నిర్గమకాండము 3

3
1మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. 2ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవాదూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను.గాని పొద కాలిపోలేదు. 3అప్పుడు మోషే–ఆ పొద యేల కాలిపోలేదో నేను ఆతట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను. 4దానిని చూచుటకు అతడు ఆతట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండి–మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు–చిత్తము ప్రభువా అనెను. 5అందుకాయన–దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. 6మరియు ఆయన–నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను. 7మరియు యెహోవా యిట్లనెను–నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి. 8కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను. 9ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని. 10కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను. 11అందుకు మోషే–నేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడనని దేవునితో అనగా 12ఆయన–నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను. 13మోషే–చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయులయొద్దకు వెళ్లి వారిని చూచి–మీపితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు–ఆయన పేరేమి అని అడిగినయెడల వారితో నే నేమి చెప్పవలెనని దేవుని నడిగెను. 14అందుకు దేవుడు –నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన–ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. 15మరియు దేవుడు మోషేతో నిట్లనెను–మీపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. 16నీవు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి–మీపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, నాకు ప్రత్యక్షమై యిట్లనెను – నేను మిమ్మును, ఐగుప్తులో మీకు సంభవించిన దానిని, నిశ్చయముగా చూచితిని, 17ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము. 18వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజునొద్దకు వెళ్లి అతని చూచి–హెబ్రీ యులదేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. 19ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును; 20కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భు తములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును. 21మరియు నేను ఈ జనుల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు. 22ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండినగలను బంగారునగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను.

Выделить

Поделиться

Копировать

None

Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь