రోమా 12
12
సజీవ యాగం
1కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకొంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన. 2ఈ లోకపు తీరును అనుసరించవద్దు కాని మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు.
క్రీస్తు శరీరంలో వినయంతో పరిచర్య
3నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మీరు ఉండవలసిన దానికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా భావించవద్దు కాని, దేవుడు మీలో ప్రతి ఒక్కరికి పంచియిచ్చిన విశ్వాసం ప్రకారం మీ గురించి మీరు వివేకం కలిగి అంచనా వేసుకోండి. 4ఎలాగైతే మనలో ప్రతి ఒకరు వేరు వేరు పనులు చేసే అనేక అవయవాలతో ఒకే శరీరం కలిగి ఉన్నామో, 5అలాగే మనం అనేకులమైనప్పటికీ క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నాము, ప్రతి ఒక్కరు మిగిలిన వారందరికి సంబంధించినవారే. 6మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడిన కృపను బట్టి మనం వేరు వేరు కృపావరాలు కలిగివున్నాము. నీ కృపావరం ప్రవచనా వరమైతే నీ విశ్వాసానికి అనుగుణంగా ప్రవచించు. 7ఆ కృపావరం సేవచేయడమైతే సేవ చేయి. ఆ కృపావరం బోధించడమైతే బోధించు. 8ఆ కృపావరం ధైర్యపరచడమైతే ధైర్యపరచు. ఆ కృపావరం దానం చేయడమైతే ధారళంగా దానం చేయి, ఆ కృపావరం ఇతరులను నడిపించడమైతే జాగ్రత్తగా నడిపించు, ఆ కృపావరం కనికరం చూపించడమైతే, దాన్ని సంతోషంగా చేయి.
క్రియల్లో ప్రేమ
9ప్రేమ నిష్కళంకంగా ఉండాలి. దుష్టమైన దానిని ద్వేషించి మంచిదైన దానిని పట్టుకోవాలి. 10ప్రేమలో ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండండి. మీకన్న ఎక్కువగా ఒకరిని ఒకరు గౌరవించండి. 11అత్యాసక్తి చూపడంలో ఎన్నడూ వెనుకబడవద్దు కాని మీరు ఆత్మీయ ఉత్సాహం కలిగి దేవుని సేవించండి. 12నిరీక్షణలో సంతోషించండి, కష్టాల్లో సహనం కలిగి ఉండండి, ప్రార్థన చేసేప్పుడు విశ్వాసంతో ఉండండి. 13అవసరంలో ఉన్న ప్రభువు ప్రజలకు సహాయం చేయండి. ఆతిథ్యం ఇవ్వండి.
14మిమ్మల్ని హింసించినవారిని దీవించండి; వారిని దీవించండి కాని శపించవద్దు. 15ఆనందించేవారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి. 16ఒకరితో ఒకరు ఐక్యమత్యం కలిగి జీవించండి. గర్వం కలిగి ఉండవద్దు కాని మీకన్న తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలతో కూడా సహవాసం చేయండి. అహంకారం కలిగి ఉండవద్దు.
17చెడుకు ప్రతిగా ఎవరికి చెడు చేయకండి. ప్రతి ఒక్కరి దృష్టికి సరియైనవిగా ఉన్నవాటిని చేసేలా జాగ్రత్తపడండి. 18మీకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించండి. 19నా ప్రియ స్నేహితులారా, పగ తీర్చుకోకండి కాని, “పగ తీర్చుకోవడం నా పని, వారికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాను#12:19 ద్వితీ 32:35 అని ప్రభువు చెప్పారు” అని వ్రాయబడిన ప్రకారం దేవుని ఉగ్రతకు విడిచిపెట్టండి. 20అయితే,
“మీ శత్రువు ఆకలితో ఉంటే వానికి ఆహారం పెట్టండి;
అతడు దాహంతో ఉంటే వానికి త్రాగడానికి ఇవ్వండి.
మీరు ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులను కుప్పగా పోస్తారు.”#12:20 సామె 25:21,22
21చెడు చేత అధిగమించబడకండి, కాని మంచితో చెడును అధిగమించండి.
Currently Selected:
రోమా 12: TCV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.