YouVersion Logo
Search Icon

న్యాయాధిపతులు 3

3
1-2ఇతర రాజ్యాల ప్రజలంతా ఇశ్రాయేలీయుల దేశం విడిచిపెట్టేటట్టు యెహోవా బలవంతం చేయలేదు. ఇశ్రాయేలీయులను యెహోవా పరీక్షించాలనుకున్నాడు. ఈ సమయంలో జీవిస్తూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరు కూడ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన యుద్ధాల్లో పాల్గొనలేదు. అందుచేత ఆ ఇతర రాజ్యాలను యెహోవా వారి దేశంలో ఉండనిచ్చాడు. (ఆ యుద్ధాలలో పాల్గొనని ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాలని యెహోవా ఇలా చేసాడు). ఆ దేశంలో యెహోవా ఉండనిచ్చిన రాజ్యాల పేర్లు ఇవి: 3ఫిలిష్తీయుల అయిదుగురు పరిపాలకులు, కనానీయులు అందరూను, సీదోను ప్రజలు, గయెలు హెర్మోను నుండి లెబోహమాతు వరకు గల లెబానోను కొండల్లో జీవించిన హివ్వీ ప్రజలు. 4ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించటానికి యెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. వారి పూర్వీకులకు మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆదేశాలకు ఇశ్రాయేలు ప్రజలు విధేయులవుతారేమోనని ఆయన చూడాలనుకున్నాడు.
5కనానీయులతో, హిత్తీ ప్రజలతో, అమోరీ ప్రజలతో, పెరిజ్జీ ప్రజలతో, హివ్వీ ప్రజలతో, యెబూసీ ప్రజలతో కలిసి ఇశ్రాయేలు ప్రజలు జీవించారు. 6ఇశ్రాయేలు ప్రజలు, ఆ ప్రజల కుమార్తెలను వివాహము చేసుకోవటం మొదలు పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు తమ కుమార్తెలను ఆ మనుష్యుల కుమారులు వివాహము చేసుకోనిచ్చారు. మరియు ఇశ్రాయేలు ప్రజలు ఆ మనుష్యుల దేవుళ్లను పూజించటం మొదలు పెట్టారు.
మొదటి న్యాయమూర్తి, ఒత్నీయేలు
7ఇశ్రాయేలు ప్రజలు చెడు పనులు చేసినట్టు యెహోవా చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుడు యెహోవాను మరచిపోయి, బయలు మరియు అషేరా#3:7 అషేరా ఒక ముఖ్యమైన కనానీ దేవత. ఈమె “ఏల్” యొక్క భార్య లేక “బయలు” యొక్క ప్రియురాలు అని వారనుకొన్నారు. అను బూటకపు దేవుళ్లను సేవించారు. 8ఇశ్రాయేలీయుల మీద యెహోవాకు కోపం వచ్చింది. యెహోవా అరామునహరాయిము#3:8 అరామునహరాయిము ఉత్తర సిరియాలోని ఒక స్థలం, యూఫ్రటీసు మరియు టైగ్రీస్ నదుల నడుమ వున్నది. రాజు కూషన్రిషాతాయిము ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, వారిని పాలించనిచ్చాడు. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరాల పాటు ఆ రాజు పాలనలో ఉన్నారు. 9కానీ ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. వారిని రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఒత్నీయేలు. అతడు కనజు అనే వ్యక్తి కుమారుడు. కనజు కాలేబుకు చిన్న తమ్ముడు. ఒత్నీయేలు ఇశ్రాయేలీయులను రక్షించాడు. 10యెహోవా ఆత్మ ఒత్నీయేలు మీదికి వచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి అయ్యాడు. ఇశ్రాయేలీయులను ఒత్నీయేలు యుద్ధానికి నడిపించాడు. అరాము రాజు కూషన్రిషాతాయిమును ఓడించేందుకు యెహోవా ఒత్నీయేలుకు సహాయం చేసాడు. 11అందుచేత కనజు కుమారుడు ఒత్నీయేలు చనిపోయేంతవరకు నలభై సంవత్సరాలు దేశం శాంతితో ఉండెను.
న్యాయమూర్తి ఏహూదు
12ఇశ్రాయేలు ప్రజలు మరల చెడుకార్యాలు చేయటం యెహోవా చూశాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలను ఓడించేందుకు మోయాబు రాజు ఎగ్లోనుకు యెహోవా శక్తి ఇచ్చాడు. 13అమ్మోనీ ప్రజలు, అమాలేకు ప్రజల దగ్గర నుండి ఎగ్లోను సహాయం పొందాడు. వారు అతనితో కలిసి, ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేశారు. ఎగ్లోను, అతని సైన్యం ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, ఖర్జూరపు చెట్ల పట్టణం నుండి (యెరికో) వారిని బలవంతంగా వెళ్లగొట్టారు. 14ఎగ్లోను ఇశ్రాయేలు ప్రజలను పద్దెనిమిది సంవత్సరాలు పాలించాడు.
15ప్రజలు యెహోవాకు మొరపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఏహూదు. ఏహూదు ఎడమచేతి వాటంగలవాడు. ఏహూదు బెన్యామీను వంశానికి చెందిన గెరా అనే పేరుగల వాని కుమారుడు. మోయాబు రాజు ఎగ్లోనుకు కొంత పన్ను డబ్బు చెల్లించేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును పంపించారు. 16ఏహూదు అతనికోసం ఒక ఖడ్గం చేసుకున్నాడు. ఆ ఖడ్గానికి రెండంచులున్నాయి, దాని పొడవు పద్ధెనిమిది అంగుళాలు. ఏహూదు ఆ ఖడ్గాన్ని తన కుడి తొడకు కట్టుకొని తన బట్టల క్రింద దానిని కప్పిపెట్టాడు.
17ఏహూదు మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరకు వచ్చి పన్ను డబ్బు చెల్లించాడు. (ఎగ్లోను చాలా లావు పాటి మనిషి) 18ఏహూదు ఆ డబ్బును ఎగ్లోనుకు చెల్లించిన తర్వాత, ఆ డబ్బును మోసుకుని వచ్చిన ఆ మనుష్యులను తిరిగి ఇంటికి పంపించివేసాడు. 19ఏహూదు వెళ్లేందుకు బయలుదేరాడు. గిల్గాలు పట్టణంలో విగ్రహాలను అతడు సమీపించినప్పుడు అతడు వెనుకకు తిరిగాడు. అప్పుడు ఏహూదు, “ఓ రాజా, నీకు చెప్పాల్సిన ఒక రహస్య సందేశం నా దగ్గర ఉంది” అని ఎగ్లోనుతో చెప్పాడు.
ఊరకవుండు అన్నాడు రాజు. తర్వాత అతడు సేవకులందరినీ ఆ గదిలోనుండి బయటకు పంపివేసాడు. 20ఏహూదు ఎగ్లోను రాజు దగ్గరకు వెళ్లాడు. ఎగ్లోను తన వేసవి కాలపు రాజ భవనంలో ఒంటరిగా కూర్చునియున్నాడు.
అప్పుడు ఏహూదు, “దేవుని దగ్గరనుండి నీ కోసము ఒక సందేశం నా వద్ద వుంది” అని చెప్పాడు. రాజు తన సింహాసనం నుండి లేచి ఏహూదుకు చాలా దగ్గరగా వచ్చాడు. 21రాజు తన సింహాసనం నుండి లేచి నిలబడగా, ఏహూదు తన కుడి తొడకు కట్టబడిన ఖడ్గాన్ని తన ఎడమ చేతితో అందుకొని బయటకు తీసాడు. అప్పుడు ఏహూదు ఆ ఖడ్గాన్ని రాజు పొట్టలో పొడిచి వేసాడు. 22ఆ ఖడ్గం పిడికూడ లోపలకు దిగిపోవునంతగా రాజు కడుపులోనికి దిగిపోయింది. రాజు కొవ్వు ఖడ్గము నిండా అతుక్కుపోయింది. కనుక ఏహూదు ఆ ఖడ్గాన్ని ఎగ్లోను పొట్టలోనే విడిచిపెట్టేసాడు.
23ఏహూదు గదిలో నుండి బయటకు వెళ్లి దాని తలుపులు మూసి తాళం వేసాడు. 24ఏహూదు వెళ్లిపోగానే సేవకులు తిరిగి వచ్చారు. ఆ గది తలుపులు తాళము వేసి ఉండటం ఆ సేవకులు చూశారు. కనుక ఆ సేవకులు, “రాజు తన విశ్రాంతి గదిలో మూత్ర విసర్జనకు వెళ్లి ఉంటాడు” అని చెప్పుకున్నారు. 25అందుచేత ఆ సేవకులు చాలా సేపు వేచి ఉన్నారు. చివరికి వారు దిగులు చెందారు. వారు తాళం చెవి తెచ్చి తలుపులు తెరిచారు. ఆ సేవకులు ప్రవేశించినప్పుడు, వారి రాజు నేల మీద చచ్చిపడి ఉండటం చూశారు.
26ఆ సేవకులు రాజు కొరకు వేచి ఉండగా, ఏహూదు పారిపోయేందుకు సమయం దొరికింది. ఏహూదు విగ్రహాలను దాటి శెయీరా అను స్థలంవైపు వెళ్లాడు. 27ఏహూదు శెయీరా అను స్థలం చేరాడు. అప్పుడు అతడు అక్కడ ఎఫ్రాయిమీయుల కొండ దేశంలో బూర ఊదాడు. ఇశ్రాయేలు ప్రజలు బూర శబ్దం విని, ఏహూదు వారిని నడిపిస్తుండగా వారు కొండలు దిగివెళ్లారు. 28ఏహూదు, “నన్ను వెంబడించండి! మన శత్రువులైన మోయాబు ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు.
కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును వెంబడించారు. ఎక్కడైతే యోర్దాను నదిని తేలికగా దాటి, మోయాబు దేశంలోనికి వెళ్లవచ్చునో ఆ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు వారు ఏహూదు వెంట వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలు ఏ ఒక్కరినీ కూడా యోర్దాను నదిని దాటనివ్వలేదు. 29మోయాబు ప్రజలలో ధైర్యం, బలంగల పదివేల మందిని ఇశ్రాయేలు ప్రజలు చంపివేసారు. మోయాబు వాడు ఒక్కడు కూడా తప్పించుకోలేదు. 30కనుక ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలు మోయాబు ప్రజలను పాలించటం మొదలు పెట్టారు. మరియు ఆ దేశంలో ఎనభై సంవత్సరాల వరకు శాంతి ప్రబలింది.
న్యాయమూర్తి షమ్గరు
31ఏహూదు ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన తర్వాత మరో మనిషి ఇశ్రాయేలీయులను రక్షించాడు. ఆ మనిషి పేరు షమ్గరు. అతడు అనాతు కుమారుడు. ఫిలిష్తీ మనుష్యులు ఆరువందల మందిని చంపేందుకు షమ్గరు ఒక ములుకోల (ఎద్దులను తోలే ముల్లుగల కర్ర)ను ప్రయోగించాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for న్యాయాధిపతులు 3