యెహెజ్కేలు 18
18
నిజమైన న్యాయం
1యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు: 2“మీరీ సామెత వల్లిస్తూ ఉంటారు:
‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్ష తింటే
పిల్లలపండ్లు పులిశాయి!’ అని.
ఇలా మీరెందుకు అంటూ వుంటారు? మీరు పాపంచేస్తే, మీ బదులు భవిష్యత్తులో మరెవ్వడో శిక్షింపబడతాడని మీరనుకుంటున్నారు.”
3కాని నా ప్రభువైన యెహోవా చెబుతున్నదేమంటే, “నా జీవ ప్రమాణంగా ఇశ్రాయేలు ప్రజలు ఈ సామెత ఇక మీదట నిజమని నమ్మరని నేను మీకు ఖచ్చితంగా చెబుతున్నాను! 4నేను ప్రతి వ్యక్తినీ ఒకే రకంగా చూస్తాను. ఆ వ్యక్తి తండ్రిగాని, బిడ్డగాని కావచ్చు. పర్వాలేదు. ఎవరైతే పాపం చేశారో ఆ వ్యక్తులే చనిపోతారు!
5“మంచి మనిషి ఎవరైనా వుంటే, ఆ వ్యక్తి జీవిస్తాడు! ఆ మంచి వ్యక్తి ప్రజలయెడల నీతిగా న్యాయంగా వుంటాడు. 6ఆ సజ్జనుడు పర్వతాలమీదికి వెళ్లి, అక్కడ బూటకపు దేవతలకు అర్పించిన నైవేద్యాలను తినడు. అతడు ఇశ్రాయేలులో నెలకొల్పిన రోత విగ్రహాలను ప్రార్థించడు. అతడు తన పొరుగువాని భార్యతో వ్యభిచరించే పాపానికి ఒడిగట్టడు. తన భార్య ముట్టయినప్పుడు ఆమెతో సంభోగించడు. 7ఆ సజ్జనుడు ప్రజల మంచితనాన్ని ఆసరాగా తీసుకోడు, ఎవ్వరేగాని అతని వద్దకు అప్పుకు వచ్చినప్పుడు, మంచి వ్యక్తి వస్తువులను తాకట్టు#18:7 తాకట్టు దానిని తీర్చలేనప్పుడు అప్పు ఇచ్చిన వాడు ఆ వస్తువులను తీసుకొంటాడు. అప్పు చెల్లించలేని వాని బట్టలను తీసికొనుట మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధం. చూడండి ద్వితీ. 24:12-13. పెట్టుకొని డబ్బు ఇస్తాడు. అప్పు తీసుకొన్నవాడు తిరిగి చెల్లించినప్పుడు, సజ్జనుడు తన డబ్బు తీసుకొని తాకట్టు వస్తువులను ఇచ్చివేస్తాడు. ఆకలిగొన్న వారికి సజ్జనుడు అన్నం పెడతాడు. కట్టు బట్టలు లేక బాధపడేవారికి అతడు వస్త్రదానం చేస్తాడు. 8అప్పు కోరి అతనిని ఆశ్రయిస్తే మంచి వ్యక్తి ఆ వచ్చిన వానికి డబ్బు ఇస్తాడు. కాని అతడా ఋణానికి వడ్డీ తీసుకోడు. మంచివాడు కపటంగా ప్రవర్తించటానికి నిరాకరిస్తాడు. అతడు ప్రతి మనిషి పట్ల ఎల్లప్పుడూ ఉదారంగా ప్రవర్తిస్తాడు. ప్రజలతనిని నమ్మవచ్చు. 9అతడు నా కట్టడలను అనుసరిస్తాడు. అతడు నా నిర్ణయాలను గురించి ఆలోచించి, ధర్మవర్తనుడై నమ్మదగినవాడుగా వుండటం నేర్చుకుంటాడు. అతడు సజ్జనుడు. అందుచేత అతడు జీవిస్తాడు.
10“కాని ఆ మంచి వ్యక్తికీ అటువంటి మంచి పనులేవీ చేయని ఒక కుమారుడు వుండవచ్చు. ఆ కుమారుడు వస్తువులను దొంగిలించి, నరహత్య చేయవచ్చు. 11అతడు ఈ చెడ్డ పనులలో దేనినైనా చేయవచ్చు. పర్వతాల మీదకి వెళ్లి బూటకపు దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలను తినవచ్చు. ఆ చెడ్డ కుమారుడు తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించి పాపం చేయవచ్చు. 12అతడు పేదలను, నిస్సహాయులను అలక్ష్యము చేయవచ్చు. అతడు ప్రజల మంచితనాన్ని వినియోగ పర్చుకోవచ్చు. అప్పు తీసుకున్నవాడు సొమ్ము చెల్లించినప్పుడు, అతడు తాకట్టు వస్తువును తిరిగి ఇచ్చివేయక పోవచ్చు. ఆ చెడ్డ కుమారుడు రోత పుట్టించే విగ్రహాలను ఆరాధించి, ఇతర భయంకరమైన పనులు చేయవచ్చు. 13ఆ దుష్టుడైన కుమారుని వద్ద డబ్బు అప్పు తీసుకొనే అవసరం ఎవరికైన కలుగవచ్చు. అతడు వానికి అప్పు ఇవ్వవచ్చు. కాని, అతడిచ్చిన అప్పుమీద వడ్డీ చెల్లించమని అప్పుదారుని అతడు పీడిస్తాడు. అందువల్ల ఆ చెడ్డ కుమారుడు జీవించడు. అతడు చేసిన ఘోరమైన పనులకు అతడు చంపబడతాడు. పైగా అతని చావుకు అతడే బాధ్యుడు.
14“ఇప్పుడా దుష్టుడైన కుమారునికి ఒక కుమారుడు కలుగవచ్చు. ఈ కుమారుడు తన తండ్రి చేసే దుష్కార్యాలను చూసి, వాటిని నిరసించి తన తండ్రిలాగా ఉండకపోవచ్చు. వాడు ప్రజలందరినీ సమాదాన పరుస్తాడు. 15ఆ మంచి కుమారుడు కొండల మీదికి వెళ్లి చిల్లర దేవుళ్లను ఆరాధించడు, ఆ దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలను తినడు. ఇశ్రాయేలులో నెలకొల్పిన రోత విగ్రహాలకు అతడు ప్రార్థన చేయడు. అతడు తన పొరుగువాని భార్యతో వ్యభిచార పాపానికి ఒడిగట్టడు. 16ఆ మంచి కుమారుడు ప్రజల మంచితనాన్ని ఉపయోగించు కోకుండా ఉండవచ్చు. ఏ వ్యక్తి అయినా తన వద్దకు అప్పుకోరివస్తే, అతడు వస్తువులు తాకట్టు పెట్టుకొని డబ్బు ఇస్తాడు. మళ్లీ అప్పు తీసుకొన్నవాడు డబ్బు చెల్లిస్తే, ఆ మంచి కుమారుడు తాకట్టు వస్తువులు తిరిగి ఇచ్చివేస్తాడు. మంచి కుమారుడు ఆకలిగొన్న వారికి అన్నం పెడతాడు. అవసరమైన వారికి అతడు వస్త్రదానం చేస్తాడు. 17అతడు పేదలకు సహాయం చేస్తాడు. ఎవరైనా తనవద్ద అప్పు తీసుకో తలంచితే, మంచి కుమారుడు అతనికి డబ్బు ఇస్తాడు. కాని అతడు ఆ అప్పుమీద వడ్డీ తీసుకొనడు! మంచి కుమారుడు నా న్యాయాన్ని శిరసావహిస్తాడు. నా కట్టడలను పాటిస్తాడు. తన తండ్రి చేసిన పాపాలకు ఆ మంచి కుమారుడు చంపబడడు! ఆ మంచి కుమారుడు జీవిస్తాడు. 18తండ్రి ప్రజలను బాధించవచ్చు. వస్తువులను దొంగిలించవచ్చు. అతడు అతని ప్రజలకు ఏ మంచిని ఎన్నడూ చేసియుండడు! ఆ తండ్రి తన పాపాల కారణంగానే చనిపోతాడు. అయితే, కుమారుడు మాత్రం అతని తండ్రి పాపాలకు శిక్షింపబడడు.
19“తన తండ్రి పాపాలకు కుమారుడు ‘ఎందుకు చంపబడడు?’ అని నీవు అడుగవచ్చు. అందుకు కారణం కుమారుడు న్యాయవర్తనుడై మంచి పనులు చేయటమే! అతడు నా కట్టడలను మిక్కిలి శ్రద్ధగా అనుసరించి నడచుకొన్నాడు! అందువల్ల అతడు జీవిస్తాడు. 20చంపబడేది పాపాలకు ఒడిగట్టిన వ్యక్తి మాత్రమే! ఒక కుమారుడు అతని తండ్రి పాపాలకు శిక్షింపబడడు. ఒక తండ్రి తన కుమారుడు చేసిన తప్పులకు గాను శిక్షింపబడడు. ఒక మంచి వ్యక్తి మంచి తనం అతనికి మాత్రమే చెంది ఉంటుంది. ఒక చెడ్డ వ్యక్తి చెడుతనం అతనికి మాత్రమే పరిమితమై ఉంటుంది.
21“ఒకవేళ చెడ్డ వ్యక్తి తన జీవిత విధానాన్ని మార్చుకుంటే అతడు జీవిస్తాడు. అతడు చనిపోడు. అతడు గతంలో చేసిన చెడ్డపనులన్నీ కొనసాగించటం మానివేస్తాడు. నా కట్టడలన్నీ అతడు శ్రద్ధతో పాటిస్తాడు. అతడు న్యాయవర్తనుడై, మంచివాడు అవుతాడు. 22అతడు చేసిన చెడ్డకార్యాలను దేవుడు గుర్తుపెట్టుకోడు. అప్పుడు దేవుని దృష్టిలో అతని మంచి తనమే వుంటుంది! అందవల్ల ఆ వ్యక్తి జీవిస్తాడు!”
23నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “చెడ్డవాళ్లంతా చనిపోవాలని నేను కోరుకోవటం లేదు. వారు జీవించేటందుకు వారు తమ జీవన విధానం మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను!
24“ఇప్పుడు ఒక మంచి వ్యక్తి తన మంచితనాన్ని విడనాడవచ్చు. తన జీవన విధానాన్ని మార్చుకొని గతంలో చెడ్డమనిషి చెసిన ఘోరమైన పాపాలన్నీ చెయవచ్చు. అలాంటి వ్యక్తి జీవిస్తాడా? కావున ఆ మంచి మనిషి మారిపోయి చెడ్డవాడయితే, అతడు పూర్వం చేసిన మంచి పనులేవీ దేవుడు గుర్తు పెట్టుకోడు. ఆ వ్యక్తి తనకు వ్యతిరేకి అయ్యాడనీ, పాపం చేయటం మొదలు పెట్టాడనీ మాత్రం దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. అందువల్ల అతని పాపాల కారణంగా అతడు చనిపోతాడు.”
25దేవుడు ఇలా చెప్పాడు: “ప్రజలారా మీరు, ‘మా ప్రభువైన దేవుడు న్యాయంగా ప్రవర్తించడు’ అని అంటారు. కాని ఇశ్రాయేలు వంశములారా, వినండి. నేను న్యాయంగానే ఉన్నాను. మీరే న్యాయంగా లేరు. 26ఒక మంచి మనిషి మారిపోయి, చెడ్డవాడైతే అతని చెడ్డకార్యాలకు ఫలితంగా అతడు చనిపోతాడు. 27ఒక చెడ్డ వ్యక్తి మారి, మంచివాడై, మంచికార్యాలు చేస్తే, అతడు తన జీవితాన్ని రక్షించుకుంటాడు. అతడు బతుకుతాడు! 28తాను పూర్వం ఎంత చెడ్డవాడో తెలుసుకొని, నావద్దకు తిరిగి వచ్చిన వాడవుతాడు. తాను గతంలో చేసిన చెడ్డకార్యాలు మళ్లీ చేయటం మానటంతో అతడు జీవిస్తాడు! అతడు మరణించడు!”
29ఇశ్రాయేలు ప్రజలు, “అది న్యాయం కాదు! మా ప్రభువైన యెహోవా న్యాయంగా వుండనేరడు!” అని అన్నారు.
అందుకు దేవుడు ఇలా అన్నాడు: “నేను న్యాయంగానే ఉన్నాను. మీరే న్యాయంగా లేరు. 30ఓ ఇశ్రాయేలు వంశమా, ఎందువల్లనంటే, నేను ప్రతి వ్యక్తికీ అతను చేసిన కార్యాలను అనుసరించి న్యాయనిర్ణయం చేస్తాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “కావున, మీరు నా వద్దకు తిరిగిరండి. చెడుకార్యాలు చేయటం మానండి! ఆ ఘోరమైన వస్తువులు మీరు పాపం చేయటానికి కారణం కానీయకండి! 31మీరు చేసిన భయంకర వస్తువులన్నీ పారవేయండి. అవన్నీ కేవలం మీరు పాపం చేయటానికే దోహదం చేస్తాయి! మీ హృదయాలను, ఆత్మలను మార్చుకోండి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని మీరెందుకు చనిపోయేలాగు చేసుకొంటున్నారు? 32నేను మిమ్మల్ని చంపకోరటం లేదు! దయచేసి నా వద్దకు తిరిగి రండి. జీవించండి!” ఆ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పాడు.
Currently Selected:
యెహెజ్కేలు 18: TERV
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International