నిర్గమ 1

1
ఇశ్రాయేలు ప్రజల దురవస్థ
1యాకోబుతోబాటు ఐగుప్తుకు వెళ్ళిన అతని కొడుకులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను, 2దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. 3యాకోబుకు పుట్టిన సంతానం మొత్తం 70 మంది. 4యోసేపు ఐగుప్తులో ఉన్న ఆ సమయంలో 5వీళ్ళంతా తమ తమ కుటుంబాలతో సహా ఐగుప్తులో నివసించారు.
6యోసేపు, అతని అన్నదమ్ములు, వాళ్ళ తరం వారు అంతా చనిపోయారు. 7ఇశ్రాయేలు ప్రజలు వారు నివసిస్తున్న ప్రాంతమంతటా తమ సంతానంతో బాగా విస్తరించి అభివృద్ధి పొందారు. ఆ ప్రాంతమంతా ఇశ్రాయేలు ప్రజలతో నిండిపోయింది. 8కొంతకాలానికి యోసేపు ఎవరో తెలియని కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలు పెట్టాడు.
9అతడు తన ప్రజలతో ఇలా అన్నాడు “ఇశ్రాయేలు ప్రజలను చూడండి. వీళ్ళు మనకంటే సంఖ్యలో ఎక్కువగా, శక్తిమంతులుగా ఉన్నారు. 10వాళ్ళ విషయంలో మనం తెలివిగా ఏదన్నా చేద్దాం. లేకపోతే వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. ఒకవేళ యుద్ధం గనక వస్తే వాళ్ళు మన శత్రువులతో చేతులు కలిపి మనకి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్లిపోతారేమో” అన్నాడు.
11అందుచేత వారు ఇశ్రాయేలు ప్రజలచే కఠిన బాధ చేయించి కఠినులైన అధికారులను వారి మీద నియమించాడు. ఆ అధికారులు ఫరో రాజు కోసం పీతోము, రామెసేసు అనే గిడ్డంగుల పట్టణాలను కట్టించారు. 12ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను అణగదొక్కేకొద్దీ వారు అంతకంతకూ విస్తరిస్తూ పోవడంతో వారు ఇశ్రాయేలు ప్రజల విషయం భయాందోళనలు పెంచుకున్నారు. 13ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో మరింత కష్టమైన పనులు చేయించుకున్నారు. 14బంకమట్టి పని, ఇటుకల పని, పొలంలో చేసే ప్రతి పనీ కఠినంగా చేయించుకుని వారి ప్రాణాలు విసిగిపోయేలా చేశారు. వారు ఇశ్రాయేలు ప్రజలతో చేయించుకొనే అన్ని పనులూ కఠిన బాధతో కూడి ఉండేవి.
15ఐగుప్తు రాజు హీబ్రూ మంత్రసానులతో మాట్లాడాడు. వారి పేర్లు షిఫ్రా, పూయా. 16“మీరు హెబ్రీ స్త్రీలకు పురుడు పోస్తున్నప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి. మగ పిల్లవాడు పుడితే ఆ బిడ్డను చంపివేయండి, ఆడ పిల్ల అయితే బతకనియ్యండి” అన్నాడు. 17అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయలేదు. మగపిల్లలను చంపకుండా బతకనిచ్చారు. 18ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి “మీరు ఇలా ఎందుకు చేశారు? మగపిల్లలను చంపకుండా ఎందుకు బతకనిచ్చారు?” అని అడిగాడు.
19అప్పుడు ఆ మంత్రసానులు “హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలలాంటి వాళ్ళు కాదు. తెలివైనవాళ్ళు. మంత్రసాని వాళ్ళ దగ్గరికి వెళ్లకముందే ప్రసవిస్తున్నారు” అని ఫరోతో చెప్పారు. 20మంత్రసానులు దేవునికి భయపడినందువల్ల దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో వారి సంతానం విస్తరించింది. 21ఆయన వారి వంశాన్ని వృద్ధి చేశాడు. 22అప్పుడు ఫరో “వారికి పుట్టిన ప్రతి మగపిల్లవాణ్ణి నైలు నదిలో పడవేయండి. ఆడపిల్లను బతకనియ్యండి” అని తన ఐగుప్తు ప్రజలకు ఆజ్ఞాపించాడు.

Выделить

Поделиться

Копировать

None

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь