ఆదికాండము 45

45
1అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి యెదుట తన్నుతాను అణచుకొనజాలక–నా యొద్దనుండి ప్రతిమనుష్యుని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్నుతాను తెలియచేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండలేదు. 2అతడు ఎలుగెత్తి యేడ్వగా ఐగుప్తీయులును ఫరో యింటివారును వినిరి. 3అప్పుడు యోసేపు–నేను యోసేపును; నా తండ్రి యింక బ్రదికియున్నాడా అని అడిగి నప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందర పడి అతనికి ఉత్తరము ఇయ్యలేక పోయిరి. 4అంతట యోసేపు–నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పి నప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు–ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. 5అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 6రెండు సంవత్సరములనుండి కరవు దేశములోనున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును 7ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 8కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటి వారికందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగాను నియమించెను. 9మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో–నీ కుమారుడైన యోసేపు– దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు; 10నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొఱ్ఱెలమందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. 11ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి. 12ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నవి. 13ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియ చేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసికొనిరండని తన సహోదరులతో చెప్పి 14తన తమ్ముడైన బెన్యామీను మెడమీదపడి యేడ్చెను; బెన్యామీను అతని మెడమీదపడి యేడ్చెను. 15అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకొని వారిమీదపడి యేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి.
16యోసేపుయొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో యింటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకు లకును ఇష్టముగా నుండెను. 17అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను–నీవు నీ సహోదరులను చూచి–మీరీలాగు చేయుడి, మీ పశువులమీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్లి 18మీ తండ్రిని మీ యింటివారిని వెంట బెట్టుకొని నా యొద్దకు రండి; ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకిచ్చెదను, ఈ దేశముయొక్క సారమును మీరు అనుభవించెదరు. 19నీకు ఆజ్ఞయైనది గదా? దీని చేయుడి, మీ పిల్లలకొరకును మీ భార్యలకొరకును ఐగుప్తులోనుండి బండ్లను తీసికొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి. 20ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా 21ఇశ్రాయేలు కుమారులు ఆలాగుననే చేసిరి. యోసేపు ఫరోమాటచొప్పున వారికి బండ్లను ఇప్పించెను; మార్గమునకు ఆహారము ఇప్పించెను. 22అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యా మీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను, 23అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును తినుబండములను మోయుచున్న పది ఆడు గాడిదలను పంపెను. 24అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా–మార్గమందు కలహ పడకుడని వారితో చెప్పెను. 25వారు ఐగుప్తునుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి 26యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. 27అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచి నప్పుడు వారి తండ్రియైన యాకోబు ప్రాణము తెప్ప రిల్లెను. 28అప్పుడు ఇశ్రాయేలు–ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రదికియున్నాడు, నేను చావకమునుపు వెళ్లి అతని చూచెదనని చెప్పెను.

Выделить

Поделиться

Копировать

None

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь

Видео по ఆదికాండము 45