో జంటకట్టే పొట్టేళ్ళన్నీ చారలు, పొడలు, మచ్చలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే లాబాను నీకు చేస్తున్న దానంతటినీ నేను చూశాను. 13నీవెక్కడ స్తంభం మీద నూనె పోశావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేశావో, ఆ బేతేలు దేవుణ్ణి నేనే. ఇప్పుడు నువ్వు ఈ దేశం విడిచిపెట్టి నువ్వు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు’ అని నాతో చెప్పాడు” అన్నాడు.
14అందుకు రాహేలు, లేయాలు “ఇంకా మా నాన్న ఇంట్లో మాకు వంతు, వారసత్వం ఉన్నాయా? అతడు మమ్మల్ని పరాయివాళ్ళుగా చూడడం లేదా? 15అతడు మమ్మల్ని అమ్మివేసి, మాకు రావలసిన సొమ్మంతటినీ పూర్తిగా తినేశాడు. 16దేవుడు మా నాన్న దగ్గరనుండి తీసేసిన ధనమంతా మాదీ మా పిల్లలదీ కాదా? కాబట్టి దేవుడు నీతో ఏది చెబితే అది చెయ్యి” అని అతనికి జవాబు చెప్పారు.
17యాకోబు తన కొడుకులనూ తన భార్యలనూ ఒంటెల మీద ఎక్కించి 18తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వెళ్ళడానికి తన పశువులన్నిటినీ, పద్దనరాములో తాను సంపాదించిన సంపద అంతటినీ తీసుకు కనాను దేశానికి బయలుదేరాడు. 19లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిన సమయంలో రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్న గృహ దేవుళ్ళను దొంగిలించింది. 20యాకోబు తాను వెళ్ళిపోతున్నట్టు సిరియావాడైన లాబానుకు తెలియ పరచకపోవడం చేత అతణ్ణి మోసపుచ్చినట్టు అయ్యింది. 21అతడు తనకు కలిగినదంతా తీసుకు పారిపోయాడు. అతడు నది దాటి గిలాదు కొండ ప్రాంతాల వైపు వెళ్ళాడు.
లాబాను యాకోబును తరమడం
22యాకోబు పారిపోయాడని మూడో రోజుకి లాబానుకు తెలిసింది. 23అతడు తన బంధువులను వెంటబెట్టుకుని, ఏడు రోజుల ప్రయాణమంత దూరం యాకోబును తరుముకుని వెళ్లి, గిలాదు కొండ మీద అతణ్ణి కలుసుకున్నాడు. 24ఆ రాత్రి కలలో దేవుడు లాబాను దగ్గరికి వచ్చి “నువ్వు యాకోబుతో మంచి గానీ చెడు గానీ పలకవద్దు. జాగ్రత్త సుమా” అని అతనితో చెప్పాడు. 25చివరికి లాబాను యాకోబును కలుసుకున్నాడు. యాకోబు తన గుడారాన్ని ఆ కొండ మీద వేసుకుని ఉన్నాడు. లాబాను కూడా తన బంధువులతో గిలాదు కొండమీద గుడారం వేసుకున్నాడు.
26అప్పుడు లాబాను యాకోబుతో “ఏంటి, ఇలా చేశావు? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టిన వారిలాగా నా కూతుళ్ళను తీసుకుపోవడం ఎందుకు? 27నాకు చెప్పకుండా రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చావేంటి? సంబరంగా, పాటలతో, కంజరిలతో, సితారాలతో నిన్ను సాగనంపి ఉండేవాడినే. 28నేను నా మనవళ్ళనూ, కూతుళ్ళనూ ముద్దు పెట్టుకోనియ్యకుండా బుద్ధిహీనంగా ఇలా చేశావు.
29నేను మీకు హాని చేయగలను. అయితే రాత్రి మీ తండ్రి దేవుడు, ‘జాగ్రత్త సుమా! నువ్వు యాకోబుతో మంచి గానీ చెడు గానీ పలకవద్దు’ అని నాతో చెప్పాడు. 30నీ తండ్రి ఇంటి మీద బెంగ కలిగి వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళు, నా దేవుళ్ళను దొంగిలించావేంటి?” అన్నాడు.
31అందుకు యాకోబు “నువ్వు బలవంతంగా నా నుండి నీ కుమార్తెలను తీసుకుంటావేమో అని భయపడ్డాను. 32ఎవరి దగ్గర నీ దేవుళ్ళు కనబడతాయో వారు బతకకూడదు. నువ్వు మన బంధువుల ముందు వెదికి చూసి నీది నా దగ్గర ఏదైనా ఉంటే దాన్ని తీసుకో” అని లాబానుతో చెప్పాడు. రాహేలు వాటిని దొంగిలించిందని యాకోబుకు తెలియలేదు. 33లాబాను యాకోబు గుడారంలోకీ లేయా గుడారంలోకీ ఇద్దరు దాసీల గుడారాల్లోకీ వెళ్ళాడు గాని అతనికేమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారంలో నుండి రాహేలు గుడారంలోకి వెళ్ళాడు.
34రాహేలు ఆ విగ్రహాలను తీసి ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికి చూసినా అవి దొరకలేదు. 35ఆమె తన తండ్రితో “తమ ఎదుట నేను లేఛి నిలబడనందుకు తమరు కోపపడవద్దు. నేను నా నెలసరి కాలంలో ఉన్నాను” అని చెప్పింది. అతడెంత వెతికినా ఆ విగ్రహాలు దొరకలేదు.
36యాకోబు కోపంగా లాబానుతో వాదిస్తూ “నేనేం ద్రోహం చేశాను? నీవిలా మండిపడి నన్ను తరమడానికి నేను చేసిన పాపమేంటి? 37నువ్వు నా సామానంతా తడివి చూశాక నీ ఇంటి వస్తువుల్లో ఏమైనా దొరికిందా? నావారి ముందూ, నీవారి ముందూ దాన్ని తెచ్చి పెట్టు. వారు మన ఇద్దరి మధ్య తీర్పు తీరుస్తారు. 38ఈ ఇరవై సంవత్సరాలూ నేను నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలైనా మేకలైనా ఏవీ పిల్లలు కనకుండా పోలేదు, నీ మంద పొట్టేళ్ళను దేనినీ నేను తినలేదు. 39క్రూర జంతువులు చంపివేసిన దాన్ని నీ దగ్గరికి తీసుకురాకుండా ఆ నష్టం నేనే పెట్టుకున్నాను. పగలైనా, రాత్రైనా, ఇతరులు దొంగిలించిన వాటి విలువను నా దగ్గరే వసూలు చేశావు. 40నేనెలా ఉన్నానో చూడు, పగలు ఎండకీ రాత్రి మంచుకూ క్షీణించిపోయాను. నా కళ్ళకి నిద్ర అనేదే లేకుండా పోయింది.
41నీ ఇద్దరు కూతుళ్ళకోసం పద్నాలుగు సంవత్సరాలూ నీ మంద కోసం ఆరు సంవత్సరాలూ మొత్తం ఇరవై సంవత్సరాలు నీకు సేవ చేస్తూ నీ ఇంట్లో ఉన్నాను. అయినా నువ్వు నా జీతం పదిసార్లు మార్చావు. 42నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను తప్పకుండా ఖాళీ చేతులతోనే వెళ్ళగొట్టి ఉండేవాడివి. దేవుడు నా ప్రయాసనీ నా చేతుల కష్టాన్నీ చూశాడు. అందుకే గత రాత్రి నిన్ను గద్దించాడు” అని అన్నాడు.
43అందుకు లాబాను “ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడేదంతా నాదే. ఈ నా కుమార్తెలనైనా, వీరికి పుట్టిన కొడుకులనైనా నేనేం చేయగలను? 44కాబట్టి నువ్వూ నేనూ ఒక నిబంధన చేసుకుందాం రా. అది నాకూ, నీకూ మధ్య సాక్షిగా ఉంటుంది” అని యాకోబుతో అన్నాడు. 45అప్పుడు యాకోబు ఒక రాయి తీసి దాన్ని ఒక స్తంభంగా నిలబెట్టాడు. 46“రాళ్ళు పోగుచేయండి” అని తన బంధువులతో చెప్పగానే వారు రాళ్ళు తెచ్చి కుప్పగా వేశారు. వారు ఆ కుప్ప దగ్గర భోజనం చేశారు. 47లాబాను దానికి “#31:47 ఈ అరమేయిక్ పదానికి సాక్ష్యం గుట్ట (లేక కుప్ప) అని అర్థం. యగర్ శహదూతా” అని పేరు పెట్టాడు. కానీ యాకోబు దానికి “#31:47 ఇది పైనున్న పదానికి సమానమైన అర్థం ఇస్తున్నది గానీ వేరొక యాస.గలేదు” అని పేరు పెట్టాడు.
యాకోబు, లాబాను ఒడంబడిక
48లాబాను “ఈ రోజు ఈ కుప్ప నాకూ నీకూ మధ్య సాక్షిగా ఉంటుంది” అని చెప్పాడు. అందుకే దానికి గలేదు అనే పేరు వచ్చింది. 49ఇంక “మనం ఒకరి కొకరం దూరంగా ఉన్నప్పటికీ యెహోవా నాకూ నీకూ మధ్య జరిగేది కనిపెడతాడు” అని చెప్పాడు కాబట్టి దానికి “#31:49 ఎత్తైన ప్రదేశం. మెరక ప్రదేశం. తరువాతి కాలంలో కావలి గోపురం అనే అర్థం స్థిర పడింది.మిస్పా” అని కూడా పేరు పెట్టారు. 50తరువాత లాబాను “నువ్వు నా కుమార్తెలను బాధ పెట్టినా, నా కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్ళి చేసుకున్నా, చూడు, మన దగ్గర ఎవరూ లేకపోయినా, నాకూ నీకూ మధ్య దేవుడే సాక్షి” అని చెప్పాడు.
51అదీ గాక లాబాను “నాకూ నీకూ మధ్య నేను నిలబెట్టిన ఈ స్తంభాన్నీ, ఈ రాళ్ళ కుప్పనీ చూడు. 52నీకు హాని చేయడానికి నేను ఈ కుప్పనీ, ఈ స్తంభాన్నీ దాటి నీ దగ్గరికి రాకుండా, నువ్వు నాకు హాని చేయడానికి ఈ కుప్పనీ, ఈ స్తంభాన్నీ దాటి నా దగ్గరికి రాకుండా ఉండడానికి ఈ కుప్ప, ఈ స్తంభమూ సాక్షి. 53అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు, మన మధ్య న్యాయం తీరుస్తాడు” అని చెప్పాడు. అప్పుడు యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడిన దేవుని తోడు అని ప్రమాణం చేశాడు.
54యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయడానికి తన బంధువులను పిలిచినప్పుడు వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి గడిపారు. 55తెల్లవారినప్పుడు లాబాను తన మనుమలనూ తన కుమార్తెలనూ ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు.
Выбрано:
ఆది 31: IRVTel
Выделить
Поделиться
Копировать

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.