ఆదికాండము 40

40
1అటుపిమ్మట ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల తప్పుచేసిరి 2గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన యిద్దరు ఉద్యోగస్థులమీద కోపపడి 3వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. 4ఆ సేనాధిపతి వారిని యోసేపు వశముచేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్నిదినములు కావలిలోనుండినతరువాత 5వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి; ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను. 6తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతా క్రాంతులై యుండిరి. 7అతడు–ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి యున్నవని తన యజమానుని యింట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్థుల నడిగెను. 8అందుకు వారు–మేము కలలు కంటిమి; వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి–భావములు చెప్పుట దేవుని అధీనమే గదా; మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. 9అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి–నా కలలో ఒక ద్రాక్షావల్లి నా యెదుట ఉండెను; 10ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలుండెను, అది చిగిరించినట్టు ఉండెను; దాని పువ్వులు వికసించెను; దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను. 11మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను; ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను. 12అప్పుడు యోసేపు–దాని భావ మిదే; ఆ మూడు తీగెలు మూడుదినములు; 13ఇంక మూడుదినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పాన దాయకుడవై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతనిచేతికప్పగించెదవు 14కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్నుగూర్చి మాటలాడి యీ యింటిలోనుండి నన్ను బయటికి రప్పించుము. 15ఏలయనగా నేను హెబ్రీయుల దేశములోనుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను. 16అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను–నేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండివంటలు గల మూడు గంపలు నా తలమీద ఉండెను. 17మీదిగంపలో ఫరో నిమిత్తము సమస్తవిధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలమీదనున్న ఆ గంపలోనుండి వాటిని తీసికొని తినుచుండెను. 18అందుకు యోసేపు–దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడుదినములు 19ఇంక మూడుదినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీదనుండి నీ మాంసమును తినివేయునని ఉత్తర మిచ్చెను.
20మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందుచేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి 21పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరోచేతికి గిన్నె నిచ్చెను. 22మరియు యోసేపు వారికి తెలిపిన భావముచొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. 23అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసికొనక అతని మరచిపోయెను.

Выделить

Поделиться

Копировать

None

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь

Видео по теме ఆదికాండము 40