నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు:
“పిమ్మట ఎత్తైన దేవదారు వృక్షపు కొమ్మనొకటి నేను తీసుకొంటాను.
వృక్షపు పైభాగాన్నుండి ఒక చిన్న రెమ్మను తీసుకొంటాను.
నేనే దానిని చాలా ఎత్తైన పర్వతం మీద నాటుతాను.
నేనే దానిని ఇశ్రాయేలులోని ఒక ఎత్తైన పర్వతంపై నాటుతాను.
ఆ కొమ్మ ఒక వృక్షంలా పెరుగుతుంది.
అది బాగా కొమ్మలు వేసి, పండ్లు కాస్తుంది.
అది ఒక అందమైన దేవదారు వృక్షమవుతుంది.
దాని కొమ్మలపై అనేకమైన పక్షులు కూర్చుంటాయి.
అనేకమైన పక్షులు దాని కొమ్మల నీడల్లో నివసిస్తాయి.