YouVersion Logo
Search Icon

యెహెజ్కేలు 17

17
గ్రద్ద మరియు ద్రాక్ష
1తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు, 2“నరపుత్రుడా! ఇశ్రాయేలు వంశానికి ఈ కథ వినిపించు. దాని అర్థమేమిటో వారినడుగు. 3వారికి ఇలా చెప్పు:
“‘పెను రెక్కల గ్రద్ద ఒకటి లెబానోనుకు వచ్చింది.
మచ్చలుగల ఈకలు ఆ గ్రద్దకు మెండుగా ఉన్నాయి.
4ఆ పక్షిరాజు ఆ పెద్ద దేవదారు వృక్షపు (లెబానోను) తల తుంచివేసింది.
తెంచిన కొమ్మను కనానులోని వ్యాపారస్తుల దేశంలో నాటింది.
5కనాను నుండి పిదప కొన్ని విత్తనాల (ప్రజల)ను ఆ గ్రద్ద తీసుకుంది.
సారవంతమైన భూమిలో వాటిని నాటింది. అది వాటిని మంచి నదీతీరాన నాటింది.
6ఆ విత్తనం మొలకెత్తి ద్రాక్షా చెట్టయ్యింది.
అది మంచి ద్రాక్షాలత.
ఆ మొక్క ఎత్తుగా లేదు.
అయినా అది ఎక్కువ విస్తీర్ణంలో పాకింది.
అది కొమ్మలు తొడిగింది.
చిన్న కొమ్మలు చాలా పొడుగ్గా పెరిగాయి.
7మరో పెద్ద రెక్కల గ్రద్ద ద్రాక్షా మొక్కను చూసింది.
ఆ గ్రద్దకు చాలా ఈకలు ఉన్నాయి.
ఈ క్రొత్త గ్రద్ద తనను సంరక్షించాలని ఆ ద్రాక్షాలత కోరింది.
అందువల్ల తన వేళ్లు గ్రద్ద వైపు పెరిగేలా చేసింది ఆ మొక్క.
దాని కొమ్మలు ఆ గ్రద్ద వైపుకే విస్తరించాయి.
అది నాటబడిన పొలాన్ని అధిగమించింది.
దాని కొమ్మలు ప్రాకాయి.
తనకు నీళ్లు పోయమని ద్రాక్షాచెట్టు క్రొత్త గ్రద్దను కోరింది.
8సారవంతమైన భూమిలో నాటబడింది ద్రాక్షామొక్క. మంచి నీటివనరు వున్నచోట నాట బడింది.
దాని కొమ్మలు బాగా పెరిగి, కాపు కాయవలసి ఉంది.
అది ఎంతో మేలురకం ద్రాక్షాలత అయివుండేది.’”
9నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
“మరి ఆ మొక్క విజయం సాధిస్తుందని మీరనుకుంటున్నారా?
లేదు! ఆ క్రొత్త గ్రద్ద మొక్కను భూమినుండి పెరికివేస్తుంది.
మొక్క వేళ్లను గ్రద్ద నరికివేస్తుంది. వున్న కాయలన్నీ అదే తినేస్తుంది.
క్రొత్త ఆకులన్నీ ఎండి రాలిపోతాయి.
మొక్క చాలా బలహీనమవుతుంది.
మొక్కను వేళ్లతో లాగివేయటానికి అది గట్టి ఆయుధాలు పట్టటం గాని, బలమైన సైన్య సహాయాన్ని గాని తీసుకోదు.
10అది నాటబడిన చోట మొక్క పెరుగుతుందా?
లేదు! వేడి తూర్పు గాలులు వీస్తాయి. దానితో మొక్క వాడి, చనిపోతుంది.
అది నాటిన దగ్గరే చనిపోతుంది.”
సిద్కియా రాజు శిక్షింపబడ్డాడు
11యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 12“ఇశ్రాయేలు ప్రజలకు ఈ కథ వివరించు. ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ నాపై తిరుగుబాటు చేస్తూవున్నారు. వారికి ఈ విషయాలు వివరించు. మొదటి పక్షిరాజు నెబుకద్నెజరు. అతడు బబులోను (బాబిలోనియా) రాజు. అతడు యెరూషలేముకు వచ్చి రాజును, ఇతర పెద్దలను తీసుకొని పోయాడు. వారిని బబులోనుకు తీసుకొని వెళ్లాడు. 13పిమ్మట రాజ కుటుంబంలోని ఒకనితో నెబుకద్నెజరు ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. ఒక వాగ్దానం చేయమని అతనిని నెబుకద్నెజరు ఒత్తిడి చేశాడు. అందువల్ల అతడు నెబుకద్నెజరు పట్ల రాజభక్తి కలిగి వుండటానికి మాట ఇచ్చాడు. నెబుకద్నెజరు ఇతనిని యూదాకు రాజుగా నియమించాడు. తరువాత అతడు శక్తియుక్తులున్న మనుష్యులందరినీ యూదా నుండి తీసుకొనిపోయాడు. 14దానితో యూదా ఒక బలహీన రాజ్యంగా మారిపోయింది. అందువల్ల అది రాజైన నెబుకద్నెజరును ఎదిరించలేక పోయింది. యూదా యొక్క నూతన రాజుతో చేసుకొన్న ఒడంబడికను ఆచరించేలా నెబుకద్నెజరు ప్రజలపై ఒత్తిడి తెచ్చాడు. 15అయినప్పటికీ ఈ క్రొత్త రాజు నెబుకద్నెజరుపై తిరుగుబాటు ప్రయత్నం చేశాడు! అతడు తన దూతలను ఈజిప్టుకు పంపి సహాయం అర్థించాడు. క్రొత్తరాజు అనేక గుర్రాలను, సైనికులను అడిగాడు. మరి ఈ నూతన యూదా రాజు విజయం సాధిస్తాడని ఇప్పుడు మీరనుకుంటున్నారా? ఒడంబడికను ఉల్లంఘించి, శిక్షనుండి తప్పించుకునేటంత శక్తి ఈ క్రొత్త రాజుకు ఉన్నదని మీరనుకుంటున్నారా?”
16నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నా జీవ ప్రమాణంగా ఈ క్రొత్త రాజు బబులోనులో చనిపోతాడని నిశ్చయంగా చెప్పుతున్నాను! ఈ వ్యక్తిని యూదా రాజుగా నెబుకద్నెజరు నియమించాడు. కాని ఇతడు నెబుకద్నెజరుకు ఇచ్చినమాట నిలబెట్టుకోలేదు. ఈ క్రొత్తరాజు ఒడంబడికను నిరాకరించి విడిచి పెట్టాడు. 17పైగా ఈజిప్టు రాజు యూదా రాజును రక్షించలేడు. అతడు అనేకమంది సైనికులను పంపవచ్చు. కాని ఈజిప్టుకు వున్న మహా బలసంపత్తి యూదాను రక్షించలేదు. నెబుకద్నెజరు సైన్యం నగరాన్ని పట్టుకొనటానికి మట్టిదారులు, మట్టి గోడలు నిర్మిస్తుంది. అనేకమంది చనిపోతారు. 18అయినా యూదా రాజు తప్పించుకోలేడు. ఎందుకంటే, తన ఒడంబడిక అతడు అలక్ష్యం చేశాడు. అతడు నెబుకద్నెజరుకు ఇచ్చిన మాట తప్పాడు.” 19నా ప్రభువైన యెహోవా ఈ ప్రమాణం చేస్తున్నాడు: “నా జీవ ప్రమాణంగా యూదా రాజును శిక్షిస్తానని నిశ్చయంగా చెప్పుతున్నాను. ఎందువల్లనంటే, అతడు నా హెచ్చరికలను లెక్కచేయలేదు. అతడు నా ఒడంబడికను ఉల్లంఘించాడు. 20నేను నావల పన్నుతాను. అతడందులో చిక్కుకొంటాడు. అతనిని నేను బబులోనుకు తీసుకొనివచ్చి అక్కడ శిక్షిస్తాను. అతడు నా పై తిరుగుబాటు చేశాడు గనుక నేనతనిని శిక్షిస్తాను. 21నేనతని సైన్యాన్ని నాశనం చేస్తాను. గొప్ప యోధులగు అతని సైనికులను చంపివేస్తాను. చావగా మిగిలిన వారిని చెల్లాచెదురు చేస్తాను. నేనే యెహోవాననీ, నీకు ఈ మాటలు చెప్పినది నేనే అనీ, నీవప్పుడు తెలుసుకొంటావు.”
22నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు:
“పిమ్మట ఎత్తైన దేవదారు వృక్షపు కొమ్మనొకటి నేను తీసుకొంటాను.
వృక్షపు పైభాగాన్నుండి ఒక చిన్న రెమ్మను తీసుకొంటాను.
నేనే దానిని చాలా ఎత్తైన పర్వతం మీద నాటుతాను.
23నేనే దానిని ఇశ్రాయేలులోని ఒక ఎత్తైన పర్వతంపై నాటుతాను.
ఆ కొమ్మ ఒక వృక్షంలా పెరుగుతుంది.
అది బాగా కొమ్మలు వేసి, పండ్లు కాస్తుంది.
అది ఒక అందమైన దేవదారు వృక్షమవుతుంది.
దాని కొమ్మలపై అనేకమైన పక్షులు కూర్చుంటాయి.
అనేకమైన పక్షులు దాని కొమ్మల నీడల్లో నివసిస్తాయి.
24“నేను పొడవైన వృక్షాలన్నిటినీ నేలకు పడేస్తానని ఇతర చెట్లన్నీ అప్పుడు తెలుసుకొంటాయి.
చిన్న చెట్లను పెరగనిచ్చి మహావృక్షాలను చేస్తానని కూడా అవి తెలుసుకొంటాయి.
పచ్చని చెట్లు ఎండిపోయేలా,
ఎండిన మోడులు చిగురించేలా చేస్తాను.
నేనే యెహోవాను
నేనేదైనా చేస్తానని చెప్పితే నేనది తప్పక చేస్తాను!”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in