ఆదికాండము 50

50
1యోసేపు తన తండ్రి ముఖముమీదపడి అతని గూర్చి యేడ్చి అతని ముద్దుపెట్టుకొనెను. 2తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి. 3సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడువారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతనికొరకు నలుబది దినములు సంపూర్ణమాయెను. అతనిగూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చిరి. 4అతనిగూర్చిన అంగలార్పు దినములు గడచిన తరువాత యోసేపు ఫరో యింటి వారితో మాటలాడి–మీ కటాక్షము నామీద నున్నయెడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి 5–నా తండ్రి నాచేత ప్రమాణము చేయించి–ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్ట వలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నే నక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చెదనని చెప్పుడనెను. 6అందుకు ఫరో–అతడు నీచేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను. 7కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను; అతనితో ఫరో యింటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరును 8యోసేపు యింటివారందరును అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారును వెళ్లిరి. వారు తమ పిల్లలను తమ గొఱ్ఱెల మందలను తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి. 9మరియు రథములును రౌతులును అతనితో వెళ్లినందున ఆ సమూహము బహు విస్తార మాయెను. 10యొర్దానునకు అవతలనున్న ఆఠదు కళ్లమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రినిగూర్చి యేడు దినములు దుఃఖము సలిపెను. 11ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆఠదు కళ్లము నొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి–ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖ మని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్#50:11 అనగా, ఐగుప్తీయుల దుఃఖము. మిస్రాయిము అను పేరు పెట్టబడెను, అది యొర్దానునకు అవతల నున్నది. 12అతని కుమారులు తన విషయమై అతడు వారికాజ్ఞాపించినట్లు చేసిరి. 13అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసికొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశానముకొరకు స్వాస్థ్యముగానుండు నిమిత్తము మమ్రే యెదుట హిత్తీయుడైన ఎఫ్రోనుయొద్ద కొనెను.
14యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులును అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరును తిరిగి ఐగుప్తునకు వచ్చిరి.
15యోసేపు సహోదరులు తమ తండ్రి మృతిపొందుట చూచి–ఒకవేళ యోసేపు మనయందు పగపెట్టి మన మత నికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని 16యోసేపునకు ఈలాగు వర్తమాన మంపిరి 17–నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించిన దేమనగా–మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను. 18మరియు అతని సహోదరులు పోయి అతని యెదుట సాగిలపడి–ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా 19యోసేపు–భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? 20మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరిగాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. 21కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను.
22యోసేపు అతని తండ్రి కుటుంబపువారును ఐగుప్తులో నివసించిరి, యోసేపు నూటపది సంవత్సరములు బ్రది కెను. 23యోసేపు ఎఫ్రాయిముయొక్క మూడవతరము పిల్లలను చూచెను; మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. 24యోసేపు తన సహోదరులను చూచి–నేను చనిపోవు చున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను 25మరియు యోసేపు –దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించు కొనెను. 26యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.

Выделить

Поделиться

Копировать

None

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь

Видео по ఆదికాండము 50