నిర్గమ 7

7
యెహోవా మోషేతో చెప్పిన మాట
1యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించాను. నీ అన్న అహరోను నీ మాటలు వినిపించే ప్రవక్తగా ఉంటాడు. 2నేను నీకు ఆజ్ఞాపించేదంతా నువ్వు మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనివ్వాలని నీ అన్న అహరోను ఫరోతో చెబుతాడు. 3అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను. ఆ దేశంలో అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు జరిగిస్తాను. 4అప్పుడు కూడా ఫరో మీ మాట వినడు. కాబట్టి నా చెయ్యి ఐగుప్తు మీద మోపి గొప్ప తీర్పు క్రియలతో నా సేనలు అంటే ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పిస్తాను. 5నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి వాళ్ళ మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు రప్పించినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.”
అహరోను కర్ర పాముగా మారిపోవడం
6మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు. 7వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు, అహరోను వయసు 83 సంవత్సరాలు. 8యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు. “మీ దేవుని శక్తి రుజువు చేయడానికి ఏదైనా ఒక అద్భుతం చూపించండి అని మిమ్మల్ని అడిగితే 9నువ్వు అహరోనుకు నీ చేతికర్రను ఇచ్చి దాన్ని ఫరో ముందు పడవెయ్యమని చెప్పు. అది పాముగా మారిపోతుంది.” 10మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. యెహోవా వారికి చెప్పినట్టు అహరోను ఫరో ఎదుటా అతని పరివారం ఎదుటా తన కర్రను పడవేసినప్పుడు అది పాముగా మారింది.
11అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాడు. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తితో అదే విధంగా చేశారు. 12వాళ్ళలో ప్రతి మాంత్రికుడూ తమ కర్రలను పడవేసినప్పుడు అవి పాములుగా మారాయి గాని అహరోను వేసిన కర్ర వాళ్ళు వేసిన కర్రలను మింగివేసింది. 13అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠివంగా మారిపోయింది, అతడు వారి మాట పెడచెవిన పెట్టాడు.
మొదటి తెగులు
14తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఫరో హృదయం కఠినంగా మారింది. అతడు ఈ ప్రజలను పంపడానికి ఒప్పుకోవడం లేదు. 15ఉదయాన్నే ఫరో నది ఒడ్డుకు వెళ్తాడు. అప్పుడు నువ్వు నది దగ్గర నిలబడి పాముగా అయిన కర్రను పట్టుకుని ఫరోకు ఎదురు వెళ్ళు. 16అతనితో, ‘ఎడారిలో ఆయన్ని సేవించడానికి ఆయన ప్రజలను వెళ్ళనివ్వమని ఆజ్ఞాపించడానికి హెబ్రీయుల దేవుడు యెహోవా నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఇంతకు ముందు నువ్వు మా మాట వినలేదు. 17ఇప్పుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను నదిలో ఉన్న నీళ్ళను కొడుతున్నాను. నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి. దీన్ని బట్టి ఆయన యెహోవా అని నీవు తెలుసుకుంటావు 18నదిలోని చేపలన్నీ చనిపోతాయి. నది దుర్వాసన కొడుతుంది. ఐగుప్తీయులు ఆ నీళ్ళు తాగలేకపోతారు’ అని యెహోవా చెబుతున్నాడు.”
19యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “నువ్వు అహరోనుతో ఇలా చెప్పు. నీ కర్ర పట్టుకుని ఐగుప్తు నీళ్ళ మీద అంటే, వారి నదుల మీద, కాలువల మీద, చెరువుల మీద, నీటి గుంటలన్నిటి మీదా నీ చెయ్యి చాపు. ఆ నీళ్ళన్నీ రక్తంగా మారిపోతాయి. ఐగుప్తు దేశమంతా చెక్క తొట్లలో, రాతి పాత్రల్లో సహా రక్తం ఉంటుంది.” 20యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే అహరోనులు చేశారు. ఫరో, అతని సేవకులు చూస్తూ ఉండగా అహరోను తన కర్ర పైకెత్తి నది నీళ్లను కొట్టినప్పుడు నది నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి.
21నదిలోని చేపలన్నీ చచ్చిపోయాయి, నది నుండి దుర్వాసన కొట్టింది. ఐగుప్తీయులు నది నీళ్లు తాగలేక పోయారు. ఐగుప్తు దేశమంతా రక్తమయం అయింది. 22ఐగుప్తు మాంత్రికులు కూడా ఆ విధంగానే చేయగలిగారు. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు. 23జరిగిన దాన్ని లక్ష్యపెట్టకుండా ఫరో తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. 24అయితే ఐగుప్తీయులందరూ నది నీళ్లు తాగలేకపోయారు. మంచినీళ్ళ కోసం నది ఒడ్డున గుంటలు తవ్వుకున్నారు. 25యెహోవా నదిని కొట్టిన తరువాత ఏడు రోజులు గడిచాయి.

Выделить

Поделиться

Копировать

None

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь