YouVersion Logo
Search Icon

రోమా 11

11
ఇశ్రాయేలు ప్రజలలో మిగిలిన వారు
1అందుకు నా ప్రశ్న ఏంటంటే: దేవుడు తన ప్రజలను తిరస్కరిస్తారా? ఎన్నటికీ కాదు! నేను కూడా ఇశ్రాయేలుకు చెందినవాన్నే, అబ్రాహాము సంతానాన్నే, బెన్యామీను గోత్రానికి చెందినవాన్నే. 2తన ప్రజలను అనగా తాను ముందుగానే ఎరిగివున్నవారిని దేవుడు తిరస్కరించడు, ఏలీయా గురించిన భాగంలో లేఖనం ఏమి చెప్తుందో మీకు తెలియదా? ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా అతడు దేవునికి ప్రార్థన చేస్తూ, 3“ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలను త్రోసివేశారు, నేను ఒక్కడినే మిగిలాను, నన్ను చంపడానికి వారు ప్రయత్నిస్తున్నారు” అని ఎంతగానో మొర పెట్టుకున్నాడు.#11:3 1 రాజులు 19:10,14 4అయితే దేవుడు అతనికిచ్చిన సమాధానం ఏంటి? “బయలుకు మోకరించని ఏడు వేల మందిని నా కొరకు ప్రత్యేకంగా ఉంచాను.”#11:4 1 రాజులు 19:18 5అదే విధంగా ప్రస్తుత సమయంలో కూడా కృప ద్వారా ఏర్పాటు చేయబడినవారు మిగిలేవున్నారు. 6అది కృప వల్ల అయితే అది క్రియలమూలంగా కలిగింది కాదు, ఒకవేళ అలా కాకపోతే, కృప ఇక కృప కాదు.
7అప్పుడు ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు అత్యంత ఆతురతతో వెదకిన దానిని వారు సంపాదించుకోలేదు. వారిలో ఏర్పరచబడినవారే సంపాదించుకోగలిగారు కాని మిగిలిన వారు కఠినపరచబడ్డారు. 8దాని గురించి ఇలా వ్రాయబడింది:
“నేటి వరకు
దేవుడు వారికి మైకంగల ఆత్మను,
చూడలేని కళ్ళను
వినలేని చెవులను ఇచ్చారు.”#11:8 ద్వితీ 29:4; యెషయా 29:10
9మరియు దావీదు,
“వారి భోజనపు బల్ల వారికి ఉచ్చుగా బోనుగా మారి
వారికి అడ్డుబండగా మరియు తగిన శాస్తిగా ఉండును గాక.
10వారు చూడకుండా వారి కన్నులకు అంధకారం కలుగును గాక
వారి వీపులు ఎల్లప్పుడు వంగివుండును గాక,”#11:10 కీర్తన 69:22,23
అని చెప్తున్నాడు.
అంటుకట్టబడిన కొమ్మలు
11మరలా నేను: వారు తిరిగి తేరుకోలేనంతగా తొట్రిల్లి పడిపోతారా? అని అడుగుతున్నా, అలా ఎన్నటికి కాదు, వారు చేసిన ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు అసూయపడేలా చేయడానికి యూదేతరులకు రక్షణ లభించింది. 12అయితే వారి ఆజ్ఞాతిక్రమం లోకానికి ఐశ్వర్యంగా, వారి నష్టం యూదేతరులకు ఐశ్వర్యంగా ఉన్నట్లయితే వారి సంపూర్ణ చేరిక మరి ఎంత ఎక్కువ ఐశ్వర్యాన్ని తెస్తుంది కదా!
13యూదేతరులైన మీతో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే యూదేతరులకు అపొస్తలునిగా నేను ఉన్నాను కనుక నా పరచర్యలో నేను గర్వపడుతూ, 14ఏదో ఒక విధంగా నా సొంత ప్రజలకు అసూయను కలిగించి వారిలో కొందరినైనా రక్షించాలనే నిరీక్షణను కలిగివున్నాను. 15తిరస్కారం లోకానికి సమాధానం తెస్తే, వారి అంగీకారం వల్ల ఏం జరుగుతుంది మరణం నుండి జీవం వస్తుందా? 16పిండిముద్దలో మొదటి ఫలంగా అర్పించింది పరిశుద్ధమైనదైతే ఆ పిండి ముద్ద అంతా పరిశుద్ధమే అవుతుంది. అలాగే చెట్టు వేరు పరిశుద్ధమైనదైతే ఆ చెట్టు కొమ్మలు కూడా పరిశుద్ధమైనవే అవుతాయి.
17అయితే ఒలీవ చెట్టు కొమ్మలు కొన్ని విరిచివేయబడినప్పుడు, నీవు అడవి ఒలీవ చెట్టు కొమ్మవైనప్పటికిని, నీవు మిగిలిన కొమ్మల మధ్యలో అంటుకట్టబడి, ఆ ఒలీవ చెట్టు వేరు నుండి వచ్చే సారంలో పాలుపొందినప్పుడు 18మిగిలిన కొమ్మల కన్నా నీవు గొప్పవానిగా భావించవద్దు. నీవు అలా భావిస్తే, నీవు వేరుకు ఆధారం కాదు, వేరే నీకు ఆధారంగా ఉందని తెలుసుకో. 19“కొమ్మలు విరిచివేయబడ్డాయి కనుక నేను అంటుకట్టబడ్డాను” అని నీవు చెప్పవచ్చు. 20నిజమే. వారు అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయబడ్డారు, విశ్వాసం వల్ల నీవు నిలిచి వున్నావు. కనుక అహంకారంగా ఉండక భయంతో ఉండు. 21దేవుడు సహజమైన కొమ్మలనే విడిచిపెట్టనప్పుడు, ఆయన నిన్ను కూడా విడిచి పెట్టడు.
22దేవుడు చూపించే దయను కఠినత్వాన్ని తెలుసుకోండి: విరిచి పడవేయబడిన వారి పట్ల ఆయన కఠినంగా ఉన్నాడు కాని, నీ పట్ల దయ చూపించి నీవు ఆయన దయలో కొనసాగేలా చేశాడు. లేకపోతే నీవు కూడా నరికివేయబడతావు. 23వారు అవిశ్వాసంలో కొనసాగకపోతే దేవుడు వారిని తిరిగి అంటుకట్టగల సమర్ధుడు కనుక వారు అంటుకట్టబడతారు. 24సహజంగా అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడిన కొమ్మవైన నీవే స్వభావానికి విరుద్ధంగా సాగుచేస్తున్న ఒలీవచెట్టుకు అంటుకట్టబడితే, సహజమైన కొమ్మలు మరింత సులభంగా వాటి సొంత ఒలీవచెట్టుకు అంటుకట్టబడతాయి గదా!
ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షించబడతారు
25సహోదరీ సహోదరులారా, మీరు అహంకారులుగా ఉండకూడదని మీకు ఈ మర్మాన్ని తెలియకుండా ఉండాలని నేను కోరుకోవడం లేదు. అది ఏంటంటే యూదేతరులంతా లోపలికి ప్రవేశించే వరకు ఇశ్రాయేలు ప్రజలు కొంతవరకు కఠినం చేయబడ్డారు. 26అదేరీతిగా ఇశ్రాయేలు ప్రజలందరు రక్షించబడతారు. దీనిని గురించి ఈ విధంగా వ్రాయబడివున్నది,
“సీయోనులో నుండి విమోచకుడు వస్తాడు,
యాకోబులో నుండి భక్తిహీనతను అతడు తీసివేస్తాడు.
27నేను వారి పాపాలను వారి నుండి తీసివేసినప్పుడు
వారితో నేను చేసిన నిబంధన ఇదే.”#11:27 యెషయా 59:20,21; 27:9; యిర్మీయా 31:33,34
28సువార్తకు సంబంధించినంత వరకు మిమ్మల్ని బట్టి వారు శత్రువులుగా వున్నారు, కాని ఎన్నికకు సంబంధించినంత వరకు వారు పితరులను బట్టి ప్రేమించబడినవారు. 29అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి. 30గతంలో దేవునికి అవిధేయులుగా ఉండి, వారి అవిధేయత ఫలితంగా దేవుని కృపను పొందారు. 31అదే విధంగా మీకు చూపబడిన దేవుని కృపను బట్టి వారు కృపను పొందుకొనే క్రమంలో వారు నేడు అవిధేయులుగా ఉన్నారు. 32దేవుడు ప్రతి ఒక్కరిపై కృప చూపించడానికి ఆయన అందరిని అవిధేయతకు అప్పగించాడు.
దేవుని కీర్తించుట
33ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల సమృద్ధి యెంతో లోతైనది!
ఆయన తీర్పులు యెంతో నిగూఢమైనవి,
ఆయన మార్గాలు కనుగొనలేనంతవి!
34“ప్రభువు మనస్సును ఎరిగినవారు ఎవరు?
ఆయనకు ఆలోచన చెప్పగలవారు ఎవరు?”#11:34 యెషయా 40:13
35“ముందుగానే దేవునికి ఇచ్చి
ఆయన నుండి తిరిగి పొందగలవారు ఎవరు?”#11:35 యోబు 41:11
36ఆయన నుండి ఆయన ద్వారా ఆయన కొరకు సమస్తం ఉన్నవి
కనుక ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక! ఆమేన్.

Currently Selected:

రోమా 11: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in