YouVersion Logo
Search Icon

యెషయా 42

42
యెహోవా సేవకుడు
1“ఇదిగో, నేను నిలబెట్టుకునే నా సేవకుడు,
నేను ఏర్పరచుకున్నవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను;
ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను.
ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు.
2అతడు కేకలు వేయడు, అరవడు,
వీధుల్లో ఆయన స్వరం వినబడనీయడు.
3నలిగిన రెల్లును అతడు విరువడు,
మసకగా వెలుగుతున్న వత్తిని ఆర్పడు.
అతడు నమ్మకంగా న్యాయాన్ని చేస్తాడు;
4భూమి మీద న్యాయాన్ని స్థాపించే వరకు
అతడు అలసిపోడు నిరుత్సాహపడడు.
అతని బోధలో ద్వీపాలు నిరీక్షణ కలిగి ఉంటాయి.”
5ఆకాశాలను సృష్టించి వాటిని విశాలపరచి,
భూమిని దానిలో పుట్టిన సమస్తాన్ని విస్తరింపజేసి,
దానిపై ఉన్న ప్రజలకు ఊపిరిని,
దానిపై నడిచే వారికి జీవాన్ని ఇస్తున్న
దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే:
6-7“యెహోవానైన నేను నీతిలో నిన్ను పిలిచాను;
నేను నీ చేయి పట్టుకుంటాను.
గుడ్డివారి కళ్లు తెరవడానికి,
చెరసాలలోని ఖైదీలను విడిపించడానికి,
చీకటి గుహల్లో నివసించేవారిని
బయటకు తీసుకురావడానికి,
నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా,
యూదేతరులకు వెలుగుగా చేస్తాను.
8“నేనే యెహోవాను. అదే నా పేరు!
నా మహిమను నేను మరొకరికి ఇవ్వను
నాకు రావలసిన స్తుతులను విగ్రహాలకు చెందనివ్వను.
9చూడండి, గతంలో చెప్పిన సంగతులు జరిగాయి.
క్రొత్త సంగతులు నేను తెలియజేస్తున్నాను.
అవి జరగకముందే
వాటిని మీకు తెలియజేస్తాను.”
యెహోవాకు స్తుతి గీతం
10సముద్రయానం చేసేవారలారా, సముద్రంలోని సమస్తమా,
ద్వీపాల్లారా, వాటిలో నివసించేవారలారా!
యెహోవాకు క్రొత్త గీతం పాడండి.
భూమి అంచుల నుండి ఆయనను స్తుతించండి.
11అరణ్యం, దాని పట్టణాలు, తమ స్వరాలు ఎత్తాలి;
కేదారు నివాస గ్రామాలు సంతోషించాలి.
సెల ప్రజలు ఆనందంతో పాడాలి;
పర్వత శిఖరాల నుండి వారు కేకలు వేయాలి.
12వారు యెహోవాకు మహిమ చెల్లించి
ద్వీపాల్లో ఆయన స్తుతిని ప్రకటించాలి.
13యెహోవా శూరునిలా బయలుదేరతారు
యోధునిలా ఆయన తన రోషాన్ని రేకెత్తిస్తారు;
ఆయన హుంకరిస్తూ యుద్ధ నినాదం చేస్తూ,
తన శత్రువుల మీద గెలుస్తారు.
14“చాలా కాలం నేను మౌనంగా ఉన్నాను,
నేను నిశ్శబ్దంగా ఉంటూ నన్ను నేను అణచుకున్నాను.
కాని ఇప్పుడు ప్రసవవేదన పడే స్త్రీలా
నేను కేకలువేస్తూ, రొప్పుతూ, ఊపిరి పీల్చుకుంటున్నాను.
15పర్వతాలను, కొండలను పాడుచేస్తాను.
వాటి వృక్ష సంపద అంతటిని ఎండిపోయేలా చేస్తాను;
నదులను ద్వీపాలుగా చేస్తాను
మడుగులను ఆరిపోయేలా చేస్తాను.
16గ్రుడ్డివారిని వారికి తెలియని దారుల్లో తీసుకెళ్తాను,
తెలియని మార్గాల్లో నేను వారిని నడిపిస్తాను.
వారి ఎదుట చీకటిని వెలుగుగా,
వంకర దారులను చక్కగా చేస్తాను.
నేను ఈ కార్యాలు చేస్తాను;
నేను వారిని విడిచిపెట్టను.
17అయితే చెక్కిన విగ్రహాలను నమ్మినవారు
ప్రతిమలతో, ‘మీరు మాకు దేవుళ్ళు’ అని చెప్పేవారు,
చాలా సిగ్గుతో వెనుకకు తిరుగుతారు.
గ్రుడ్డి చెవిటి ఇశ్రాయేలు
18“చెవిటి వారలారా! వినండి.
చూడండి, గ్రుడ్డి వారలారా! చూడండి.
19నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?
నేను పంపిన దూత కాకుండా మరి ఎవడు చెవిటివాడు?
నాతో నిబంధన ఉన్నవాని కన్నా ఎవడు గ్రుడ్డివాడు,
యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?
20నీవు చాలా సంగతులను చూశావు,
కాని నీవు వాటిపై శ్రద్ధ పెట్టవు;
నీ చెవులు తెరచి ఉన్నాయి, కాని నీవు వినవు.”
21యెహోవా తన నీతిని బట్టి
తన ధర్మశాస్త్రాన్ని గొప్పగా, మహిమగలదిగా
చేయడానికి ఇష్టపడ్డారు.
22కాని ఈ ప్రజలు దోచుకోబడి కొల్లగొట్టబడ్డారు,
వారందరూ గుహల్లో చిక్కుకున్నారు,
చెరసాలలో దాచబడ్డారు.
వారు దోచుకోబడ్డారు
వారిని విడిపించే వారెవరూ లేరు.
వారు దోపుడు సొమ్ముగా చేయబడ్డారు,
“వారిని వెనుకకు పంపండి” అని చెప్పేవారు ఎవరూ లేరు.
23మీలో ఎవరు దీనిని వింటారు
రాబోయే కాలంలో ఎవరు శ్రద్ధ చూపిస్తారు?
24యాకోబును దోపుడు సొమ్ముగా అప్పగించింది,
ఇశ్రాయేలును దోపిడి చేసేవారికి అప్పగించింది ఎవరు?
యెహోవా కాదా,
మేము ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు కాదా?
వారు ఆయన మార్గాలను అనుసరించలేదు
ఆయన ధర్మశాస్త్రానికి లోబడలేదు.
25కాబట్టి ఆయన వారిమీద తన కోపాగ్నిని
యుద్ధ వినాశనాన్నీ కుమ్మరించారు.
అది వారి చుట్టూ మంటలతో చుట్టుకుంది,
అయినా వారు గ్రహించలేదు;
అది వారిని కాల్చింది, కాని వారు దాన్ని పట్టించుకోలేదు.

Currently Selected:

యెషయా 42: OTSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in