ఆదికాండము 27
27
1ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్దకుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు–చిత్తము నాయనా అని అతనితోననెను. 2అప్పుడు ఇస్సాకు– ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు. 3కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము. 4నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచి గల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని చెప్పెను. 5ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్లెను. 6అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి–ఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో 7–మృతి బొందకమునుపు నేనుతిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకొరకు మాంసము తెచ్చి నాకు రుచి గల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. 8కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించునట్టు చేయుము. 9నీవు మందకు వెళ్లి రెండు మంచి మేక పిల్లలను అక్కడనుండి నాయొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను. 10నీ తండ్రి మృతిబొందక ముందు అతడు వాటినితిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రియొద్దకు తీసికొనిపోవలెననెను. 11అందుకు యాకోబు–నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్ననివాడను గదా. 12ఒకవేళ నాతండ్రి నన్ను తడవిచూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల నా మీదికి శాపమేగాని ఆశీర్వాదము తెచ్చు కొననని చెప్పెను. 13అయినను అతని తల్లి–నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాటమాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా 14అతడు వెళ్లి వాటిని తన తల్లియొద్దకు తీసికొనివచ్చెను. అతని తల్లి అతని తండ్రి కిష్టమైన రుచి గల భోజ్యములను సిద్ధపఱచెను. 15మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్దనుండెను గనుక 16రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతనిచేతులను అతని మెడమీద నునుపు భాగమును కప్పి 17తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతి కియ్యగా 18అతడు తన తండ్రియొద్దకు వచ్చి–నా తండ్రీ, అనిపిలువగా అతడు–ఏమి నా కుమారుడా, నీ వెవరవని అడిగెను 19అందుకు యాకోబు–నేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పినప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచికూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను. 20అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా అతడు–నీ దేవుడైన యెహోవా నా యెదుటికి దాని రప్పించుటచేతనే అని చెప్పెను. 21అప్పుడు ఇస్సాకు–నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పెను. 22యాకోబు తనతండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచి–స్వరము యాకోబు స్వరముగాని చేతులు ఏశావు చేతులే అనెను. 23యాకోబు చేతులు అతని అన్నయైన ఏశావు చేతులవలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గురుతు పట్టలేక అతనిని దీవించి 24–ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు–నేనే అనెను. 25అంతట అతడు అది నాయొద్దకు తెమ్ము; నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందు ననెను; అతడు తెచ్చినప్పుడు అతడు తినెను; ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను. 26తరువాత అతని తండ్రియైన ఇస్సాకు –నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెను. 27అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దుపెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసనచూచి అతని దీవించి యిట్లనెను.
ఇదిగో నా కుమారుని సువాసన
యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది.
28ఆకాశపుమంచును భూసారమును
విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును
దేవుడు నీ కనుగ్రహించుగాక
జనములు నీకు దాసులగుదురు
29జనములు నీకు సాగిలపడుదురు
నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము
నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు
నిన్ను శపించువారు శపింపబడుదురు
నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక
30ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. 31అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రియొద్దకు తెచ్చి–నా తండ్రీ నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినదాని తినుమని తన తండ్రితోననెను. 32అతని తండ్రియైన ఇస్సాకు–నీ వెవర వని అతని నడిగినప్పుడు అతడు–నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా 33ఇస్సాకు మిక్కు టముగా గడగడ వణకుచు–అట్లయితే వేటాడిన భోజ్యమును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలోతిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను. 34ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసి–ఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. 35అతడు–నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను. 36ఏశావు–యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పి–నాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను. 37అందుకు ఇస్సాకు–ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తర మియ్యగా 38ఏశావు–నా తండ్రీ, నీయొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రీ, నన్ను, నన్ను కూడ దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి యేడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు–
39నీ నివాసము భూసారము లేకయు
పైనుండిపడు ఆకాశపు మంచు లేకయు నుండును.
40నీవు నీకత్తిచేత బ్రదుకుదువు
నీ సహోదరునికి దాసుడవగుదువు
నీవు తిరుగులాడుచుండగా
నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను.
41తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావు–నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. 42రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు మాటలనుగూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను–ఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్నుగూర్చి తన్నుతాను ఓదార్చుకొనుచున్నాడు. 43కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకు 44-45నీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచువరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము; అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ యిద్దరిని నేను పోగొట్టుకొన నేల అనెను.
46మరియు రిబ్కా ఇస్సాకుతో–హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసికొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజన మనెను.
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.