YouVersion Logo
Search Icon

న్యాయాధిపతులు 4

4
స్త్రీ న్యాయమూర్తి దెబోరా
1చెడ్డవి అని యెహోవా చెప్పిన వాటినే ప్రజలు ఏహూదు చనిపోయిన తర్వాత మరల చేశారు. 2కనుక కనాను రాజు యాబీను ఇశ్రాయేలీయులను ఓడించేలాగ యెహోవా చేశాడు. యాబీను హాసోరు పట్టణంలో పరిపాలించాడు. సీసెరా అను పేరుగలవాడు యాబీను రాజు సైన్యానికి సేనాధిపతి. హరోషెతు హాగ్గోయిం అనే పట్టణంలో సీసెరా నివసించాడు. 3సీసెరాకు తొమ్మిదివందల ఇనుప రథాలున్నాయి. అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల ఎడల చాలా క్రూరంగా ఉన్నాడు. కనుక సహాయం కోసం వారు యెహోవాకు మొరపెట్టారు.
4దెబోరా అనే పేరుగల ఒక ప్రవక్తి ఉంది. ఆమె లప్పీదోతు అను పేరుగల వాని భార్య. ఆ కాలంలో ఆమె ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి. 5ఒక రోజు దెబోరా ఖర్జూర చెట్టు క్రింద కూర్చుని ఉంది. సీసెరా విషయం ఏమి చెయ్యాలి అని ఆమెను అడిగేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఆమె దగ్గరకు వచ్చారు. ఎఫ్రాయిము కొండ దేశంలో రామా, బేతేలుకు మధ్య దెబోరా యొక్క ఖర్జూర చెట్టు ఉంది. 6బారాకు అను పేరుగల మనిషికి దెబోరా ఒక వర్తమానం పంపింది. ఆమెను కలుసుకునేందుకు రమ్మని ఆమె అతనిని అడిగింది. బారాకు అబీనోయము అనే పేరుగల వాని కుమారుడు. బారాకు నఫ్తాలి ప్రాంతంలోని కెదెషు పట్టణంలో నివసించేవాడు. దెబోరా బారాకుతో ఇలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడు యెహోవా నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ‘వెళ్లి నఫ్తాలి జెబూలూను వంశాల నుండి పదివేల మంది పురుషులను సమావేశపరచి, ఆ మనుష్యులను తాబోరు కొండకు నడిపించు. 7యాబీను రాజు సైన్యాధిపతి సీసెరాను నేను నీ దగ్గరకు రప్పిస్తాను. సీసెరాను, అతని రథాలను, మరియు అతని సైన్యాన్ని కీషోను నది దగ్గరకు నేను రప్పిస్తాను. అక్కడ నీవు సీసెరాను ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను.’”
8అప్పుడు బారాకు, “నీవు నాతో కూడా వస్తే నేను వెళ్లి ఈ పని చేస్తాను. కాని నీవు నాతో రాకపోతే, నేనూ వెళ్లను” అని దెబోరాతో చెప్పాడు.
9“ఓ, నేను తప్పకుండా నీతో వస్తాను” అని దెబోరా జవాబిచ్చింది. “కానీ నీ వైఖరి మూలంగా, సీసెరా ఓడించబడినప్పుడు నీవు ఘనత పొందవు. ఒక స్త్రీ సీసెరాను ఓడించేటట్టు యెహోవా చేస్తాడు” అని చెప్పింది.
కనుక బారాకుతో కూడ కెదెషు పట్టణానికి దెబోరా వెళ్లింది. 10కెదెషు పట్టణం దగ్గర జెబూలూను, నఫ్తాలి వంశాలను బారాకు సమావేశ పరిచాడు. ఆ వంశాల నుండి అతనిని వెంబడించేందుకు పదివేల మంది పురుషులను సమావేశపర్చాడు. దెబోరా కూడా బారాకుతో వెళ్లింది.
11కెనితీ ప్రజలకు చెందిన, హెబెరు అను పేరుగల ఒకడు ఉన్నాడు. (కెనితీ ప్రజలు హోబాబు వంశస్థులు. హోబాబు మోషే భార్యకు సోదరుడు.) జయనన్నీము అనుచోట మస్తకి చెట్టు దగ్గర హెబెరు తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. జయనన్నీము కెదెషు పట్టణానికి దగ్గరగా ఉంది.
12అబీనోయము కుమారుడు బారాకు తాబోరు కొండ దగ్గర ఉన్నాడని సీసెరాతో ఎవరో చెప్పారు. 13కనుక సీసెరా తన తొమ్మిదివందల ఇనుప రథాలను సిద్ధం చేసాడు. సీసెరా తన మనుష్యులందరినీ ఒక్క చోట చేర్చాడు. వారు హారోషెతు హగ్గోయిము పట్టణం నుండి కీషోను నది దగ్గరకు సాగిపోయారు.
14అప్పుడు దెబోరా, “ఈ వేళ నీవు సీసెరాను ఓడించేందుకు యెహోవా సహాయం చేస్తాడు. నీ కోసం యెహోవా ఇప్పటికే మార్గాన్ని చక్కగా తయారు చేశాడని నీకు గట్టిగా తెలుసు” అని బారాకుతో చెప్పింది. కనుక పదివేల మంది మనుష్యులను తాబోరు కొండ నుండి బారాకు నడిపించాడు. 15బారాకు, అతని మనుష్యులు సీసెరా మీద దాడిచేసారు. యుద్ధ సమయంలో సీసెరాను, అతని సైన్యాన్ని, రథాలను యెహోవా కలవరపర్చాడు. ఏమి చేయాలో వారికి తెలియలేదు. అందుచేత బారాకు, అతని మనుష్యులు సీసెరా సైన్యాన్ని ఓడించారు. కానీ, సీసెరా తన రథాన్ని విడిచిపెట్టి కాలినడకన పారిపోయాడు. 16బారాకు సీసెరా సైన్యంతో పోరాటం కొనసాంగించాడు. హారోషెతు, హగ్గోయిము వరకూ కూడా సీసెరా రథాలను, సైన్యాన్ని బారాకు, అతని మనుష్యులు తరిమి వేసారు. బారాకు, అతని మనుష్యులు వారి ఖడ్గాలను ఉపయోగించి సీసెరా మనుష్యులను చంపివేసారు. సీసెరా మనుష్యులలో ఒక్కడు కూడా ప్రాణంతో విడువబడలేదు.
17కానీ సీసెరా పారిపోయాడు. యాయేలు అను స్త్రీ నివసిస్తున్న గుడారం దగ్గరకు అతడు వచ్చాడు. యాయేలు హెబెరు అనువాని భార్య. అతడు కెనితీ ప్రజల్లో ఒకడు. హెబెరు కుటుంబం హసోరు రాజగు యాబీనుతో సమాధానంగా ఉంది. కనుక సీసెరా యాయేలు గుడారానికి పరుగెత్తాడు. 18సీసెరా రావటం యాయేలు చూసింది గనుక అతనిని కలుసుకొనేందుకు ఆమె బయటకు వెళ్లింది. యాయేలు, “అయ్యా, నా గుడారంలోనికి రండి. రండి, భయపడవద్దు” అని సీసెరాతో చెప్పింది. కనుక సీసెరా, యాయేలు గుడారంలోనికి వెళ్లాడు. ఆమె అతనిని గొంగళితో కప్పింది.
19“నాకు దాహంగా వుంది. దయచేసి తాగేందుకు నాకు కొంచెం నీళ్లు ఇవ్వు” అన్నాడు సీసెరా యాయేలుతో. జంతు చర్మంతో చేయబడిన ఒక బుడ్డి యాయేలు దగ్గర ఉంది. అందులో ఆమె పాలు పోసి ఉంచింది. సీసెరా తాగటానికి యాయేలు ఆ పాలు ఇచ్చింది. అప్పుడు ఆమె సీసెరాను కప్పివేసింది.
20అప్పుడు సీసెరా యాయేలుతో, “వెళ్లి, గుడార ద్వారం దగ్గర నిలువబడు. ఎవరైనా అటువైపు వచ్చి, ‘లోపల ఎవరైనా ఉన్నారా?’ అని అడిగితే ‘లేరు’ అని చెప్పు” అన్నాడు.
21కానీ యాయేలు ఒక గుడారపు మేకును, ఒక సుత్తెను చూసింది. యాయేలు త్వరగా సీసెరా దగ్గరకు వెళ్లింది. సీసెరా చాలా అలసిపోయినందువల్ల, నిద్రపోతున్నాడు. యాయేలు గుడారపు మేకును సీసెరా కణతల మీద పెట్టి, సుత్తెతో దిగ గొట్టేసింది. ఆ గుడారపు మేకు సీసెరా కణతల్లో నుండి నేల మీదికి దిగిపోయింది. సీసెరా మరణించాడు.
22సరిగ్గా అప్పుడే సీసెరా కోసం వెదుక్కొంటూ బారాకు యాయేలు గుడారంవైపు వచ్చాడు. యాయేలు బారాకును కులుసుకొనేందుకు బయటకు వెళ్లి, “ఇక్కడ లోపలికి రా, నీవు వెదుకుతున్న మనిషిని నేను నీకు చూపిస్తాను” అంది. కనుక బారాకు యాయేలుతో కలిసి గుడారంలో ప్రవేశించాడు. అక్కడ కణతల్లో నుండి నేలమీదికి గుడారపు మేకు దిగిపోయి, చచ్చిపడి ఉన్న సీసెరా బారాకుకు కనిపించాడు.
23ఆ రోజు కనాను రాజు యాబీనును ఇశ్రాయేలు ప్రజలకోసం దేవుడు ఓడించాడు. 24కనుక ఇశ్రాయేలు ప్రజలు కనాను రాజు యాబీనును ఓడించటంతో మరింత బలవంతులయ్యారు. కనాను రాజు యాబీనును ఇశ్రాయేలు ప్రజలు చివరికి నాశనం చేసారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in