యెషయా 41
41
ఇశ్రాయేలు సహాయకుడు
1ద్వీపాల్లారా, నా ఎదుట మౌనంగా ఉండండి!
దేశాలు తమ బలాన్ని నూతన పరచుకోవాలి!
వారు ముందుకు వచ్చి మాట్లాడాలి;
తీర్పు తీర్చే స్థలం దగ్గర మనం కలుసుకుందాము.
2“తన సేవ కోసం తూర్పు నుండి ఒకరిని పురికొల్పి
నీతిలో పిలిచింది ఎవరు?
ఆయన అతనికి దేశాలు అప్పగిస్తారు
రాజులను అతని ఎదుట అణచివేస్తారు.
అతడు తన ఖడ్గంతో వాటిని ధూళిగా చేస్తాడు,
తన విల్లుతో గాలికి ఎగిరే పొట్టులా మారుస్తాడు.
3అతడు వారిని వెంటాడుతాడు,
ఇంతకుముందు తాను వెళ్లని దారైనా క్షేమంగా వెళ్తాడు.
4ఎవరు దీనిని ఆలోచించి జరిగించారు?
మొదటి నుండి తరాలను పిలిచింది ఎవరు?
యెహోవానైన నేనే; వారిలో మొదటి వారితో ఉంది నేనే,
చివరి వరకు వారితో ఉండేది నేనే.”
5ద్వీపాలు దానిని చూసి భయపడుతున్నాయి;
భూమి అంచులు వణుకుతున్నాయి.
వారు వచ్చి చేరుతున్నారు;
6వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ,
“ధైర్యంగా ఉండండి!” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు.
7శిల్పి కంసాలివాన్ని ప్రోత్సహిస్తాడు,
సుత్తితో నునుపు చేసేవాడు,
“అది బాగుంది” అని అతుకు గురించి చెప్తూ
దాగిలి మీద కొట్టే వానిని ప్రోత్సహిస్తాడు.
ఇంకొకడు విగ్రహం కదలకుండా మేకులతో దానిని బిగిస్తాడు.
8“అయితే, నా సేవకుడవైన ఇశ్రాయేలూ,
నేను ఏర్పరచుకున్న యాకోబూ,
నా స్నేహితుడైన అబ్రాహాము వారసులారా,
9భూమి అంచుల నుండి నేను మిమ్మల్ని తీసుకువచ్చాను,
మారుమూల ప్రాంతాల నుండి పిలుచుకున్నాను.
నేను అన్నాను, ‘నీవు నా సేవకుడవు’;
నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను త్రోసివేయలేదు.
10కాబట్టి భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను;
దిగులుపడకు, నేను నీ దేవుడను.
నేను నిన్ను బలపరచి నీకు సహాయం చేస్తాను;
నీతిగల నా కుడిచేతితో నిన్ను ఆదరిస్తాను.
11“నీ మీద కోప్పడిన వారందరు
ఖచ్చితంగా సిగ్గుపడి అవమానం పొందుతారు;
నిన్ను వ్యతిరేకించేవారు
కనబడకుండా నశించిపోతారు.
12నీ శత్రువుల కోసం నీవు వెదకినా,
వారు నీకు కనపడరు.
నీతో యుద్ధం చేసేవారు
ఏమి లేనివారిగా అవుతారు.
13నీ దేవుడనైన యెహోవాను,
నేను నీ కుడిచేతిని పట్టుకుని,
భయపడకు అని
నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాను.
14భయపడకు, పురుగులాంటి యాకోబూ!
కొద్ది మందిగా ఉన్న ఇశ్రాయేలూ, భయపడకు.
నేను నీకు సహాయం చేస్తాను” అని నీ విమోచకుడు
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా చెప్తున్నారు.
15“చూడు, నేను నిన్ను పదునుగా ఉండి, అనేకమైన పళ్ళు కలిగిన
క్రొత్త నూర్చే పలకగా చేస్తాను.
నీవు పర్వతాలను నూర్చి నలగ్గొడతావు,
కొండలను పొట్టులా చేస్తావు.
16నీవు వాటిని చెరగగా, గాలికి కొట్టుకుపోతాయి,
సుడిగాలి వాటిని చెదరగొడుతుంది.
అయితే నీవు యెహోవాలో సంతోషిస్తావు,
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడతావు.
17“పేదవారు, దరిద్రులు నీళ్లు వెదకుతారు
కాని వారికి నీరు దొరకక
వారి నాలుకలు దాహంతో ఎండిపోతాయి.
అయితే, యెహోవానైన నేను వారికి జవాబిస్తాను;
ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడిచిపెట్టను.
18నేను చెట్లులేని ఎత్తు స్థలాల మీద నదులను ప్రవహింపచేస్తాను,
లోయల మధ్యలో ఊటలు ఉబికేలా చేస్తాను.
ఎడారిని నీటి మడుగుగా,
ఎండిపోయిన నేలను ఊటలుగా చేస్తాను.
19నేను ఎడారిలో దేవదారు వృక్షాలు,
తుమ్మచెట్లు, గొంజిచెట్లు, ఓలీవ చెట్లు నాటుతాను.
అరణ్యంలో సరళ వృక్షాలను, ఈత చెట్లను,
నేరేడు చెట్లను కలిపి నాటుతాను.
20అప్పుడు ప్రజలు అది చూసి
యెహోవా చేయి దీనిని చేసిందని,
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే దీనిని కలుగజేశారని
తెలుసుకుని స్పష్టంగా గ్రహిస్తారు.
21“మీ వాదన చెప్పండి”
అని యెహోవా అంటున్నారు.
“మీ రుజువులు చూపించండి”
అని యాకోబు రాజు అంటున్నారు.
22“విగ్రహాల్లారా, ఏమి జరుగబోతుందో
మాకు చెప్పండి.
గతంలో జరిగిన వాటి గురించి చెప్పండి,
తద్వారా మేము వాటిని పరిశీలించి
అవి ఎలా నెరవేరాయో తెలుసుకుంటాము.
జరుగబోయే సంగతులను మాకు తెలియజేయండి,
23భవిష్యత్తులో ఏమి జరుగబోతుందో చెప్పండి,
అప్పుడు మీరు దేవుళ్ళని మేము గ్రహిస్తాము.
మేము దిగులుపడి భయపడేలా
మేలైనా కీడైనా, ఏదో ఒకటి చేయండి.
24కాని మీరు వట్టివారి కంటే తక్కువవారు
మీ పనులు ఏమాత్రం విలువలేనివి;
మిమ్మల్ని కోరుకునేవారు అసహ్యులు.
25“ఉత్తరం వైపు నుండి నేను ఒకడిని రేపుతున్నాను.
నా పేరిట ప్రార్థించే వాడొకడు సూర్యోదయ దిక్కునుండి వస్తున్నాడు.
కుమ్మరి మట్టిని త్రొక్కినట్లు
ఒకడు బురదను త్రొక్కినట్లు అతడు పాలకులను త్రొక్కుతాడు.
26మేము అంగీకరించేలా మొదటి నుండి జరిగిన వాటిని మాకు ఎవరు చెప్పారు?
‘అతడు చేసింది న్యాయమే’ అని మేము చెప్పేలా గతాన్ని ఎవరు చెప్పారు?
దాని గురించి చెప్పిన వారెవరూ లేరు,
దాని గురించి ముందే ఎవరు చెప్పలేదు.
మీ మాటలు విన్న వారెవరూ లేరు.
27‘చూడండి, వారిక్కడ ఉన్నారు!’
అని మొదట సీయోనుతో చెప్పింది నేనే.
యెరూషలేముకు శుభవార్త చెప్పడానికి నేను ఒక దూతను పంపాను.
28నేను చూడగా అక్కడ ఎవరూ లేరు,
దేవుళ్ళలో సలహా చెప్పడానికి ఎవరూ లేరు,
నేను వారిని ప్రశ్నిస్తే జవాబు ఇవ్వడానికి ఎవరూ లేరు.
29చూడండి, వారందరు మాయాస్వరూపులే
వారి క్రియలు మోసమే;
వారి పోత విగ్రహాలు వట్టి గాలి అవి శూన్యములే.
Currently Selected:
యెషయా 41: OTSA
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.