ఆదికాండము 28
28
1ఇస్సాకు యాకోబును పిలిపించి–నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు. 2నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొను మని యతనికి ఆజ్ఞాపించి 3–సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభి వృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసికొనునట్లు 4ఆయన నీకు, అనగా నీకును నీతోకూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి 5యాకోబును పంపివేసెను. అతడు పద్దన రాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను. 6ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు–నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞా పించెననియు 7యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లిపోయెననియు ఏశావు తెలిసికొని నప్పుడు, 8ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసి నప్పుడు 9ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమా ర్తెయు నెబాయోతు సహోదరియునైన మాహలతును కూడ పెండ్లి చేసికొనెను.
10-11యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను. 12అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. 13మరియు యెహోవా దానికి పైగా నిలిచి–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. 14నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును; నీవు పడమటితట్టును తూర్పుతట్టును ఉత్తరపుతట్టును దక్షిణపుతట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. 15ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా 16యాకోబు నిద్ర తెలిసి–నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని 17భయపడి–ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమేగాని వేరొకటికాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను. 18తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను. 19మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను#28:19 అనగా – దేవుని మందిరము. పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. 20-21అప్పుడు యాకోబు–నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినయెడల యెహోవా నాకు దేవుడైయుండును. 22మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.