న్యాయాధిపతులు 2
2
బోకీము దగ్గర యెహోవాదూత
1యెహోవాదూత గిల్గాలు పట్టణం నుండి బోకీము పట్టణానికి వెళ్లాడు. యెహోవా నుండి వచ్చిన ఒక సందేశాన్ని ఆ దూత ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు. ఇదే ఆ సందేశం: “నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చాను. నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి నేను మిమ్మల్ని నడిపించాను. మీతో నేను చేసిన నా ఒడంబడికను నేను ఎన్నడూ ఉల్లంఘించను. 2ఈ దేశంలో నివసించే వారితో మీరు ఏ ఒడంబడిక చేసుకోకూడదు. వారి బలిపీఠాలను మీరు నాశనం చేయాలి అని నేను చెప్పాను. కాని మీరు నాకు విధేయులు కాలేదు.
3“నేను మీకు చెబుతాను: ‘ఇతరులను ఇక మీదట ఈ దేశం నుండి బలవంతంగా నేను వెళ్లగొట్టను. ఈ ప్రజలు మీకు ఒక సమస్య అవుతారు. వారు మీకు ఉరిగా ఉంటారు. వారి దేవతలు మీకు ఉరిలాగా ఉంటారు.’”
4యెహోవా నుండి వచ్చిన ఈ సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవదూత చెప్పగానే ప్రజలు గట్టిగా ఏడ్చారు. 5కనుక ఇశ్రాయేలీయులు ఏడ్చిన ఆ స్థలానికి బోకీము#2:5 బోకీము అనగా “ప్రజల ఏడ్పు” అని అర్థం. అని పేరు పెట్టారు. బోకీములో ఇశ్రాయేలీయులు యెహోవాకు బలులు అర్పించారు.
అవిధేయతవలన అపజయం
6అప్పుడు యెహోషువ ప్రజలను ఇంటికి పొమ్మని చెప్పాడు. అందుచేత ప్రతి వంశంవారు నివసించుటకు వారికి యివ్వబడిన భూమిని తీసుకొనుటకు వెళ్లారు. 7యెహోషువ బ్రతికి ఉన్నంతవరకు ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించారు. యెహోవాషువ మరణించిన తరువాత జీవించిన నాయకుల (పెద్దలు) జీవిత కాలంలో వారు యెహోవాను సేవించారు. ఇశ్రాయేలు ప్రజలకోసం యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ ఈ వృద్ధులు చూశారు. 8నూను కుమారుడు, యెహోవా సేవకుడునగు యెహోవాషువ 110 సంవత్సరాల వయస్సులో మరణించాడు. 9ఇశ్రాయేలు ప్రజలు, యెహోవాషువకు ఇవ్వబడిన స్థలంలో వారు అతనిని సమాధి చేసారు. అది ఎఫ్రాయిము కొండ దేశంలో గాయషు పర్వతానికి ఉత్తరాన తిమ్నాతుహెరెసు దగ్గర ఉంది.
10ఆ తరం వారంతా చనిపోయాక తరువాత తరం పెరిగింది. యెహోవాను గూర్చిగాని, ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన వాటిని గూర్చిగాని ఈ కొత్త తరం వారికి తెలియదు. 11అందుచేత ఇశ్రాయేలు ప్రజలు కీడు చేస్తూ తప్పుడు దేవత బయలును సేవించారు. ప్రజలు ఈ కీడు చేయటం యెహోవా చూశాడు. 12ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి యెహోవా బయటకు తీసుకుని వచ్చాడు. ఈ ప్రజల పూర్వీకులు యెహోవాను ఆరాధించారు. కాని ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను అనుసరించటం మానుకొన్నారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసించిన ప్రజలయొక్క తప్పుడు దేవుళ్లను#2:12 తప్పుడు దేవత వర్షాన్ని, గాలుల్ని ఈ బూటకపు దేవత తెస్తుందని కనానీయులు నమ్మారు. భూమి మంచి పంటలు ఇచ్చేందుకు కూడా ఇది సహాయ పడుతుందని వారు నమ్మారు. పూజించటం మొదలు పెట్టారు. అది యెహోవాకు కోపం కలిగించింది. 13ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించటం మానివేసి బయలు, అష్తారోతులను పూజించటం మొదలు పెట్టారు.
14ఇశ్రాయేలు ప్రజలమీద యెహోవాకు కోపం వచ్చింది. కనుక శత్రువులు ఇశ్రాయేలీయుల మీద దాడిచేసి వారి ఆస్తులను తీసుకునేట్టుగా యెహోవా చేశాడు. యెహోవా వారి చుట్టూరా ఉన్న వారి శత్రువుల ద్వారా వారు ఓడిపోయేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువులనుండి వారిని వారు కాపాడుకోలేక పోయారు. 15ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి బయటకు వెళ్లినప్పుడల్లా ఓడిపోయారు. యెహోవా వారి పక్షంగా లేని కారణంచేత వారు ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసిస్తున్న ప్రజల దేవతలను సేవిస్తే, వారు ఓడిపోతారని యెహోవా ముందుగానే వారిని హెచ్చరించాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలా శ్రమ అనుభవించారు.
16అప్పుడు యెహోవా న్యాయాధిపతులు అనే నాయకులను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల ఆస్తులను తీసుకున్న శత్రువులనుండి వారిని ఈ నాయకులు రక్షించారు. 17కాని ఇశ్రాయేలు ప్రజలు వారి న్యాయాధిపతుల మాట వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండక ఇతర దేవుళ్లను అనుసరించారు.#2:17 ఇశ్రాయేలు … అనుసరించారు ఇతర దేవతలకు వ్యభిచారిణిలా వ్యవహరించారు అని వాస్తవంగా వ్రాయబడి ఉంది. పూర్వం ఇశ్రాయేలీయుల పూర్వీకులు యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యారు. కానీ ఇశ్రాయేలీయులు ఇప్పుడు మారిపోయి, యెహోవాకు విధేయులు కావటం లేదు.
18ఇశ్రాయేలీయుల శత్రువులు ఇశ్రాయేలు ప్రజలకు అనేకసార్లు చెడు సంగతులు జరిగించారు. అందుచేత ఇశ్రాయేలీయులు సహాయం కోసం ఏడ్చేవారు. ప్రతీసారీ, ప్రజల విషయమై యెహోవా సంతాప పడ్డాడు. ప్రతీసారీ ప్రజలను వారి శత్రువుల నుండి రక్షించేందుకు ఆయన ఒక న్యాయమూర్తిని పంపించాడు. యెహోవా ఎల్లప్పుడూ ఆ న్యాయమూర్తులతో ఉండేవాడు. కనుక ప్రతిసారీ ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువుల నుండి రక్షించబడ్డారు. 19అయితే ప్రతీ న్యాయమూర్తి చనిపోయినప్పుడూ, ఇశ్రాయేలీయులు మరల పాపం చేసి, బూటకపు దేవుళ్లను పూజించటం మొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులు చాలా మొండి వాళ్లు వారు తమ చెడు మార్గాలు విడిచి పెట్టేందుకు నిరాకరించారు.
20అందుచేత ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపగించి, ఆయన చెప్పాడు: “ఈ ప్రజలు నేను వారి పూర్వీకులతో చేసిన ఒడంబడికనే ఉల్లంఘించారు. వారు నా మాట వినలేదు. 21కనుక నేను ఇంకెంత మాత్రం ఇతర రాజ్యాలను జయించి, ఇశ్రాయేలీయుల కోసం దారి సులభం చేయను. యెహోషువ చనిపోయినప్పుడు ఆ రాజ్యాలు ఇంకా ఈ దేశంలోనే ఉన్నాయి. మరియు ఆ రాజ్యాలను నేను ఈ దేశంలోనే ఉండనిస్తాను. 22ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించేందుకు నేను ఆ రాజ్యాలను ప్రయోగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు, వారి పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించినట్టుగా, పాటించగలరేమో నేను చూస్తాను.” 23యెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. ఆ రాజ్యాలు వెంటనే దేశం విడిచిపోయేట్టు యెహోవా బలవంతం చేయలేదు. వారిని ఓడించేందుకు ఆయన యెహోషువ సైన్యానికి సహాయం చేయలేదు.
Currently Selected:
న్యాయాధిపతులు 2: TERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International